Telugu Global
Sports

సెప్టెంబర్ 3న ప్రపంచకప్ కు భారతజట్టు ఎంపిక!

భారత్ వేదికగా జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును సెప్టెంబర్ 3న ప్రకటించనున్నారు.

సెప్టెంబర్ 3న ప్రపంచకప్ కు భారతజట్టు ఎంపిక!
X

సెప్టెంబర్ 3న ప్రపంచకప్ కు భారతజట్టు ఎంపిక!

భారత్ వేదికగా జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును సెప్టెంబర్ 3న ప్రకటించనున్నారు.

ఐసీసీ వన్డే ( 2023 ) ప్రపంచకప్ లో పాల్గొనే 15 మందిసభ్యుల భారతజట్టును సెప్టెంబర్ 3న బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించనుంది. ప్రస్తుతం 18 మంది సభ్యులున్న భారతజట్టులోని ముగ్గురికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు.

ప్రపంచకప్ కు సన్నాహకంగా మరికొద్దిగంటల్లో ప్రారంభంకానున్న 2023 ఆసియాకప్ టోర్నీలో 18 మంది సభ్యులతో భారత్ బరిలో నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్, హార్థిక్ పాండ్యా వైస్-కెప్టెన్లుగా ఉన్న భారతజట్టులోని ఇతర సభ్యుల్లో శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ, ఇషాన్ కిషన్ తో పాటు విజిటింగ్ సభ్యుడిగా సంజు శాంసన్ ఉన్నారు.

ఈ 18 మందిలో 15 మందికి మాత్రమే ప్రపంచకప్ లో పాల్గొనే జట్టులో చోటు దక్కనుంది. దీంతో ముగ్గురు సభ్యులను పక్కన పెట్టక తప్పదు.

డైలమాలో రాహుల్ ఫిట్ నెస్....

వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చినట్లు బీసీసీఐ ప్రకటించడం, ఆసియాకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు కల్పించడం జరిగిపోయాయి. అయితే..రాహుల్ ఇంకా నూటికి నూరుశాతం ఫిట్ నెస్ సాధించలేదేని, ఆసియాకప్ గ్రూప్ - ఏ లీగ్ లోని మొదటి రెండుమ్యాచ్ లకూ దూరంగా ఉంటాడని టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.

సెప్టెంబర్ 2న పాకిస్థాన్, 5న నేపాల్ జట్లతో జరిగే లీగ్ మ్యాచ్ లకు రాహుల్ అందుబాటులో ఉండే అవకాశమే లేదు. ఆ తర్వాత జరిగే సూపర్ -4 రౌండ్ నుంచే రాహుల్ తుదిజట్టులోకి చేరే అవకాశం ఉంది.

అందుకే ప్రయోగాలు - ద్రావిడ్!

భారతజట్టులో..ప్రధానంగా వన్డేజట్టులో అతిగా ప్రయోగాలు చేస్తున్నట్లుగా వస్తున్న విమర్శలకు భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ బదులిచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలక స్థానాలుగా ఉండే రెండోడౌన్, మూడో డౌన్లలో ఆడే రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఒకేసమయంలో గాయపడడంతో..ఆ రెండుస్థానాలలోనే ప్రయోగాలు చేస్తూ వచ్చామని, మొత్తం 10 మంది వేర్వేరు ఆటగాళ్లను 4, 5వ నంబర్ స్థానాలలో ఆడించాల్సి వచ్చిందని ద్రావిడ్ గుర్తు చేశాడు.

ప్రస్తుత ఆసియాకప్ లో శ్రేయస్ అయ్యర్ పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో తిరిగి జట్టులో చేరడంతో ఓ స్థానం భర్తీ అయ్యిందని , రాహుల్ సైతం పూర్తిగా కోలుకొంటే జట్టు కష్టాలు తీరుతాయని మీడియా సమావేశంలో ప్రకటించాడు.

ఆ బాధ ఏంటో నాకు తెలుసు- రోహిత్

ఆసియాకప్, ప్రపంచకప్ లాంటి ప్రధాన టోర్నీలలో పాల్గొనే జట్లలో అవకాశం దక్కకపోతే ఎంతబాధగా ఉంటుందో తనకు తెలుసునని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

ప్రపంచకప్ లో పాల్గొనే జట్టులో కేవలం 15 మందికి మాత్రమే చోటు ఉంటుందని, ప్రస్తుతం ఉన్న 18 మందిలో ముగ్గురిని పక్కక పెట్టక తప్పదని రోహిత్ స్పష్టం చేశాడు.

మొత్తం 18 మంది సభ్యులతో తమ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, తాను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లు, జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నవారికి కారణాలు వివరిస్తున్నట్లు తెలిపాడు.

2011 వన్డే ప్రపంచకప్ సమయంలో తనను పక్కన పెట్టారని, చాలా బాధకలిగిందని, పట్టుదలతో ఆడి సత్తా చాటుకోడం ద్వారా తిరిగి జట్టులో చేరానని రోహిత్ గుర్తు చేశాడు.

తమకు రాగద్వేషాలు, వ్యక్తిగత ఇష్టాలు ఉండనే ఉండవని, జట్టు ఎంపిక సమయంలో సమష్టి ప్రయోజనాలు, కూర్పు, సమతౌల్యం, ఆటగాళ్ల ఫామ్ లాంటి అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటారని వివరించారు.

ప్రపంచకప్ కు ఎంపిక చేసే 15మంది సభ్యులజట్టులో చోటు దక్కని ఆ ముగ్గురు ఎవరో..సెప్టెంబర్ 3న తేలిపోనుంది.

First Published:  29 Aug 2023 12:15 PM GMT
Next Story