Telugu Global
Sports

భారతక్రికెట్ బోర్డా..మజాకానా!..1159 కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపు!

దేశంలోని క్రీడాసంఘాలన్నీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొంటుంటే..బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వానికే పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలు సమకూర్చుతోంది.

భారతక్రికెట్ బోర్డా..మజాకానా!..1159 కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపు!
X

దేశంలోని క్రీడాసంఘాలన్నీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొంటుంటే..బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వానికే పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలు సమకూర్చుతోంది...

ప్రపంచంలోనే అత్యంతభాగ్యవంతమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) మరో సంచలనం సృష్టించింది. భారత క్రీడారంగ చరిత్రలోనే అత్యంత మొత్తంలో ఆదాయపు పన్ను చెల్లించిన క్రీడాసంఘంగా నిలిచింది.

ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి బీసీసీఐ గతంలోఎన్నడూలేనంతగా 1159 కోట్ల రూపాయల ఆదాయ‌ప‌న్ను చెల్లించింది.

గత ఐదేళ్ల కాలంలో బీసీసీఐకి వచ్చిన ఆదాయం, వివిధ ఖర్చుల వివరాలను ఐటీ రిట‌ర్న్ ల ద్వారా ఫైల్ చేసినట్లు మంత్రి వివరించారు.

ఇదీ బీసీసీఐ లెక్క.....

అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ ) నుంచి తన వాటాగా అందే మొత్తంతో పాటు..ఐపీఎల్ నిర్వహణతోనూ బీసీసీఐ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ వస్తోంది.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ధ‌నిక లీగ్‌గా ఐపీఎల్‌కు గుర్తింపు వ‌చ్చింది. 2020-21 ఆర్థిక సంవ‌త్సంలో బీసీసీఐ సుమారు 844.92 కోట్ల ఇన్‌కం ట్యాక్స్ చెల్లించింది. 2019-20లో 882.29 కోట్లు చెల్లించింది. 2021-22 సీజ‌న్‌లో బీసీసీఐ సుమారు 7606 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక ఆ సీజ‌న్‌లో 3064 కోట్లు ఖ‌ర్చు చేసింది. 2020-21లో 4735 కోట్లు ఆర్జించ‌గా, సుమారు 3080 కోట్లు ఖ‌ర్చు చేసింది.

ప్రపంచ క్రికెట్ ఖజానా భారత్!

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణలో భారత్ తనవంతు పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలికి సమకూరే ఆదాయంలో 80 శాతం భారత క్రికెట్ మార్కెట్ నుంచే

అందుతోంది. కేవలం భారత్ కారణంగానే పెద్దమనుషుల క్రీడ క్రికెట్ మనుగడ సాగించగలుగుతోంది....

క్రికెట్ కు పుట్టినిల్లు ఇంగ్లండే అయినా ప్రస్తుత ప్రపంచ క్రికెట్ కు ఊపిరిపోస్తున్నది భారత్ మాత్రమే. శతకోటి అభిమానుల భారత క్రికెట్ మార్కెట్టే లేకుంటే పెద్దమనుషుల క్రీడ క్రికెట్ అంతరించిపోయే దశకు చేరి ఉండేదే.

ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాలలోని దేశాలకు క్రికెట్ విస్తరించడానికి ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి) చేస్తున్న కృషి వెనుక భారత్ నుంచి అందుతున్న నిధులు ఎనలేని బలాన్ని చేకూర్చుతున్నాయి.

భారత మార్కెట్ నుంచే 80 శాతం నిధులు..

అలనాటి బ్రిటీష్ పాలిత దేశాలకే పరిమితమైన క్రికెట్ కు ఇంగ్లండ్ పుట్టినిల్లుగా ఉంటే.....భారత్ ధనాగారంగా ఉంటూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఐసీసీకి అందే నిధులు, రాబడిలో 80 శాతం భారత క్రికెట్ మార్కెట్ నుంచే అందుతోంది.

మిగిలిన 20 శాతం ఆదాయం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే దేశాల నుంచి సమకూరుతోంది.

విశ్వవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి, విస్తరణకు పాటుపడుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పోటీలు నిర్వహించడం ద్వారా 612 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జిస్తుంటే...ఇందులో 80 శాతం భారత్ నుంచే సమకూరుతోందంటే ఆశ్చర్యం లేదు.

పురుషుల, మహిళల, జూనియర్ విభాగాలలో పలు రకాల ప్రపంచ పోటీలు నిర్వహించడం, ఆ పోటీలకు స్పాన్సర్లు, ప్రసారహక్కుల విక్రయం ద్వారా ఐసీసీ వేలకోట్ల రూపాయలు సమకూర్చుకొంటూ వస్తోంది.

పోయేది కొండంత..వచ్చేది గోరంత!

దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా ఇటీవలే ముగిసిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో భారత వాటాను పెంచుతూ ప్రతిపాదించిన కొత్త రెవెన్యూ విధానానికి ఆమోదం లభించింది. దీంతో ఇప్పటి వరకు ఐసీసీ ఆదాయంలో 22.4 శాతం మాత్రమే వాటా దక్కించుకొంటూ వచ్చిన భారత క్రికెట్ నియంత్రణమండలి( బీసీసీఐ) పోరాటం ఫలించి..వాటా శాతాన్ని38.5 శాతానికి పెంచుకోగలిగింది.

ఐపీఎల్ తో డబ్బే డబ్బు.....

గత 16 సీజన్లుగా నిర్వహిస్తూ వస్తున్న ఐపీఎల్ తో పాటు ఐసీసీ నుంచి అందుతున్న వేలకోట్ల రూపాయల వాటాతో బీసీసీఐ.. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా అవతరించింది.

ఐపీఎల్ ఫ్రాంచైజీల విక్రయం, ప్రసార హక్కులు, టైటిల్ స్పాన్సర్లు, కిట్ స్పాన్సర్లు, ఇన్ స్టేడియా హక్కులు, డిజిటల్ హక్కులు..ఇలా రకరకాల మార్గాల ద్వారా బీసీసీఐ కాసుల పంట పండించుకొంటోంది.

వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి ఏకంగా 48వేల390 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. మీడియా హక్కుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులో సగభాగాన్ని ఎనిమిది ప్రధాన ప్రాంచైజీలకు పంచనున్నారు. బీసీసీఐ లెక్కల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ 3వేల కోట్ల రూపాయల చొప్పున అందుకోనుంది. కొత్తగా చేరిన గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలకు ప్రస్తుతానికి ఏమీ దక్కదు.

అన్ని వర్గాలకూ తలో కొంత!

మిగతా సగం 24వేల 195 కోట్ల లో 26 శాతం మొత్తాన్ని దేశవాళీ, అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు బోర్డుకు అనుబంధంగా ఉన్న క్రికెట్ సంఘాలకు పంచనున్నారు.

మిగతా 74 శాతంలో 4 శాతాన్ని బీసీసీఐ సిబ్బంది జీతాలకు వెచ్చిస్తారు. మిగతా 70 శాతం మొత్తాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అసోసియేషన్లకు అందిస్తామని బీసీసీఐ చెబుతోంది. ఈ లెక్కన మొత్తం రూ.6,290 కోట్లను దేశవాళీ, అంతర్జాతీయ ఆటగాళ్లకు అందిస్తారు. మిగతా రూ.16,936 కోట్లను బీసీసీఐ అనుబంధ రాష్ట్ర సంఘాలకు పంచనున్నారు.

భారతజట్టులోని అంతర్జాతీయ క్రికెటర్లు ఐపీఎల్, బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజుల రూపంలో ఏడాదికి కనీసం 20 నుంచి 30 కోట్ల రూపాయల వరకూ సంపాదిస్తుంటే...దేశవాళీ క్రికెటర్లు 20 నుంచి 30 లక్షల రూపాయల వరకూ ఆర్జించే స్థాయికి చేరుకోగలిగారు. మహిళా క్రికెటర్లు సైతం పురుషులతో సమానంగా లక్షల రూపాయల మ్యాచ్ ఫీజులు అందుకొంటున్నారు.

భారత క్రికెట్ కు అసమానసేవలు అందించిన గత తరం క్రికెటర్లకు ఆడిన టెస్టులు, వన్డేలు ప్రాతిపదికన నెలవారీ పించన్లు అందచేస్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశంలో జరగని సంక్షేమకార్యక్రమాలను బీసీసీఐ అమలు చేస్తూ వస్తోంది.

క్రికెట్ తో సంబంధం ఉన్న అంపైర్లు, స్కోరర్లు, మ్యాచ్ రిఫరీలు, క్యూరేటర్లు, గ్రౌండ్ సిబ్బందికి సైతం గౌరవప్రదమైన వేతనాలను బీసీసీఐ అందించగలుగుతోంది. భారత ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో 500 కోట్ల రూపాయల ఆదాయం కేవలం 52 రోజుల ఐపీఎల్ నుంచే సమకూరుతోంది.

వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకమండలి హయాంలో 3వేల కోట్ల రూపాయలుగా ఉన్న బీసీసీఐ ఆదాయం ..ఆ తర్వాత సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత 9వేల కోట్ల రూపాయలకు చేరింది. ఆ మొత్తాన్ని రోజర్ బిన్నీ- జే షాల నేతృత్వంలోని బీసీసీఐ మరింతగా పెంచింది.

నిధుల పరంగా భారత క్రికెట్లో ప్రస్తుతం స్వర్ణయుగం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  10 Aug 2023 10:30 AM GMT
Next Story