Telugu Global
Sports

జడేజాకు గాయం...బీసీసీఐ గరంగరం!

భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం పట్ల బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మోకాలి నరం గాయానికి శస్త్ర చికిత్సతో కోలుకుంటున్న జడేజా బాధ్యతతో వ్యవహరించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది.

జడేజాకు గాయం...బీసీసీఐ గరంగరం!
X

క్రికెటర్లకు తమ దేశం తరపున, తమ తమ జట్ల తరపున ఆడుతున్న సమయంలో పలు రకాలుగా గాయాలు కావడం సహజం. అయితే ఆసియా కప్ లాంటి టోర్నీలో పాల్గొనటానికి వెళ్లిన సమయంలో క్రికెట్ తో సంబంధం లేని కార్యకలాపాలలో పాల్గొంటూ భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయపడి, ఆస్పత్రిపాలు కావడాన్ని బీసీసీఐ తప్పుపట్టింది.

స్కీబోర్డింగ్‌తో జడ్డూకి గాయం...

ఆస్ట్రేలియా వేదికగా మరికొద్ది వారాలలో ప్రారంభంకానున్న టీ-20 ప్రపంచకప్‌కు భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో భారత జట్టుకు రవీంద్ర జడేజా తురుపుముక్కలాంటి ఆటగాడు కావడంతో జట్టు సమతూకమంతా అతని పైనే ఆధారపడి ఉంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ ప్రారంభ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల విజయం సాధించడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత హాంకాంగ్ పైనా మ్యాచ్ ఆడాడు. అయితే...ఆ తర్వాత అనుకోని గాయంతో సూపర్-4 రౌండ్ నుంచి జట్టుకు అందుబాటులో లేకుండాపోయాడు. దుబాయ్ లో తాము విడిది చేసిన స్టార్ హోటెల్ బ్యాక్ వాటర్స్ లో స్కీబోర్డ్ గేమ్ ఆడుతూ జడేజా జారిపడటంతో మోకాలికి గాయమైంది. దీంతో ముంబైకి జడేజాను హుటాహుటిన తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు.

Advertisement

శస్త్ర చికిత్స తర్వాత కోలుకొంటున్న జడేజా రానున్నరోజుల్లో బీసీసీఐ నిపుణుల పర్యవేక్షణలో రీహాబిలేషన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నాడు. దీంతో ప్రపంచకప్ ప్రారంభమయ్యే అక్టోబర్ నాటికి జడేజా పూర్తిఫిట్‌నెస్‌తో జట్టుకు అందుబాటులోకి రావడం అనుమానంగా మారింది. జడేజా అందుబాటులో లేకుంటే భారత జట్టు సమతౌల్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. తన మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైందని, తనకు అండగా నిలిచిన బీసీసీఐ, ఫిజియోథెరపిస్ట్, ట్రెయినర్లకు, సహఆటగాళ్లు, అభిమానుల ఆశీసులతో కోలుకొంటున్నానని..త్వరలోనే ఫిట్‌నెస్ కోసం పునరావాస వ్యాయామాలు మొదలు పెడతానని జడేజా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

Advertisement

జడేజా తీరు పట్ల బీసీసీఐ అసహనం...

క్రికెట్‌తో, క్రికెట్ ఫిట్‌నెస్‌తో ఏమాత్రం సంబంధం లేని స్కీబోర్డింగ్ చేస్తూ జడేజా గాయపడటాన్ని బీసీసీఐ తప్పు పట్టింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని జడేజా మరింత బాధ్యతతో ప్రవర్తించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. భారత జట్టుకు తాను ఎంత కీలకమో జడేజాకు తెలుసునని..అయినా క్రికెట్‌తో సంబంధం లేని క్రీడలో ఎందుకు పాల్గొన్నాడో అర్థంకావడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రస్తుత ఆసియాకప్ టోర్నీలో పాకిస్థాన్‌పై 35 పరుగులతో మ్యాచ్ విన్నింగ్‌ స్కోరు సాధించిన జడేజా 2 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుత సీజన్లో ఆడిన 9 టీ-20 మ్యాచ్‌ల్లో జడేజా మొత్తం 8 ఇన్నింగ్స్ లో 201 పరుగులతో 50.25 సగటు నమోదు చేశాడు. 46 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పాటు...బౌలర్‌గా 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్లో సైతం జడేజా అత్యుత్తమంగా రాణించాడు. మూడు టెస్టులు, 5 ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలతో పాటు 328 పరుగులు సాధించాడు. 82.00 సగటుతో 175 పరుగుల నాటౌట్ స్కోరు నమోదు చేశాడు. బౌలర్‌గా 5 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకపై 41 పరుగులకే 5 వికెట్లు సాధించాడు. 2022లో ఇప్పటి వరకూ ఆడిన మూడు వన్డేలలో 36 పరుగులు సాధించాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకి వెన్నెముకలాంటి ఆటగాడు జడేజా గాయం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

Next Story