Telugu Global
Sports

ఆస్తులు, ఆదాయంలో భళా బీసీసీఐ!

భారత క్రికెట్ నియంత్రణ మండలి తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొంటూ దూసుకుపోతోంది. చరస్థిర ఆస్తులు, ఆదాయం, సంక్షేమం, వితరణలో ప్రపంచంలోనే మేటిగా నిలిచిన క్రికెట్ బోర్డుగా చరిత్ర సృష్టించింది.

బీసీసీఐకి నిధుల వరద!
X

బీసీసీఐకి నిధుల వరద!

భారత క్రికెట్ నియంత్రణ మండలి తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొంటూ దూసుకుపోతోంది. చరస్థిర ఆస్తులు, ఆదాయం, సంక్షేమం, వితరణలో ప్రపంచంలోనే మేటిగా నిలిచిన క్రికెట్ బోర్డుగా చరిత్ర సృష్టించింది.

క్రికెట్ అంటే ఒకప్పుడు ఇంగ్లండ్ పేరు మాత్రమే వినిపించేది. అయితే..క్రికెట్ పేరు తలచుకోగానే ఇప్పుడు వినిపించే ఏకైక పేరు భారత్. ప్రపంచ క్రికెట్ కే జీవనాడిగా, కేంద్రబిందువుగా, వేల కోట్ల రూపాయలు సమకూర్చే ఆదాయవనరుగా, అంతర్జాతీయ క్రికెట్ ఖజానాగా భారత క్రికెట్ నిలుస్తూ వస్తోంది.

గత 95 సంవత్సరాలుగా...

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి )ని 1928డిసెంబర్ 4న మద్రాసు నగరంలో తమిళనాడు సొసైటీస్ రిజిష్ట్ర్రేషన్ యాక్టు ప్రకారం ఏర్పాటు చేశారు. మరో ఐదేళ్లలో శతవసంతాల వేడుకలు జరుపుకోనున్నభారత క్రికెట్ బోర్డు తొలిరోజుల్లో నిధుల లేమితో విలవిల లాడినా కాలానుగుణంగా తనను తాను మార్చుకొంటూ ఆర్థికస్వావలంబనతో ఎదుగుతూ వచ్చింది.

ప్రభుత్వం నుంచి పైసా ఆశించకుండా తిరిగి ప్రభుత్వానికే వేలకోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఆర్జించి పెడుతున్న భారత ఏకైక, ఒకే ఒక్క క్రీడాసంస్థ బీసీసీఐ మాత్రమే.

ప్రపంచీకరణ పుణ్యమా అంటూ అంతై ఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోయిన, లబ్దిపొందిన బీసీసీఐ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా గుర్తింపు సంపాదించింది.

18వేల 700 కోట్ల నిఖర ఆస్తులతో....

2023 లెక్కల ప్రకారం భారత క్రికెట్ నియంత్రణ మండలి మొత్తం 18వేల 700 కోట్ల రూపాయల నిఖర ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా చరిత్ర సృష్టించింది.

ఆస్ట్ర్రేలియా క్రికెట్ బోర్డు కంటే 28 రెట్లు భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా అవతరించింది. బీసీసీఐ నిఖర ఆస్తులు 2.25 బిలియన్ డాలర్లు ( 18,700 కోట్లు ), క్రికెట్ ఆస్ట్ర్రేలియా 79 మిలియన్ డాలర్లు ( 660 కోట్ల రూపాయల)తో రెండోస్థానంలో కొనసాగుతోంది.

క్రికెట్ కు పుట్టినిల్లుగా పేరుపొందిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 59 మిలియన్ డాలర్ల నిఖర ఆస్తులతో మూడవ అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా నిలిచింది.

47 మిలియన్ డాలర్ల ఆస్తులతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 6వ స్థానంలో నిలిచింది. బీసీసీఐ నిఖర ఆస్తుల విలువతో పోల్చిచూస్తే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆస్తులు కేవలం 2 శాతం మాత్రమే.

భారత జనాభా 140 కోట్లలో క్రికెట్ ప్రసారాలను వీక్షించేవారే 90 శాతం వరకూ ఉండడంతో మీడియా ప్రసారాల హక్కుల రూపంలో వేల డాలర్లు, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి పడుతోంది.

ఐపీఎల్ తో దశ తిరిగిన బీసీసీఐ....

2008లో బీసీసీఐ ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముహూర్తబలం ఏమిటో కానీ ప్రతి ఐదుసంవత్సరాలకు రెట్లకు రెట్లుగా, కోట్లకు కోట్లుగా ఆదాయం పెరిగిపోతూ వస్తోంది.

ప్రతి ఏడాదీ రెండున్నరమాసాలపాటు సాగే ఐపీఎల్ నిర్వహణ ద్వారా భారత క్రికెట్ బోర్డుకు వివిధ రూపాలలో మ్యాచ్ కు సగటున 100 కోట్ల రూపాయల చొప్పున ఆదాయం సమకూరుతోంది.

2008లో ప్రారంభమైన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 2023 నాటికి వంద రెట్లకు పైగా పెరిగింది. ప్రత్యక్షప్రసార హక్కులు, డిజిటల్ మీడియా హక్కులు, ప్రమోటర్లు, బ్రాండ్ వాల్యూ లాంటి అంశాలలో సీజన్ కో రికార్డు సృష్టిస్తూ ప్రపంచ మేటి ఫుట్ బాల్ లీగ్ లను తలదన్నే స్థితికి చేరుకొంటోంది.

రానున్న కాలంలో అమెరికన్ ఫుట్ బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లను మన ఐపీఎల్ అధిగమించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

భారత ప్రభుత్వానికి చేదోడువాదోడుగా...

భారత ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా ఉన్న 30కి పైగా క్రీడాసంఘాలు ప్రభుత్వం నుంచి నిధులతో మనుగడసాగిస్తూ వస్తుంటే..భారత క్రికెట్ బోర్డు మాత్రం ప్రభుత్వం నుంచి పైసా ఆశించకుండా...ఏటా వివిధ రకాల పన్నుల రూపంలో వందలకోట్ల రూపాయలు ఆర్జించి పెడుతోంది. ఐపీఎల్ నిర్వహణతో భారత ఆర్థిక వ్యవస్థలోకి వేలకోట్ల రూపాయలు వచ్చి చేరుతున్నాయి.

మరోవైపు..బీసీసీఐ తన వార్షిక ఆదాయం నుంచి జాతీయజట్లలోని పురుష, మహిళా క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులతో కోట్ల రూపాయలు వేతనాలుగా చెల్లిస్తోంది. దేశవాళీ రంజీ క్రికెటర్లకు సైతం గణనీయమైన మొత్తాలలోనే ఆదాయాన్ని అందిస్తోంది.

ఏటా వెయ్యి మందికి పెన్షన్లు...

ప్రపంచ క్రీడాచరిత్రలోనే తన మాజీ క్రీడాకారులు, సిబ్బందికి నెలవారీ పెన్షన్లు అందిస్తున్న ఏకైక క్రీడాసంస్థగా, క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

భారత క్రికెట్ కు అసమాన సేవలు అందించిన మాజీ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర సిబ్బందిని కంటికిరెప్పలా కాపాడుకొంటూ వస్తోంది.వివిధ రూపాలలో తనకు వస్తున్న వేలకోట్ల రూపాయల ఆదాయంలో మూడోవంతు భాగం క్రికెటర్ల సంక్షేమం కోసమే వ్యయం చేస్తోంది. తన వంతుగా సహ క్రీడాసంఘాలకు నిధులు అందిస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం భారత్ లో ఓవైపు తన ఉద్యోగులకు పెన్షన్ ఎగ్గొట్టే ఆలోచనతో ప్రభుత్వాలు రకరకాల చట్టాలు చేస్తుంటే...మరోవైపు ప్రభుత్వనుంచి పైసాసాయం ఆశించని భారత క్రికెట్ బోర్డు మాత్రం ప్రస్తుత, గత తరం ఆటగాళ్లను, సిబ్బందిని పలురకాల ఆర్థికసాయంతో ఆదుకొంటూ వస్తోంది.

భారత క్రికెట్ నియంత్రణమండలి తనస్థాయికి తగ్గట్టుగా రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర సిబ్భందికి గత కొద్దిసంవత్సరాలు పెన్షన్ చెల్లిస్తూ వస్తోంది. పురుషుల, మహిళల విభాగాలలో మొత్తం 1000మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర మాజీ సిబ్బందికి నెలవారీ పెన్షన్ చెల్లిస్త్తోన్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

గతంలో కంటే నూరుశాతం అధికంగా పెన్షన్ మొత్తాన్ని పెంచినట్లు బీసీసీఐ కోశాధికారి చెబుతున్నారు.

సచిన్, కపిల్, కుంబ్లేలకు 70వేల పెన్షన్..

భారత క్రికెట్ జట్టుకు గతంలో ఆడిన మాజీ క్రికెటర్లు, అంపైర్లు పాల్గొన్న మ్యాచ్ ల సంఖ్యను బట్టి పెన్షన్ ను ఖరారు చేశారు. ఇప్పటి వరకూ 15వేల రూపాయలుగా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని ఏకంగా 30వేలకు పెంచారు.

భారత క్రికెట్ కు గతంలో అమూల్యసేవలు అందించిన మాజీ క్రికెటర్లు, అంపైర్లు ఎంతో విలువైన వారని, వారిసేవలకు గుర్తింపుగా ప్రస్తుతం చెల్లిస్తున్న పెన్షన్ ను 100 శాతం పెంచామని, జూన్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని చెల్లిస్తామని బోర్డు ప్రకటించింది.

భారత క్రికెట్ ప్రస్తుతం ఈస్థాయిలో ఉండటానికి, ఆదాయం ఆర్జించటానికి మాజీ క్రికెటర్లు, అంపైర్లు చేసిన అసాధారణ సేవలే కారణమని బీసీసీఐ చెబుతోంది. క్రికెట్ కే తమ జీవితాలను అంకితం చేసిన వారి బాగోగులు చూసుకోడం, రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా సాగేలా చేయటం తమ విధి అని స్పష్టం చేసింది.

50 వేల నుంచి 70 వేలకు...

వందకు పైగా టెస్టుమ్యాచ్ లు ఆడిన గవాస్కర్, కపిల్ దేవ్, వెంగ్ సర్కార్, సచిన్, ద్రావిడ్, కుంబ్లే, లక్ష్మణ్ లాంటి క్రికెటర్లు ప్రస్తుతం నెలకు 70వేలరూపాయలు చొప్పున పెన్షన్ అందుకొంటూ నిశ్చింతగా జీవిస్తున్నారు. ఆటగాళ్లు ఆడిన మ్యాచ్ ల సంఖ్యను బట్టి స్లాబ్ ల వారీగా పెన్షన్ మొత్తం అందచేస్తున్నారు.

15వేల స్లాబ్ ను 30 వేలకు, 22,500 స్లాబ్ ను 45000కు, 30వేల స్లాబును 52 వేల 500కు, 37 వేల 500 ను 60వేల రూపాయలకు పెంచారు. 50వేల రూపాయల స్లాబును 70వేలకు పెంచుతూ బోర్డు గతేడాదే నిర్ణయం తీసుకొంది.

పురుషుల, మహిళల విభాగాలలోని మొత్తం 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లకు..ఈ ఐదు తరగతులుగా పెన్షన్ చేల్లించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.

ఐపీఎల్ నిర్వహణ ద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బీసీసీఐ తన సంపాదనలో 30 శాతం మొత్తాన్ని క్రికెటర్లకు, మాజీ క్రికెటర్లకు వేతనాలు, కాంట్రాక్టులు, పెన్షన్ ల రూపంలో అందచేస్తూ వస్తోంది.

క్రికెటర్లకు కోట్లే కోట్లు...

గత తరం ఆటగాళ్లతో పోల్చిచూస్తే నేటితరంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లు వివిధ రూపాలలో ఏడాదికి 20 నుంచి 100 కోట్ల రూపాయల వరకూ సంపాదిస్తున్నారు.

దేశంలోని మొత్తం 28 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసి...వారి ఆటతీరును బట్టి ఏడాదికి 7కోట్ల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ కాంట్రాక్టు మనీ చెల్లిస్తోంది.

అంతేకాదు..ఆడిన ప్రతిటెస్టు మ్యాచ్ కు 15 లక్షలు, వన్డేకి 7 లక్షలు, టీ-20 మ్యాచ్ కు 6లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజుగా అందచేస్తున్నారు.

ఇక..ఐపీఎల్ ద్వారా సీజన్ కు కనీసం 20 లక్షల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల వరకూ సంపాదించడం సాధారణ విషయంగా మారిపోయింది.

దేశవాళీ క్రికెటర్ల కోసం.....

భారత క్రికెటర్ల వేతనాలు సైతం...నూరుశాతం పెంచడానికి వీలుగా బీసీసీఐ నిధులను భారీగా పెంచింది. క్రికెటర్ల వేతనాల కోసం ఇప్పటి వరకూ ఉన్న 180 కోట్ల రూపాయల మొత్తాన్ని...గతంలో ఎన్నడూ లేనంతగా..380 కోట్ల రూపాయలకు పెంచింది. దీంతో 2017 సీజన్లో 5 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే వేతనంగా అందుకొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ...2018 సీజన్ నుంచి 10 కోట్ల రూపాయలకు పైగా అందుకొంటున్నారు.

దేశవాళీ ( రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ, జూనియర్ ,మహిళా ) క్రికెట్ వివిధవిభాగాల కోసం..ఇక నుంచి సీజన్ కు 20 నుంచి 30 లక్షల రూపాయల వరకూ వేతనంగా అందుకోనున్నారు. 2017 సీజన్ వరకూ రంజీ క్రికెటర్ల వేతనం 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల వరకూ మాత్రమే ఉంది.

సహక్రీడలకు బీసీసీఐ సాయం...

దేశంలోని మొత్తం 29 రాష్ట్ర్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో క్రికెట్ మౌలికసదుపాయల కల్పన కోసం వేలకోట్ల రూపాయలు వ్యయం చేస్తున్న బీసీసీఐ మిగిలిన క్రీడలకూ తనవంతుగా సాయం అందచేస్తోంది.

ఒలింపిక్స్ లో దేశానికి పతకాలు సాధించి పెడుతున్న ఇతర క్రీడాసంఘాలకు సైతం నిధులు అందచేయటం ద్వారా దన్నుగా నిలుస్తోంది.

మరోవైపు..కరోనా వైరస్ తో భారత ప్రభుత్వం జరిపిన పోరాటానికి తనవంతుగా అనుబంధ క్రికెట్ సంఘాలతో కలసి...ప్రధానమంత్రి కరోనా నియంత్రణ నిధికి 51 కోట్ల రూపాయల భారీవిరాళం అందించింది.

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోనే అత్యధిక మొత్తాలు పెన్షన్ గా చెల్లిస్తున్న ఏకైక బోర్డు బీసీసీఐ మాత్రమే.

First Published:  17 Dec 2023 2:45 AM GMT
Next Story