Telugu Global
Sports

దేశవాళీ క్రికెట్లో ఇక దండిగా ప్రైజ్ మనీ!

దేశవాళీ క్రికెట్ టోర్నీల విజేతల పంట పండింది. ఇక నుంచి చాంపియన్ జట్లు కళ్లు చెదిరే మొత్తాలలో ప్రైజ్ మనీ అందుకోనున్నాయి.

BCCI Hikes Prize Money For Domestic Cricketers
X

దేశవాళీ క్రికెట్లో ఇక దండిగా ప్రైజ్ మనీ!

దేశవాళీ క్రికెట్ టోర్నీల విజేతల పంట పండింది. ఇక నుంచి చాంపియన్ జట్లు కళ్లు చెదిరే మొత్తాలలో ప్రైజ్ మనీ అందుకోనున్నాయి...

ఐపీఎల్ ద్వారా వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బీసీసీఐ 2023-24 సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్ కు భారీగా నిధులు కేటాయించాలని నిర్ణయించింది.

దేశవాళీ క్రికెట్ ( రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ) టోర్నీలలో విజేత జట్లకు కంటితుడుపుగా ఇస్తున్న ప్రైజ్ మనీని భారీగా పెంచినట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.

దేశవాళీ పురుషుల, మహిళల విభాగాలలో పెంచిన ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించారు.

2 కోట్ల నుంచి 5 కోట్లకు...

జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ విజేతలకు గత సీజన్ వరకూ ఇచ్చిన ప్రైజ్ మనీ మొత్తాన్ని 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచారు.

ఇప్పటి వరకూ కోటి రూపాయలు మాత్రమే అందుకొన్న రన్నరప్ జట్లు 2023-24 సీజన్ నుంచి 3 కోట్ల రూపాయలు అందుకోనున్నాయి.

రంజీ విజేత- రెస్టాఫ్ ఇండియాజట్ల మధ్య జరిగే ఇరానీ ట్రోఫీ సమరంలో విన్నర్ గా నిలిచిన జట్టుకు గత సీజన్ వరకూ ఇచ్చిన 25 లక్షల రూపాయల మొత్తాన్ని 50 లక్షల రూపాయలకు పెంచారు.

దులీప్ ట్రోఫీ విజేతకు కోటి నజరానా..

జాతీయ జోనల్ క్రికెట్ విజేతకు ఇచ్చే దులీప్ ట్రోఫీ ప్రైజ్ మనీని 40 లక్షల నుంచి కోటిరూపాయలకు పెంచారు. ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ విన్నర్ జట్టుకు ఇస్తున్న 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీని 80 లక్షల రూపాయలకు పెంచారు.

విజయ్ హజారే టోర్నీ విజేతలకు ఇస్తున్న 30 లక్షల మొత్తాన్ని 30 లక్షల నుంచి కోటిరూపాయలకు పెంచారు.

మహిళలకు సైతం భారీగా ప్రైజ్ మనీ...

దేశవాళీ మహిళా క్రికెట్ టోర్నీ విజేతలకు సైతం ప్రైజ్ మనీని గణనీయంగా పెంచారు. జాతీయ మహిళల వన్డే ట్రోఫీ విజేతకి గతంలో 6 లక్షల రూపాయలుగా ఉన్న ప్రైజ్‌మనీని రూ.50 లక్షలకు పెంచిననట్లు బీసిసిఐ ప్రకటించింది. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 25 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు.

సీనియర్స్‌ వుమెన్స్‌ టీ- 20 టోర్నీ విజేతకు 40లక్షలు, రన్నరప్ జట్లకు రూ.20లక్షలు చొప్పున చెల్లించనున్నారు.

దేశవాళీ క్రికెటర్లకూ పెరిగిన ఆదాయం..

దేశవాళీ క్రికెట్ టోర్నీలలో పాల్గొనే ఆటగాళ్లకు సైతం గత సీజన్ నుంచి మ్యాచ్ ఫీజును బీసీసీఐ భారీగా పెంచింది. రంజీట్రోఫీ మ్యాచ్ ల్లో పాల్గొనే ఆటగాళ్లకు రోజుకు 50 వేల నుంచి 60 వేల రూపాయలు వంతున చెల్లిస్తున్నారు.

రంజీట్రోఫీలో పాల్గొనే క్రికెటర్లు మొత్తం అన్నిమ్యాచ్ లూ ఆడగలిగితే..సీజన్ కు కనీసం 15 లక్షల నుంచి 16 లక్షల రూపాయల వరకూ మ్యాచ్ ఫీజులుగా పొందనున్నారు.

గతంలో రోజుకు 3 రూపాయల చొప్పున రంజీ మ్యాచ్ ఫీజుగా అందుకొన్న రోజుల నుంచి రోజుకు 50వేల రూపాయల మొత్తం అందుకోడం చూస్తుంటే..బీసీసీఐకి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.

First Published:  17 April 2023 4:25 AM GMT
Next Story