Telugu Global
Sports

టీమ్ ఇండియాను నడిరోడ్డుపై నిలబెట్టిన చేతన్ శర్మ.. బీసీసీఐ తీవ్ర ఆగ్రహం

టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బిగ్ స్టార్లు అని చేతన్ శర్మ అన్నాడు. వారిద్దరి మధ్య గొడవలు ఏవీ లేవు. కానీ ఇగో ప్రాబ్లెమ్స్ మాత్రం ఉన్నాయని చెప్పారు.

టీమ్ ఇండియాను నడిరోడ్డుపై నిలబెట్టిన చేతన్ శర్మ.. బీసీసీఐ తీవ్ర ఆగ్రహం
X

నేషనల్ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. టీమ్ ఇండియా క్రికెటర్లకు సంబంధించిన అనేక విషయాలను చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ 'జీ న్యూస్' ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టాడు. ఫిట్‌నెస్ కోసం డ్రగ్స్ తీసుకుంటారని.. రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా తరచూ తన ఇంటికి వస్తారని.. గంగూలీ గురించి కోహ్లీ మీడియాలో అనసవరంగా మాట్లాడటం వల్లే కెప్టెన్సీ ఊడిందంటూ పలు విషయాలను వెల్లడించారు. చేతన్ శర్మ వ్యాఖ్యలతో టీమ్ ఇండియాను నడిరోడ్డుపై నిలబెట్టిననట్లు అయ్యింది. బీసీసీఐకి చేతన్ వ్యాఖ్యలు పెద్ద ఎదురు దెబ్బగా క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు.

క్రికెటర్లు డ్రగ్స్ తీసుకుంటారు..

ప్రస్తుతం జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న చేతన్ శర్మ.. టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో క్రికెటర్లపై భారీ ఆరోపణలు చేశారు. కొంత మంది భారత క్రికెటర్లు ఫిట్‌నెస్ పెంచుకోవడానికి ఇంజెక్షన్లు తీసుకుంటారని అన్నారు. ఈ ఇంజెక్షన్లు తీసుకుంటే.. 80 శాతం ఫిట్‌నెస్ ఉన్న వ్యక్తి కూడా 100 శాతం ఫిట్‌గా మారిపోతాడని చెప్పారు. ఈ ఇంజెక్షన్లు డోప్ టెస్టుకు కూడా దొరకవని చెప్పుకొచ్చాడు. చాలా మంది క్రికెటర్లు సిరీస్‌కి ముందు ఇంజెక్షన్లు తీసుకోవడం తనకు తెలుసని చెప్పారు.

సాధారణంగా ఏ క్రికెటర్ అయినా 100 శాతం ఫిట్‌గా లేకపోతే మ్యాచ్‌కు సెలెక్ట్ కారు. మెడికల్ టీమ్ కూడా వారిని ఆడించడానికి ఒప్పుకోదు. ఒక్కోసారి క్రికెటర్లే.. సార్ మమ్మల్ని ఆడించండి అని బతిమిలాడుకుంటారని చేతన్ శర్మ అన్నాడు. బుమ్రా ఒక్కోసారి కిందకు వంగలేనంత నొప్పితో బాధపడతాడు. అలాంటి మేజర్ ఇంజ్యురీస్ అయ్యాయి. కానీ ఆడాలని అనుకుంటే ఏం చేస్తారు? ఆ ఇంజక్షన్ తీసుకొని వచ్చి.. నేను ఫిట్‌గా ఉన్నాను అని చెప్పుకొని టీమ్‌లో స్థానం సంపాదిస్తారంటూ చేతన్ శర్మ ఆరోపించాడు.

కాగా, ఆ ఇంజక్షన్ పెయిన్ కిల్లరా అని చేతన్ శర్మను ప్రశ్నించగా.. అది పెయిన్ కిల్లర్ కాదు, ఒక రకమైన డ్రగ్ అని చెప్పుకొచ్చాడు. అసలు ఆ ఇంజక్షన్ తీసుకున్నట్లు కూడా మనకు అర్థం కాదు. దానికి ప్రిస్క్రిప్షన్ అవసరమే. కానీ ఎలా దొరుకుతాయో తెలియదు అని చేతన్ చెప్పారు.అలాంటి ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా అని ప్రశ్నించగా.. నాకు తెలియదు. వారిపై నేను నిఘా పెట్టలేనుగా అని చేతన్ బదులిచ్చారు.

మేం రోహిత్‌ను సపోర్ట్ చేయడం లేదు.. కానీ కోహ్లీని వ్యతిరేకిస్తున్నాం..

టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బిగ్ స్టార్లు అని చేతన్ శర్మ అన్నాడు. వారిద్దరి మధ్య గొడవలు ఏవీ లేవు. కానీ ఇగో ప్రాబ్లెమ్స్ మాత్రం ఉన్నాయని చెప్పారు. టీమ్ ఇండియా రెండు వర్గాలుగా విడిపోయిందని.. వీటికి రోహిత్, కోహ్లీలు లీడర్లుగా ఉన్నారని చేతన్ అన్నాడు. చాలా మంది మేం రోహిత్ శర్మను సపోర్ట్ చేస్తున్నామని భావిస్తుంటారు. కానీ అలా కాదు.. మేం కోహ్లీని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కోహ్లీ తన కెప్టెన్సీని వదులుకోవాలని భావించినప్పుడు వర్చువల్ మీటింగ్ జరిగింది. అప్పుడు కేవలం గంగూలీ మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పాడు. కానీ, కోహ్లీకి ఆ మాట వినపడలేదు అనుకుంటా.

కాగా, ఆ తర్వాత గంగూలీనే తనకు వ్యతిరేకంగా ఉన్నాడని భావించి.. కోహ్లీ మీడియాలో అతడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని చేతన్ శర్మ చెప్పాడు. ఇది గంగూలీ, కోహ్లీల మధ్య మరింత దూరాన్ని పెంచిందని అన్నాడు. అదే అన్ని ఫార్మాట్లలో కోహ్లీని కెప్టెన్‌గా తప్పించడానికి కారణం అయ్యింది. రోహిత్ శర్మ తొలుత కెప్టెన్సీని తీసుకోవడానికి ముందుకు రాలేదు. అయితే తప్పని సరి పరిస్థితుల్లో ఆ బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నాడని చెప్పాడు. రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యాలకు తన మీద చాలా నమ్మకమని.. తరచూ మా ఇంటికి కూడా వస్తారని చేతన్ చెప్పడం గమనార్హం.

బీసీసీఐ ఆగ్రహం..

చేతన్ శర్మ ఓ స్టింగ్ ఆపరేషన్‌లో అనేక విషయాలు బయటపెట్టడంపై బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నది. అతడిని సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అతడి వ్యాఖ్యలు బీసీసీఐకి మాత్రమే కాకుండా ఐసీసీకి కూడా వ్యతిరేకంగా మారవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ బీసీసీఐని గుడ్డిగా నమ్ముతూ వచ్చిన ఐసీసీకి చేతన్ శర్మ వల్ల ఇబ్బంది కలుగుతుందని తెలుస్తోంది. అంతే కాకుండా బీసీసీఐకి వ్యతిరేకంగా గళం విప్పే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఏర్పడింది. మరి బీసీసీఐ ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతుందో వేచి చూడాలి.

First Published:  15 Feb 2023 4:21 AM GMT
Next Story