Telugu Global
Sports

రేపు బీసీసీఐ కీలక భేటీ.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్, కెప్టెన్లు?

బీసీసీఐ అపెక్స్ కమిటీ మీటింగ్‌లో ఆటగాళ్ల కొత్త కాంట్రాక్టులపై చర్చ జరుగనున్నది.

రేపు బీసీసీఐ కీలక భేటీ.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్, కెప్టెన్లు?
X

భారత క్రికెట్ జట్టు ఇటీవల తీరిక లేని క్రికెట్ ఆడుతోంది. టీమ్ ఇండియా వరుసగా సిరీస్‌లు, టోర్నీలు ఆడుతున్నా.. వైఫల్యాలతో అటు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇటు బీసీసీఐ కూడా అసంతృప్తిగా ఉంది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లో ఓటమితో పాటు న్యూజీలాండ్‌లో సరైన ప్రదర్శన చేయకపోవడం, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓడిపోవడంపై బోర్డు గుర్రుగా ఉన్నది. ఆటగాళ్లు తరచూ గాయాలపాలవడం.. జట్టులోని సహాయక సిబ్బంది అంచనాల మేరకు అవుట్ పుట్ రాబట్టడంలో విఫలం చెందడంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రేపు (డిసెంబర్ 21) బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో వర్చువల్ పద్దతిలో కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొంటారని తెలుస్తున్నది.

భారత క్రికెట్ జట్టు ప్రక్షాళనపై బోర్డు దృష్ణి పెట్టనున్నది. మూడు ఫార్మాట్లకు ఒకే కోచ్, ఒకే కెప్టెన్ ఉండటం వల్ల వారిపై భారం పడుతోందని బీసీసీఐ భావిస్తోంది. ఇకపై స్ల్పిట్ కెప్టెన్సీ, కోచ్ పద్దతిని అమలు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇవి భారత జట్టు విషయంలో తీసుకోబోయే కీలక నిర్ణయాలనే చెప్పవచ్చు. మరోవైపు కొత్త సెలెక్షన్ కమిటీని కూడా బీసీసీఐ ఎంపిక చేయనున్నది.బోర్డు అజెండాలో ప్రధానంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఓటమిపై సమీక్ష, ప్రస్తుత కోచ్, సహాయక సిబ్బంది పని తీరుపై సమీక్ష, సెలక్షన్ కమిటీ రొటేషన్ విధానంపై చర్చ, వేర్వేరు ఫార్మాట్‌లకు వేర్వేరు కోచ్‌, కెప్టెన్ల నియామకం వంటి అంశాలు ఉన్నాయి.

భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా:

భారత జట్టు భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్ల్పిట్ కెప్టెన్సీ విధానం అమలు చేస్తే.. టీ20లకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రోహిత్ శర్మకు 36 ఏళ్లు నిండుతాయి. వయసు పైబడుతుండటంతో రోహిత్ ఎన్నేళ్లు ఆడతాడనే అనుమానాలు ఉన్నాయి. అందుకే భవిష్యత్ కెప్టెన్ కోసం వెంటనే కసరత్తు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. కోహ్లీ కెప్టెన్‌గా దిగిపోయిన తర్వాత దాదాపు ఏడుగురు భారత జట్టుకు వివిధ ఫార్మాట్లలో కెప్టెన్లుగా వ్యవహరించారు. అందుకే ఈ సారి పూర్తి స్థాయిలో టీ20 కెప్టెన్‌ను నియమించే అవకాశం ఉన్నది.

ఇక ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ టీ20ల్లో సరైన ఫలితాలు రాబట్టలేకపోతున్నారని బోర్డు అసంతృప్తిగా ఉన్నది. స్వతహాగా టెస్టు బ్యాటర్ అయిన ద్రవిడ్.. ఆ ఫార్మాట్లో పర్వాలేదనిపిస్తున్నా.. పరిమిత ఓవర్ల క్రికెట్ విషయంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అందుకే టీ20లకు కెప్టెన్‌తో పాటు వేరే కోచ్‌ను కూడా నియమించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. భారత జట్టు పదే పదే ఓడిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఇకపై ఎలాంటి ఛాన్స్ తీసుకోవాలని భావించడం లేదని.. టీ20 ఫార్మాట్‌కు కొత్త కెప్టెన్ విషయంపై ఇప్పటికే రోహిత్ శర్మతో చర్చంచామని, అతడికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రోహిత్ తప్పకుండా భారత జట్టుకు ఒక ఆస్తిలాంటి వ్యక్తి. కానీ, పని భారం ఎక్కువగా ఉన్నది. దాన్ని కాస్త తగ్గించాలని అనుకుంటున్నట్లు సదరు అధికారి చెప్పుకొచ్చారు.

ఇక బీసీసీఐ అపెక్స్ కమిటీ మీటింగ్‌లో ఆటగాళ్ల కొత్త కాంట్రాక్టులపై చర్చ జరుగనున్నది. బీసీసీఐ ప్రధాన స్పాన్సర్ బైజూస్, కిట్ స్పాన్సర్ ఎంపీఎల్‌ల రెన్యూవల్‌పై.. కన్సల్టెన్సీ సంస్థ థార్ట్నర్ నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలోని ఐదు స్టేడియంల అప్‌గ్రేడేషన్‌పై చర్చ జరుగనున్నది. దీంతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. శ్రీలంక, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాతో జరుగనున్న సిరీస్‌లకు సంబంధించిన వేదికలపై చర్చ జరుగనున్నది. ఆసీస్-ఇండియా పింక్ బాల్ టెస్టుపై కూడా చర్చించనున్నారు.

First Published:  20 Dec 2022 11:26 AM GMT
Next Story