Telugu Global
Sports

ఆసియా కప్‌కు రాహుల్, కొహ్లీ.. గాయాలతో బుమ్రా, హర్షల్ పటేల్ దూరం

దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లీని ఎట్టకేలకు సెలెక్టర్లు కరుణించారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని మొత్తం 15 మంది సభ్యుల జట్టును ఎంపిక సంఘం ఖరారు చేసింది.

ఆసియా కప్‌కు రాహుల్, కొహ్లీ.. గాయాలతో బుమ్రా, హర్షల్ పటేల్ దూరం
X

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆగస్టు 27 నుంచి జరిగే 15వ ఆసియాకప్ ( టీ-20 ) టోర్నీలో పాల్గొనే భారత జట్టులో కెఎల్ రాహుల్, విరాట్ కొహ్లీలకు చోటు దక్కింది. అంతంత మాత్రం ఫామ్ తో భారతజట్టులో చోటు కోసం తంటాలు పడుతున్న దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లీని ఎట్టకేలకు సెలెక్టర్లు కరుణించారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని మొత్తం 15 మంది సభ్యుల జట్టును ఎంపిక సంఘం ఖరారు చేసింది.

బుమ్రా, హర్షల్ అన్ ఫిట్..

యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ గాయాల కారణంగా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ లను స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. వెస్టిండీస్ తో ముగిసిన పాంచ్ పటాకా సిరీస్ కు విశ్రాంతి పేరుతో దూరమైన విరాట్ కొహ్లీ, గాయం నుంచి కోలుకొని పూర్తిఫిట్ నెస్ సాధించిన కెఎల్ రాహుల్ లకు తిరిగి జట్టు లో చోటు కల్పించారు. జట్టుకు రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. రిషబ్‌ పంత్, దినేశ్ కార్తీక్ వికెట్ కీపర్ బ్యాటర్లు గాను, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్, రవి బిష్నోయ్‌ స్పిన్నర్లుగాను, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆల్ రౌండర్లుగాను ఎంపికయ్యారు. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా జట్టులో చోటు సంపాదించారు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా అందుబాటులో లేకపోడంతో భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ పేస్ బౌలింగ్ బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

గ్రూప్- ఏలో భారత్, పాకిస్థాన్..

మొత్తం ఆరుజట్లు తలపడనున్న ఈటోర్నీలో భారత్, పాకిస్థాన్ , శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా అర్హత సంపాదిస్తే.. క్వాలిఫైయింగ్ టోర్నీ ద్వారా మరో రెండుజట్లకు చోటు కల్పించనున్నారు. గ్రూప్ -ఏ లీగ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తో పాటు క్వాలిఫైయర్స్ ద్వారా అర్హత సాధించిన మరోజట్టు పోటీపడనుంది. గ్రూప్- బీ లీగ్ లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘ‌నిస్థాన్ జట్లు తలపడతాయి. గ్రూప్ లీగ్ లో అత్యుత్తమంగా నిలిచిన మొదటి నాలుగు జట్లతో సూపర్ -4 రౌండ్ ను నిర్వహిస్తారు. సూపర్ ఫోర్ రౌండ్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లు ఫైనల్లో ఢీ కొంటాయి.

అత్యంత విజయవంతమైన జట్టు భారత్..

గత 14 ఆసియాకప్ టోర్నీలలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన జట్టు రికార్డు భారత్ పేరుతో ఉంది. భారత్ మొత్తం ఏడుసార్లు ఆసియాకప్ చాంపియన్ గా నిలిచింది. గత టోర్నీకి ముందు వరకూ ఆసియాకప్ ను 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తూ వచ్చారు. అయితే.. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ క్యాలండర్ కు అనుగుణంగా గత టోర్నీని టీ-20 ఫార్మాట్లో నిర్వహించారు. ప్రస్తుత 2022 ఆసియాకప్ సైతం టీ-20 ఫార్మాట్లోనే జరుగనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ జరుగనున్న ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే.. ఆ దేశ ఆర్థిక పరిస్థితి గతి తప్పడంతో అక్కడి క్రికెట్ బోర్డు టోర్నీ నిర్వహించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా 15వ ఆసియాకప్ టోర్నీని నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది.

ఇదీ భారత జట్టు

రోహిత్ శర్మ ( కెప్టెన్ ), కెఎల్ రాహుల్ ( వైస్- కెప్టెన్ ), విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్‌ పంత్, దినేశ్ కార్తీక్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్, రవి బిష్నోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్.

First Published:  9 Aug 2022 8:11 AM GMT
Next Story