Telugu Global
Sports

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లోనూ వివక్షేనా?

భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లకూ వరుసగా మూడో ఏడాది బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ఖరారు చేసింది. పురుషులకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్న బోర్డు..మహిళలకు మాత్రం లక్షలే విదిలిస్తోంది.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లోనూ వివక్షేనా?
X

భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లకూ వరుసగా మూడో ఏడాది బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ఖరారు చేసింది. పురుషులకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్న బోర్డు..మహిళలకు మాత్రం లక్షలే విదిలిస్తోంది.

భారత మహిళా క్రికెటర్ల పంట పండింది. ఆటలో పురుషులతో సమానం కాకపోయినా...పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు ( టెస్టు, వన్డే, టీ-20 ) అందుకొంటున్న

మహిళా క్రికెటర్లకు వరుసగా మూడో ఏడాది బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ఖరారు చేసింది. గ్రేడ్- ఏ క్రికెటర్లకు ఏడాదికి 50 లక్షల రూపాయలు, గ్రేడ్- బీ క్రికెటర్లకు 30 లక్షల రూపాయలు, గ్రేడ్- సీ ప్లేయర్లకు 10 లక్షల రూపాయలు గ్యారెంటీ మనీగా బీసీసీఐ గత రెండు సీజన్లుగా చెల్లిస్తూ వస్తోంది.

టాప్ గ్రేడ్ లో ముగ్గురికే చోటు..

2023 సంవత్సరానికి మహిళా క్రికెటర్ల కోసం బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో కేవలం ముగ్గురు మాత్రమే గ్రేడ్- ఏ విభాగంలో చోటు సంపాదించగలిగారు.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందన, ఆల్ రౌండర్ దీప్తి శర్మలకు మాత్రమే టాప్ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. ఈ ముగ్గురూ భారతజట్టుకు ఆడినా, ఆడకున్నా

ఏడాదికి 50 లక్షల రూపాయల చొప్పున గ్యారెంటీ మనీ అందుకోనున్నారు. గాయాలతో జట్టుకు అందుబాటులో లేకున్నా ఉచిత చికిత్సతో పాటు ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు.

గత సీజన్ వరకూ గ్రేడ్- ఏ కాంట్రాక్టులో ఉన్న స్పిన్నర్ రాజేశ్వరీ గయక్వాడ్ ను గ్రేడ్-బీకి డిమోట్ చేశారు. గత సీజన్ వరకూ గ్రేడ్ - బీ కాంట్రాక్టులో ఉన్న లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్..తాజా కాంట్రాక్టుల్లో చోటు సంపాదించలేకపోయింది.

5 గురికి గ్రేడ్- బీ కాంట్రాక్టు...

ఏడాదికి 30 లక్షల రూపాయల కాంట్రాక్టు జాబితాలోచోటు సంపాదించిన క్రికెటర్లలో స్వింగ్ బౌలర్ రేణుక ఠాకూర్, బ్యాటర్ జెమీమా రోడ్రిగేజ్, ఓపెనర్ షెఫాలీవర్మ, కీపర్ బ్యాటర్ రిచా ఘోశ్, స్పిన్నర్ రాజేశ్వరీ గయక్వాడ్ ఉన్నారు.

సీజన్ కు 10 లక్షల వేతనం పై కాంట్రాక్టు అందుకొన్నవారిలో మేఘ్నా సింగ్, దేవికా వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శ్రావణి, పూజా వస్త్ర్రకర్, స్నేహా రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా ఉన్నారు.

గతేడాది వరకూ బోర్డు కాంట్రాక్టు లేని పేస్ బౌలర్ రేణుక ఠాకూర్ నేరుగా గ్రేడ్- బీలో చోటు సంపాదించగలిగింది. గతేడాది జరిగిన పలు అంతర్జాతీయమ్యాచ్ ల్లో భారత్ తరపున నిలకడగా రాణించిన ఏకైక పేస్ బౌలర్ గా రేణుక గుర్తింపు సంపాదించింది.

గత సీజన్ వరకూ గ్రేడ్- సీ లో ఉన్న జెమీమా, రిచా ఈ సీజన్లో బీ-గ్రేడ్ కు ప్రమోషన్ సంపాదించగలిగారు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు సంపాదించిన తెలుగు రాష్ట్ర్రాల ఏకైక క్రికెటర్ ఘనతను ఓపెనర్ సబ్బినేని మేఘన దక్కించుకొంది.

పురుషులకు కోట్లు- మహిళలకు లక్షలు

పురుషుల వార్షిక కాంట్రాక్టు మొత్తాలతో పోల్చిచూస్తే..మహిళలకు చెల్లిస్తున్ మొత్తం కంటితుడుపుగానే కనిపిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లాంటి క్రికెటర్లకు బీసీసీఐ ఏడాదికి 7 కోట్ల రూపాయలు చెల్లిస్తుంటే..భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందన లాంటి అగ్రశేణి కికెటర్లకు 50 లక్షల రూపాయలు మాత్రమే అందచేస్తోంది.

మ్యాచ్ ఫీజుల్లో పురుషులతో సమానంగా...

టెస్టు, వన్డే, టీ-20 మ్యాచ్ ల్లో మాత్రం పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు సైతం మ్యాచ్ ఫీజులు అందుకొంటున్నారు. భారత్ తరపున టెస్టు మ్యాచ్ ఆడిన ఒక్కో క్రికెటర్ కు మ్యాచ్ ఫీజుగా 15 లక్షల రూపాయలు, వన్డే మ్యాచ్ కు 6 లక్షల రూపాయలు, టీ-20 మ్యాచ్ కు 3 లక్షల రూపాయలు బీసీసీఐ చెల్లిస్తోంది.

గతంలో టెస్టుమ్యాచ్ కు 2 లక్షల 50 వేలు, వన్డేకు లక్ష రూపాయలు, టీ-20కి లక్ష రూపాయలు మ్యాచ్ ఫీజుగా అందుకొన్న భారత మహిళా క్రికెటర్లు..ఇక నుంచి పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అందుకొనేలా బీసీసీఐ ఇటీవలే మార్పులు చేసింది.

మహిళా ఐపీఎల్ వేలంతో పాటు వార్షిక కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజుల ద్వారా ప్రస్తుత తరం మహిళా క్రికెటర్లు దండిగానే సంపాదిస్తున్నారు.

First Published:  27 April 2023 1:52 PM GMT
Next Story