Telugu Global
Sports

వేలిగాయంతో రోహిత్..హీరోచిత పోరాటం!

హిట్ మాన్ గా రోహిత్ శర్మ తనపేరును మరోసారి సార్థకం చేసుకొన్నాడు. బంగ్లాదేశ్ తో ముగిసిన రెండోవన్డేలో వేలిగాయంతోనే బ్యాటింగ్ కు దిగి విరోచిత ఇన్నింగ్స్ తో భారత్ ను విజయం అంచుల వరకూ తీసుకువెళ్ళాడు.

రోహిత్ శర్మ
X

రోహిత్ శర్మ

హిట్ మాన్ గా రోహిత్ శర్మ తనపేరును మరోసారి సార్థకం చేసుకొన్నాడు. బంగ్లాదేశ్ తో ముగిసిన రెండోవన్డేలో వేలిగాయంతోనే బ్యాటింగ్ కు దిగి విరోచిత ఇన్నింగ్స్ తో భారత్ ను విజయం అంచుల వరకూ తీసుకువెళ్ళాడు....

క్రీడలు ఏవైనా గెలుపు, ఓటమి సహజం. అయితే..ఎంతగొప్పగా పోరాడామన్నదే ప్రధానం. తుదివరకూ పోరాడి ఓడినా అది గొప్ప గెలుపు లాంటిదే. బంగ్లాదేశ్ తో తీన్మార్ వన్డే సిరీస్ మొదటి రెండువన్డేలలో భారత్ పోరాడి ఓడినా భేష్ అనిపించుకొంది.

వారేవ్వా! రోహిత్...

బంగ్లాదేశ్ గడ్డపై బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారతజట్టు మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ విజయం అంచుల వరకూ వచ్చి బోల్తా కొట్టినా..భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం విరిగిన వేలితోనే బ్యాటింగ్ కు దిగి మెరుపు హాఫ్ సెంచరీతో అభిమానుల, విమర్శకుల హృదయాలను గెలుచుకొన్నాడు.

మీర్పూర్ లోని షేర్-ఏ-నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలివన్డేలో ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని చేజార్చుకొన్న 4వ ర్యాంకర్ భారత్ కు..అదే వేదికగా జరిగిన రెండోవన్డేలో సైతం 5 పరుగుల పరాజయం తప్పలేదు.

సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈవన్డేలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 271 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా..భారత్ ముందు 272 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమచేతి బొటనవేలికి గాయమయ్యింది. రెండోస్లిప్ స్థానంలో ఫీల్డర్ గా ఉన్న రోహిత్ ఎడమచేతి బొటనవేలికి వచ్చి బంతి బలంగా తాకింది. బొటనవేలు, చూపుడువేలు మధ్యభాగం చిట్లి రక్తం బొటాబొటా కారడంతో..హుటాహుటిన ఢాకాలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

దీంతో రోహిత్ కు బదులుగా..మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది.

భారత జట్టు ఆట 43 ఓవర్ కే 207 పరుగులకే 7 వికెట్లు నష్టపోయి భారీఓటమి అంచుల్లో కూరుకుపోయింది. టాప్, మిడిలార్డర్ ఆటగాళ్లంతా పెవీలియన్ దారి పట్టడంతో..

టెయిల్ ఎండర్లు మాత్రమే క్రీజులో మిగిలిన సమయంలో 9వ డౌన్ లో..గాయంతోనే రోహిత్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది.

28 బాల్స్ లో 51 పరుగుల నాటౌట్..

ఎడమచేతివేలు చిట్లడంతో కుట్లువేయించుకొని, కట్టు కట్టించుకొని వచ్చిన రోహిత్..మొండిగా బ్యాటింగ్ కు దిగాడు. ఓ వైపు గాయం బాధపెడుతున్నా క్రీజులో దిటుగా నిలబడ్డాడు. ప్రారంభంలో తడబడినా ఆ తర్వాత తనదైన శైలిలో ఎదురుదాడికి దిగాడు. టీ-20 స్టయిల్ ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో బంగ్లాబౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగుగెత్తించాడు. కేవలం 28 బంతుల్లోనే 5 భారీసిక్సర్లు, 3 బౌండ్రీలతో 51 పరుగుల అజేయ స్కోరు తో 182.14 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. రోహిత్ ఎంతగా పోరాడినా..లోయర్ ఆర్డర్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ తోడుగా నిలవలేకపోడంతో భారత్ విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి బంతి ద్వారా సిక్సర్ సాధించాల్సిన రోహిత్ శర్మ..ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. దీంతో బంగ్లాజట్టు 5 పరుగుల విజయంతో సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోగలిగింది.

రోహిత్ కు హ్యాట్సాఫ్...

వన్డే సిరీస్ లో భారతజట్టు వరుస పరాజయాలు చవిచూసినా..వీరోచితంగా ఆడిన రోహిత్ శర్మను విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సునీల్ గవాస్కర్ తో సహా పలువురు క్రికెట్ వ్యాఖ్యాతలు రోహిత్ మొండితనానికి, కీలక సమయంలో కెప్టెన్ గా తనవంతు బాధ్యత నిర్వర్తించడాన్ని కొనియాడారు.

మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ సైతం..అన్నా..గొప్పగా పోరాడావు ..అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

రోహిత్ తన కెరియర్ లో ఎన్నో గొప్పగొప్ప శతకాలు బాదినా..చేతివేలి గాయంతో బ్యాటింగ్ కు దిగి సాధించిన 51 పరుగుల నాటౌట్ స్కోరే అత్యుత్తమమైనదని పలువురు ప్రశంసిస్తున్నారు.

చికిత్సకోసం స్వదేశానికి రోహిత్..

సిరీస్ లో భాగంగా చోటాగ్రామ్ వేదికగా శనివారం జరిగే ఆఖరి వన్డేకి కెప్టెన్ రోహిత్ శర్మ దూరంకానున్నట్లు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రకటించారు. చేతివేలి చికిత్స కోసం రోహిత్ ఢాకా నుంచి ముంబై వెళ్లనున్నట్లు తెలిపారు.

First Published:  8 Dec 2022 3:54 AM GMT
Next Story