Telugu Global
Sports

Balakrishna IPL Commentator: ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలయ్య.. ఒప్పందం కుదుర్చుకున్న స్టార్ స్పోర్ట్స్

Balakrishna as Telugu IPL Commentator: రాబోయే ఐపీఎల్ 2023 సీజన్‌లో స్టార్ స్పోర్ట్స్‌లో బాలయ్య బాబు కామెంట్రీని అభిమానులు ఆస్వాదించవచ్చు. తెలుగు కామెంటేటర్స్ ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావుతో కలిసి కామెంట్రీ బాక్సును బాలకృష్ణ షేర్ చేసుకోనున్నారు.

Balakrishna IPL Commentator: ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలయ్య.. ఒప్పందం కుదుర్చుకున్న స్టార్ స్పోర్ట్స్
X

సినీ నటడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అభిమానులను అలరించనున్నారు. వెండితెరపై తిరుగులేని నాయకుడిగా దూసుకొని పోతున్న బాలయ్య.. బుల్లి తెరపై కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ఆహా ఓటీటీ కోసం చేసిన అన్‌స్టాపబుల్ షో విజయవంతంగా రెండు సీజన్లు నడిచింది. బాలయ్య సినిమాల్లోనే కాదు.. ఒక హోస్ట్‌గా కూడా దుమ్ము దులిపేస్తాడని అన్‌స్టాపబుల్ నిరూపించింది. ఇక ఇప్పుడు ఏకంగా క్రికెట్ లైవ్ కామెంట్రీకి రెడీ అవుతున్నారు.

ఈ నెల 31 నుంచి టాటా ఐపీఎల్ ప్రారంభం కానున్నది. 2023 సీజన్‌కు సంబంధించి డిజిటల్ రైట్స్ వయాకామ్ 18 దక్కించుకున్నది. దీంతో ఈ ఏడాది జియో ప్లాట్‌ఫామ్స్‌పై ఐపీఎల్ స్ట్రీమింగ్ కానున్నది. జియో సినిమా యాప్‌లో4కేలో ఉచితంగానే ప్రసారాలు చేస్తామని వయాకామ్ 18 ప్రకటించింది. ఇన్నాళ్లూ శాటిలైట్, డిజిటల్ ప్రసారాల్లో గుత్తాధిపత్యం చెలాయించిన స్టార్ స్పోర్ట్స్‌కు ఈ సారి కేవలం టీవీ ప్రసార హక్కులు మాత్రమే మిగిలాయి. జియో సినిమా ఫ్రీ టెలికాస్ట్‌ను తట్టుకోవడానికి పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు అభిమానుల కోసం బాలయ్యను రంగంలోకి దింపింది.

రాబోయే ఐపీఎల్ 2023 సీజన్‌లో స్టార్ స్పోర్ట్స్‌లో బాలయ్య బాబు కామెంట్రీని అభిమానులు ఆస్వాదించవచ్చు. తెలుగు కామెంటేటర్స్ ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావుతో కలిసి కామెంట్రీ బాక్సును బాలకృష్ణ షేర్ చేసుకోనున్నారు. ఈ మేరకు స్టార్ ఇండియా బాలయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నది. బాలకృష్ణకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా మక్కువ. నిజాం కాలేజీలో చదివే రోజుల్లో మహ్మద్ అజారుద్దీన్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి క్రికెట్ ఆడేవారు. కాలేజీ లెవల్‌లో బాలయ్య మ్యాచ్‌లు ఆడారు. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యూనివర్సిటీ ఛాంపియన్.. మహ్మద్ అజారుద్దీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లకు బాలయ్య మళ్లీ క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగు పెడుతున్నారు.

ఐపీఎల్ కామెంట్రీ మాత్రమే కాకుండా మ్యాచ్‌కు ముందు వచ్చే క్రికెట్ లైవ్ ప్రోగ్రామ్‌లో కూడా బాలకృష్ణ కనిపిస్తారు. అంతే కాకుండా అభిమానులు #AskStar అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి నేరుగా బాలయ్యకు ప్రశ్నలు వేయవచ్చు. స్టార్ స్పోర్ట్స్‌తో ఒప్పందం కుదిరిన సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. నేను ఒక గొప్ప క్రికెట్ ఫ్యాన్‌ని.. ఐపీఎల్ కోసం స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో ఇంట్లోని బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్‌లు చూస్తూ సంతోషించేవాడిని.. ఇప్పుడు ఏకంగా కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండటంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని బాలయ్య చెప్పారు.

కాగా, మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్లుగా బాలయ్య, ఎమ్మెస్కే, వేణుగోపాల్‌తో పాటు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, టి.సుమన్, ఆశిష్ రెడ్డి, కల్యాణ్ కృష్ణలతో ఒప్పందం కుదుర్చుకున్నది. బాలయ్య కారణంగా టీవీ చూసే వారి సంఖ్య పెరుగుతుందని స్టార్ అంచనా వేస్తోంది.


First Published:  27 March 2023 4:10 AM GMT
Next Story