Telugu Global
Sports

భజరంగ్, వినేశ్ ప్రాక్టీసు షురూ!

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత రెండువారాలుగా నిరసన చేపట్టిన దిగ్గజ వస్తాదులు భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్, సాక్షి మాలిక్ తిరిగి సాధన మొదలు పెట్టారు.

Bajrang, Vinesh hit mat for first time in 15 days
X

భజరంగ్, వినేశ్ ప్రాక్టీసు షురూ!

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత రెండువారాలుగా నిరసన చేపట్టిన దిగ్గజ వస్తాదులు భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్, సాక్షి మాలిక్ తిరిగి సాధన మొదలు పెట్టారు...

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత రెండువారాలుగా నిరసన చేపట్టిన అంతర్జాతీయ వస్తాదులు భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్, సాక్షి మాలిక్ సుదీర్ఘవిరామం తర్వాత తిరిగి సాధన మొదలు పెట్టారు. త్వరలోజరిగే పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు..చైనా వేదికగా జరిగే ఆసియాక్రీడల్లో సైతం పాల్గొనటానికి భారత స్టార్ వస్తాదులు సిద్ధమవుతున్నారు.

ప్రాక్టీసు ప్రాక్టీసే..నిరసన నిరసనే!

ఏడుగురు మహిళావస్తాదులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలంటూ రెండువారాల క్రితం ప్రారంభించిన నిరసన దీక్ష మరింతగా వేడెక్కింది. 15 రోజుల లోగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయంటూ సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు న్యూఢిల్లీలో ప్రకటించిన కొద్ది గంటల లోనే భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్ , సాక్షి మాలిక్ తమ సాధనను తిరిగి ప్రారంభించారు.

జంతర్ మంతర్ కు సమీపంలోని ఓ స్టేడియంలో ఈ ముగ్గురు వస్తాదులు తేలికపాటి వ్యాయామాలతో సాధన మొదలు పెట్టారు. గత ఐదుమాసాలుగా అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉంటూ వచ్చిన భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్..త్వరలోనే విదేశీ శిక్షణకు బయలు దేరనున్నారు.

భజరంగ్ పూనియా కజకిస్థాన్ లో, వినేశ్ పోగట్ టర్కీ దేశాలలో శిక్షణ తీసుకోనున్నారు.

గంటపాటు సాధన...

ఆసియాక్రీడల్లో పాల్గొనే భారత కుస్తీజట్టులో చోటు కోసం త్వరలో నిర్వహించే అర్హత పోటీలలో వినేశ్, భజరంగ్, సాక్షి మాలిక్ పాల్గొనాల్సి ఉంది. గత 15 రోజులుగా సాధనకు దూరంగా ఉన్న ఈ ముగ్గురూ తమ సహవస్తాదులతో కలసి ప్రాక్టీసు మొదలు పెట్టారు.

జితేందర్ కిన్హాతో కలసి భజరంగ్ పూనియా, సంగీత పోగట్, సాక్షి మాలిక్ లతో కలసి వినేశ్ పోగట్ సాధన చేసింది. త్వరలోనే తాము శరీరధారుడ్యం కోసం ప్రత్యేక వ్యాయామాలు చేస్తామని తెలిపారు.

ఇకముందు జరిగే అంతర్జాతీయ కుస్తీ , ఇతర టోర్నీలలో పాల్గొనటమే తమ లక్ష్యమని భజరంగ్ స్పష్టం చేశాడు. దేశానికి గతంలో పలు పతకాలు సాధించిన తాము..ఇకముందు జరిగే ఆసియాక్రీడలు, ఇతర అంతర్జాతీయ పోటీలలో సైతం పతకాలు అందించడం ఖాయమని భజరంగ్ చెప్పాడు.

కుస్తీ కోసమే 500 కోట్లు....

గత ఐదేళ్ల కాలంలో కుస్తీ క్రీడ కోసం, వస్తాదుల శిక్షణ, విదేశీ పర్యటనలు, ఇతర ఖర్చుల కోసం ప్రజలుకట్టిన పన్నుల నుండి 150 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు

కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించింది. విదేశాలలో శిక్షణ కోసం సైతం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు వివరించింది.

ప్రస్తుతం నిరసనలో పాల్గొంటున్న భజరంగ్ పూనియా కోసం 2 కోట్ల 58 లక్షలు, వినేశ్ పోగట్ కోసం 2 కోట్ల 16 లక్షల రూపాయలు వెచ్చించామని క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించింది.

First Published:  9 May 2023 5:58 AM GMT
Next Story