Telugu Global
Sports

ఆసియాక్రీడల్లో భజరంగ్, వినేశ్ లకు నేరుగా అర్హత!

కుస్తీ సమాఖ్యపై ఇటీవలే తిరుగుబాటు చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన వస్తాదుల జోడీ భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్ లకు త్వరలో జరిగే ఆసియాక్రీడల్లో నేరుగా పాల్గొనే అవకాశం దక్కింది.

ఆసియాక్రీడల్లో భజరంగ్, వినేశ్ లకు నేరుగా అర్హత!
X

ఆసియాక్రీడల్లో భజరంగ్, వినేశ్ లకు నేరుగా అర్హత!

కుస్తీ సమాఖ్యపై ఇటీవలే తిరుగుబాటు చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన వస్తాదుల జోడీ భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్ లకు త్వరలో జరిగే ఆసియాక్రీడల్లో నేరుగా పాల్గొనే అవకాశం దక్కింది.

ప్రపంచ, ఒలింపిక్స్, ఆసియా కుస్తీ పోటీలలో భారత్ కు పలుమార్లు పతకాలు అందించిన అంతర్జాతీయ వస్తాదులు భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్ లకు ..అర్హత పోటీలలో పాల్గొనకుండా..నేరుగా ఏషియాడ్ లో పాల్గొనే అవకాశాన్ని అడహాక్ కమిటీ కల్పించింది.

నిరసనదీక్షలతో ప్రాక్టీసుకు దూరం..

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గత కొద్ది మాసాలుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మల్లయోధులు నిర్వహించిన దీక్ష శిబిరంలో భజరంగ్, వినేశ్ ప్రధానపాత్ర పోషించారు. దీంతో సాధారణ ప్రాక్టీసుకు దూరమైన ఈ ఇద్దరు వస్తాదులకు మిగిలిన వస్తాదులతో కలసి సెలెక్షన్ ట్రయిల్స్ నిర్వహించాలని భావించారు.

అయితే..ప్రపంచ స్థాయిలో భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్ సాధించిన గత విజయాలు, రికార్డులను దృష్టిలో ఉంచుకొని..అర్హత పోటీలలో పాల్గొనకుండానే నేరుగా ఏషియాడ్ లో పాల్గొనేలా వెసలుబాటు కల్పించినట్లు కుస్తీ సమాఖ్య పగ్గాలు చేపట్టిన అడహాక్ కమిటీ ప్రకటించింది.

పురుషుల 65 కిలోల విభాగంలో భజరంగ్ పూనియా, మహిళల 53 కిలోల విభాగంలో వినేశ్ పోగట్ పాల్గొంటారని వివరించింది.

ఆరు విభాగాలలో వస్తాదుల ఎంపిక..

ఫ్రీ-స్టయిల్, గ్రీకో-రోమన్ విభాగాలలోని మొత్తం ఆరు తరగతుల వెయిట్ క్యాటగిరీలలో అర్హత పోటీలు నిర్వహించారు. ఈ వివరాలను భారత ఒలింపిక్ సంఘానికి చెందిన అడహాక్ కమిటీ ప్రతినిధి అశోక్ గార్గ్ తెలిపారు.

ఆసియా క్రీడల అర్హత పోటీలు నిర్వహించడానికి ముందే..భజరంగ్, వినేశ్ లను నేరుగా ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుస్తీ సమాఖ్య శిక్షకుల ఆమోదం లేకుండానే ఎంపిక చేయడం వివాదాస్పదమయ్యింది. కొందరు వస్తాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా జూలై 22న మహిళల ఫ్రీ-స్టయిల్, గ్రీకో రోమన్ విభాగాలలోనూ, 23న పురుషుల గ్రీకో రోమన్, ఫ్రీ-స్టయిల్ విభాగాలలోనూ ఏషియాడ్ లో పాల్గొనే భారత కుస్తీజట్ల సెలెక్షన్ ట్రయిల్స్ నిర్వహించనున్నారు.

2018 జకార్తా ఆసియాక్రీడల కుస్తీలో వినేశ్ పోగట్ బంగారు పతకం సాధించింది. ప్రస్తుతం హంగెరీలోని బుడాపెస్ట్ లో శిక్షణ పొందుతోంది. భజరంగ్ పూనియా కిర్గిజిస్థాన్ లోని ఇస్యాక్- కుల్ లో సాధన చేస్తున్నాడు.

చైనాలోని హాంగ్జు వేదికగా సెప్టెంబర్ 23 నుంచి ఆసియాక్రీడలు ప్రారంభంకానున్నాయి.

First Published:  19 July 2023 7:20 AM GMT
Next Story