Telugu Global
Sports

52 ఏళ్ల తర్వాత భారత్ కు బ్యాడ్మింటన్ పతకం!

Badminton Asia Championships: Satwik-Chirag pair ensures mens doubles medal after 52 years
X

52 ఏళ్ల తర్వాత భారత్ కు బ్యాడ్మింటన్ పతకం!

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో భారత్ 52 సంవత్సరాల తర్వాత పురుషుల డబుల్స్ లో పతకం ఖాయం చేసుకొంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లోనే పీవీ సింధుకు పరాజయం తప్పలేదు......

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలలో ఏదో ఒక పతకం సాధిస్తూ వచ్చిన భారత క్రీడాకారులు ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలలో మాత్రం సఫలం కాలేకపోతున్నారు.

52 సంవత్సరాల క్రితం మాత్రమే భారత్ ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో పతకం గెలుచుకొంది. అయితే ఐదు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ కు మరో ఆసియా పతకం ఖాయమయ్యింది.

దుబాయ్ వేదికగా జరుగుతున్న 2023 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీస్ కు భారత నంబర్ వన్ జోడీ సాయి సాత్విక్- చిరాగ్ షెట్టిల జోడీ చేరుకోడం ద్వారా కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోగలిగారు.

క్వార్టర్ ఫైనల్స్ పోరులో తమకంటే అపారఅనుభవం ఉన్న ఇండోనీషియా జోడీ హెండ్రా, అహ్ సాన్ లను రెండు గేమ్ ల పోరులోనే చిత్తు చేశారు.

గత రెండేళ్లుగా అంత్జాతీయ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో నిలకడగా రాణిస్తూ వస్తున్న సాయి సాత్విక్- చిరాగ్ జోడీ..21-11, 21-12తో ఇండోనీషియా జోడీని చిత్తు చేయడం ద్వారా మెడల్ రౌండ్లో అడుగుపెట్టారు.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో చైనీస్ తైపీ జోడీ లీ యాంగ్- వాంగ్ చీ- లిన్ లతో తలపడాల్సి ఉంది.

దుబాయ్‌ : ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల డబుల్స్‌ జోడి సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌శెట్టి సెమీఫైనల్స్‌కు చేరి 52 ఏళ్ల తరువాత పతకం ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌ జంట 21-11, 21-12తో అహ్‌సాన్‌-హెంద్రాను జోడీని ఓడించింది.

మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సింధు 21-18, 5-21, 9-21తో అన్‌ సె యంగ్‌ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌-సిక్కిరెడ్డి క్వార్టర్‌ఫైనల్లో ఓటమి పాలయ్యారు.

సింధు షరామామూలే...!

మహిళల సింగిల్స్ లో భారత టాప్ స్టార్ , తెలుగుతేజం పీవీ సింధు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లోనే 8వ సీడ్ సింధు పోటీ ముగిసింది.

దక్షిణ కొరియాకు చెందిన రెండోసీడ్ ప్లేయర్ సీ యంగ్ తో జరిగిన మూడుగేమ్ ల పోరులో సింధు 1-2తో పరాజయం చవిచూసింది.

తొలిగేమ్ ను 21-8తో అలవోకగా నెగ్గిన సింధు..ఆ తర్వాతి రెండుగేమ్ ల్లో ఘోరంగా విఫలమయ్యింది. రెండో గేమ్ లో 5-21, నిర్ణయాత్మక ఆఖరి గేమ్ లో 9-21తో విఫలమయ్యింది.

పురుషుల సింగిల్స్ లో సైతం భారత్ నిరాశ తప్పలేదు. క్వార్టర్ ఫైనల్లో జపాన్ కు చెందిన కాంటా సునెయామాతో జరిగిన పోరు రెండోగేమ్ పూర్తి కాకుండానే భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ గాయంతో ఉపసంహరించుకొన్నాడు.

11-21, 9-13తో ప్రణయ్ వెనుకబడిన సమయంలోనే అర్థంతరంగా పోటీ నుంచి వైదొలగడంతో పతకం ఆశలు ఆవిరైపోయాయి.

మిక్సిడ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ లోనే భారత జోడీ రోహన్ కపూర్0 సిక్కీ రెడ్డిల పోటీ ముగిసింది. ఇండోనీషియా జోడీ డిజాన్- గ్లోరియా గంటా 5 నిముషాల పోరులో 18-21, 21-10, 15-21తో భారత జంటను అధిగమించడం ద్వారా సెమీస్ లో అడుగుపెట్టారు.

పురుషుల, మహిళల సింగిల్స్ , డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ బరిలో నిలిచిన భారత్ కు చివరకు..పురుషుల డబుల్స్ లో మాత్రమే పతకం ఖాయం కావడం..అదీ 52 సంవత్సరాల అనంతరం కావడం కాస్త ఊరట నిచ్చే అంశంగా కనిపిస్తోంది.

చైనా, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, ఇండోనీసియా, మలేసియా, భారత్ లాంటి దిగ్గజ జట్లు ఆసియా బ్యాడ్మింటన్ బరిలోకి దిగడంతో..ప్రపంచ పోటీలను మించి పోరు హోరాహోరీగా సాగటం ఆనవాయితీగా వస్తోంది.

ఒలింపిక్స్ లో పతకం సాధించడం కన్నా..ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలోనే పతకం నెగ్గడం భారత్ క్రీడాకారులకు కష్టంగా అనిపిస్తోంది.

First Published:  29 April 2023 10:30 AM GMT
Next Story