Telugu Global
Sports

చెత్త ఫీల్డింగ్ తో భారత్ బొక్కబోర్లా!

అనుకున్నంతా జరిగింది.

చెత్త ఫీల్డింగ్ తో భారత్ బొక్కబోర్లా!
X

అనుకున్నంతా జరిగింది. పెర్త్ బౌన్సీ పిచ్ పై భారత్ బొక్కబోర్లా పడింది. టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్-2 మూడోరౌండ్ పోరులో తొలి ఓటమి చవిచూసింది.

దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్ ను కంగు తినిపించింది...

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ కు 3వ ర్యాంకర్ దక్షిణాఫ్రికా దిమ్మతిరిగే షాకిచ్చింది. ప్రస్తుత ప్రపంచకప్ లోనే ఫాస్టెస్ట్ పిచ్ గా పేరుపొందిన పెర్త్ స్టేడియం వికెట్ పై సూర్యకుమార్ మినహా మిగిలిన భారత మొనగాళ్లంతా చేతులెత్తేశారు. బ్యాటింగ్ కు తోడు ఫీల్డింగ్ లోనూ దారుణంగా విఫలమైన భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Advertisement

లోస్కోరింగ్ థ్రిల్లర్....

పెర్త్ ఫాస్ట్ , బౌన్సీ పిచ్ పైన ..ముందుగా కీలక టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొన్నాడు. అసలే మేఘావృత వాతావరణం, ఆ పైన బంతి ఎగసి పడే బౌన్సీ పిచ్ పైన పాక్ ఫాస్ట్ బౌలర్ల దండు చెలరేగిపోయింది.

లుంగీ ఎంగిడీ, కిగీసో రబడ, వెయిన్ పార్నెల్, నోర్జేలతో కూడిన సఫారీ ఫాస్ట్ ఎటాక్ గంటకు 140 కిలోమీటర్ల సగటు వేగంతో బంతులు విసిరి భారత టాపార్డర్ ను బెంబేలెత్తించారు.

Advertisement

ప్రధానంగా ఎంగిడి కుదురైన బౌలింగ్ తో ...ఓ వ్యూహం ప్రకారం ఎగసిపడే బంతులతో..భారత ఓపెనర్లు రాహుల్ (9), రోహిత్ ( 15 ), విరాట్ ( 12)లను పెవీలియన్ దారిపట్టించాడు. ఆల్ రౌండర్లు దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యాలు సైతం అవుట్ కావడంతో భారత్ 8.3 ఓవర్లలోనే 49 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయి...దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కనీసం వంద పరుగులైనా చేయగలదా అనుకొనేలా చేసింది.

ఒకే ఒక్కడు సూర్యకుమార్...

మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్- వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 6వ వికెట్ కు కీలక భాగస్వామ్యంతో భారత్ కు ఊపిరిపోశారు. చెలరేగిపోతున్న సఫారీ ఫాస్ట్ బౌలర్లపై సూర్యకుమార్ తనదైన శైలిలో షాట్లు కొడుతూ ఎదురుదాడికి దిగాడు. 52 పరుగుల భాగస్వామ్యంతో భారత స్కోరు మూడంకెల స్కోరు దాటడంలో ప్రధానపాత్ర వహించాడు.

కేవలం 40 బాల్స్ లోనే 3 సిక్సర్లు, 6 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో సూర్యకు ఇది వరుసగా రెండో అర్థశతకం కావడం విశేషం.

దినేశ్ కార్తీక్ 6, అశ్విన్ 7 పరుగులకు అవుటయ్యారు. చివరకు సూర్య ఆట 19వ ఓవర్లో 68 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులతో పరువు దక్కించుకొంది.

సఫారీ పేసర్లలో ఎంగిడి 4 వికెట్లు, పార్నెల్ 3, నోర్జే 1 వికెట్ పడగొట్టారు.

విరాట్, రోహిత్...చెత్త ఫీల్డింగ్....

అసలే లోస్కోరింగ్ మ్యాచ్. అందులో రెండుజట్లకూ ప్రతి పరుగూ కీలకమే. 134 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ను ఆట మొదటి 10 ఓవర్లలో భారత బౌలర్లు పూర్తిగా అదుపు చేయగలిగారు. పవర్ ప్లే ఓవర్లలో సఫారీల స్కోరు 3 వికెట్లకు 24 పరుగులు మాత్రమే. అర్షదీప్ సింగ్, భువనేశ్వర్, షమీ కట్టుదిట్టంగా బౌల్ చేస్తే..

పాండ్యా, అశ్విన్ ల బౌలింగ్ లో మాత్రమే మర్కరమ్, మిల్లర్ పరుగులు దండుకోగలిగారు.

మొదటి 10 ఓవర్లలో ఆచితూచి ఆడుతూ వచ్చిన మర్కరమ్, డేవిడ్ మిల్లర్ ఆ తర్వాత తమ బ్యాట్లకు పూర్తి స్థాయిలో పని చెప్పారు. దీనికితోడు మర్కరమ్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ..అశ్విన్ బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్ ను విరాట్ కొహ్లీ జారవిడిచాడు. ఆ తర్వాత మర్కరమ్ ను సునాయాసంగా రనౌట్ చేసే అవకాశాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ చేజార్చాడు. దీంతో సఫారీజట్టు పుంజుకోగలిగింది. 4వ వికెట్ కు 76 పరుగుల కీలక భాగస్వామ్యంతో మర్కరమ్- మిల్లర్ జోడీ పట్టు బిగించారు.

మ్యాచ్ ను భారత్ ఆట 20 ఓవర్ వరకూ తీసుకెళ్లగలిగినా ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా చివరకు 5 వికెట్ల నష్టానికే లక్ష్యాన్ని చేరుకోడం ద్వారా కీలక విజయం నమోదు చేయగలిగింది.

దక్షిణాఫ్రికా విజయానికి 4 వికెట్లతో మార్గం సుగమం చేసిన ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రపంచకప్ చరిత్రలో భారత్ ప్రత్యర్థిగా దక్షిణాఫ్రికాజట్టుకు ఇది రెండో గెలుపు మాత్రమే.

భారత జట్టులోని ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు, ఇద్దరు అత్యుత్తమ ఫీల్డర్లు తప్పదాలు చేసిన తొలి టీ-20 మ్యాచ్ గా ఇది నిలిచిపోతుంది. 100 కు 99 క్యాచ్ లు అలవోకగా పట్టేసే విరాట్ కొహ్లీ, మెరుపువేగంతో రనౌట్లు చేసే రోహిత్ శర్మ కీలక సమయంలో విఫలం కావడమే భారత ఓటమికి కారణమని చెప్పాల్సిన పనిలేదు.

Next Story