Telugu Global
Sports

అక్షర్, రాహుల్ ఇంట పెళ్లిబాజా!

భారత స్టార్ క్రికెటర్లు అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ ఆటకు తాత్కాలిక విరామం ఇచ్చి పెళ్లిబాట పట్టారు.

అక్షర్, రాహుల్ ఇంట పెళ్లిబాజా!
X

భారత స్టార్ క్రికెటర్లు అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ ఆటకు తాత్కాలిక విరామం ఇచ్చి పెళ్లిబాట పట్టారు. తమ ప్రియురాళ్లను జీవితభాగస్వాములుగా చేసుకోడానికి ముహూర్తం పెట్టుకొన్నారు....

శ్రీలంకతో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో భారత్ విజేతగా నిలవడంలో తమవంతు పాత్ర పోషించిన స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కెఎల్ రాహుల్..న్యూజిలాండ్ తో సిరీస్ కు వ్యక్తిగత పనుల మీద దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం పెళ్లిపనుల్లో బిజీబిజీగా ఉన్నారు.

Advertisement

గత కొద్దినెలలుగా తీరికలేని క్రికెట్ ఆడుతూ వచ్చిన ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు పెళ్లికోసం కొద్దిరోజులపాటు క్రికెట్ కు దూరం కావాలని నిర్ణయించుకొన్నారు. న్యూజిలాండ్ తో వన్డే, టీ-20 సిరీస్ లకు భారతజట్ల ఎంపిక సమయంలో తమపేర్లను పరిగణనలోకి తీసుకోరాదని బోర్డు ఎంపిక సంఘాన్ని అభ్యర్థించారు.

బాలీవుడ్ అల్లుడు కాబోతున్న రాహుల్

భారత క్రికెట్ మూడుఫార్మాట్ల ప్లేయర్ కెఎల్ రాహుల్ ఈనెల 23న బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి కుమార్తె, ప్రముఖ మోడల్, నటి అత్యా శెట్టిని తన జీవితభాగస్వామిగా చేసుకోబోతున్నాడు.

Advertisement

అత్యాశెట్టితో గత ఏడాదికాలంగా డేటింగ్ చేస్తూ, చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న రాహుల్ కుటుంబసభ్యుల ఆమోదంతో తన జీవితభాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించాడు.

సినీనటుడు సునీల్ శెట్టి సైతం ఓ స్టార్ క్రికెటర్ తనింటి అల్లుడు కాబోతుండడంతో మురిసిపోతున్నారు.

అత్యా, రాహుల్ ఒకరినొకరు ఇష్టపడ్డారని, తమ ప్రేమ విషయాన్నిపెద్దలకు తెలిపి ఆశీసులు, ఆమోదం తీసుకొన్నారని, పెళ్లి ఎలా చేసుకోవాలన్నది వారిద్దరి ఇష్టమని సునీల్ శెట్టి ఇటీవలే చెప్పారు.

అత్యా-రాహుల్ గత కొద్దిమాసాలుగా సోషల్ మీడియాలో తమ ఫోటోలను ఉంచుతూ..పెళ్లి విషయాన్ని మాత్రం బయటకు రానివ్వకుండా దాగుడుమూతలాడుతూ వచ్చారు.

మొత్తం మీద భార్యాభర్తలుగా కొత్త భాగస్వామ్యానికి తెరతీయనున్నారు.

రాహుల్ వివాహానికి బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు పలువురు హాజరు కానున్నారు. భారత క్రికెటర్లు మాత్రం న్యూజిలాండ్ తో సిరీస్ కారణంగా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

మేహా పటేల్ తో అక్షర్ వివాహం...

భారత క్రికెట్ కు గత రెండుసంవత్సరాలుగా క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ అసమాన సేవలు అందిస్తూ..రవీంద్ర జడేజా లేని లోటును పూడ్చిన లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన ప్రియురాలు మేహా పటేల్ ను మూడుముళ్ల బంధంతో సొంతం చేసుకోవాలని నిర్ణయించాడు.

తన 28వ పుట్టినరోజున స్నేహితురాలు మేహాను తన జీవితభాగస్వామిగా చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. నిశితార్థం కూడా జరుపుకొన్నాడు. అయితే..భారత్ తరపున టెస్టులు, వన్డేలు, టీ-20 ప్రపంచకప్ తో సహా సిరీస్ వెంట సిరీస్ , టోర్నీ వెంట టోర్నీ ఆడుతూ వివాహాన్ని వాయిదా వేసుకొంటూ వచ్చాడు.

అయితే..జనవరి 18 నుంచి న్యూజిలాండ్ తో జరుగనున్న మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు దూరంగా ఉండటం ద్వారా పెళ్ళితంతును ముగించాలని నిర్ణయించాడు. నిశ్చితార్థం జరుపుకొని ఏడాదికాలం పూర్తి కావడంతో రెండువైపులా కుటుంబసభ్యులు ఒత్తిడి చేయటంతో పెళ్లికోసం తీరిక చేసుకోగలిగాడు.

డైటీషియన్ గా పనిచేస్తున్న మేహా సోషల్ మీడియా ద్వారా చాలా చురుకుగా ఉంటూ వస్తోంది. అక్షర్ తో తన ప్ర్రేమాయణాన్ని చాలా గుట్టుగా కాపాడుకొంటూ వచ్చింది. అయితే..ఈ మధ్యనే వివిధ సందర్భాలలో తాను అక్షర్ తో కలసి ఉన్న చిత్రాలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసింది.

ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో సభ్యుడిగా ఉన్న అక్షర్..జనవరి 9న నాగపూర్ వేదికగా జరిగే తొలిటెస్టు నాటికి అందుబాటులో ఉండాలని నిర్ణయించాడు.

న్యూజిలాండ్ తో జరిగే తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ లకు దూరమయ్యాడు. ఈనెల చివర్లో మేహాను అక్షర్ తన జీవితభాగస్వామిని చేసుకోనున్నాడు.

మొత్తం మీద..మరో ఇద్దరు టీమిండియా స్టార్లు బ్యాచులర్ హుడ్ కు గుడ్ బై చెప్పి సంసారసాగరంలో దూకడం ఖాయమైపోయింది.

Next Story