Telugu Global
Sports

అక్షర్, శివం షో..తొలి టీ-20లో భారత్ బోణీ!

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ గెలుపుతో సన్నాహాలు ప్రారంభించింది. అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ తొలిపోరులో 6 వికెట్ల విజయం సాధించింది.

అక్షర్, శివం షో..తొలి టీ-20లో భారత్ బోణీ!
X

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ గెలుపుతో సన్నాహాలు ప్రారంభించింది. అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ తొలిపోరులో 6 వికెట్ల విజయం సాధించింది.

వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ టీమ్ భారత్ గెలుపుతో సన్నాహాలను మొదలు పెట్టింది.

టీ-20 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తో ప్రారంభమైన తీన్మార్ సిరీస్ మొదటి మ్యాచ్ లో నెగ్గడం ద్వారా 1-0తో పైచేయి సాధించింది.

అక్షర్ పటేల్ స్పిన్ మ్యాజిక్....

ఎముకలు కొరికే చలి వాతావరణంలో ..మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన ఈ ఏకపక్షపోరులో ముందుగా టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపింది.

ఓపెనర్ యశస్వి జైశ్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, రన్ మెషీన్ విరాట్ కొహ్లీ, స్పిన్ జాదూ కుల్దీప్ యాదవ్ లకు తొలిమ్యాచ్ లో అవకాశం కల్పించలేదు.

స్పిన్ ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తో పాటు లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ కు తుదిజట్టులో చోటు కల్పించింది.

మరోవైపు..టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన అప్ఘన్ జట్టుకు ఓపెనింగ్ జోడీ గుర్జాబ్- ఇబ్రహీం జడ్రాన్ మొదటి వికెట్ కు 7 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యం అందించారు.

గుర్బాజ్ 28 బంతుల్లో 2 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 23, కెప్టెన్ జడ్రాన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ తో 25 పరుగులు సాధించినా భారత బౌలర్లు కట్టడి చేయగలిగారు.

ఛేంజ్ బౌలర్లు అక్షర్ పటేల్, శివం దూబే చెరో వికెట్ పడగొట్టడం ద్వారా అప్ఘన్ ఓపెనర్లను పెవీలియన్ దారి పట్టించగలిగారు.

వన్ డౌన్ అజమ్ తుల్లా 29, మిడిలార్డర్ బ్యాటర్లు నబీ 42, నజీబుల్లా 19 పరుగుల స్కోర్లు సాధించడంతో అప్ఘన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో అక్షర్ తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ బౌలింగ్ లో బంగ్లా బ్యాటర్లు ఓ ఫోరు, సిక్సర్ మాత్రమే బాదగలిగారు.

పేసర్ ముకేశ్ కుమార్ 2 వికెట్లు, పేసర్ శివం దుబే 1 వికెట్ పడగొట్టారు.

శివం దుబే ఆల్ రౌండ్ షో..

159 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ కు తొలి ఓవర్ మూడోబంతికే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొని..సహఓపెనర్ శుభ్ మన్ గిల్ నిర్లక్ష్యం కారణంగా డకౌట్ గా రనౌటయ్యాడు.

ఆ తరువాత వచ్చిన తిలక్ వర్మతో కలసి రెండో వికెట్ కు 28 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన గిల్ 12 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

వన్ డౌన్ తిలక్ వర్మ సైతం బ్యాట్ ఝళిపించి 22 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ తో 26 పరుగులకు వెనుదిరగడంతో భారత్ 72 పరుగులకే 3వ వికెట్ నష్టపోయింది.

అయితే..ఆల్ రౌండర్ శివం దుబే-వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ నాలుగో వికెట్ కు ధాటిగా ఆడడంతో పాటు కీలక భాగస్లామ్యం నమోదు చేశారు.

జితేశ్ శర్మ 20 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులకు అవుటయ్యాడు.

మరోవైపు ..శివం దుబే మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడి 40 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. రింకూ సింగ్ సైతం 9 బంతుల్లోనే 2 ఫోర్లతో 16 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

భారత్ 17.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికే 6 వికెట్ల విజయం సాధించడం ద్వారా సిరీస్ లో 1-0తో పైచేయి సాధించింది. అప్ఘన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్ కు 2 వికెట్లు, అజంతుల్లా ఓమర్ జాయ్ కు 1 వికెట్ దక్కాయి.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన శివం దూబేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రోహిత్ 100 విజయాల రికార్డు.

ఈ విజయంతో భారత కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగాడు. పరుగులేవీ చేయకుండా రనౌటైనా..టీ-20 చరిత్రలో 100 విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

మహిళా టీ-20 ల్లో 100 విజయాలు సాధించిన ప్లేయర్లలో అలీసా హేలీ, ఎల్సీ పెర్రీ, ఇంగ్లండ్ కు చెందిన డానీ వెయిట్ ఉంటే...పురుషుల విభాగంలో రోహిత్ కు మాత్రమే ఆ అరుదైన రికార్డు దక్కింది.

స్వదేశీ టీ-20 సిరీస్ ల్లో 160 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన సమయంలో భారత్ గత 17 మ్యాచ్ ల్లో 16వ విజయం నమోదు చేసింది. 2016 సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే 160 స్కోరును అధిగమించడంలో భారత్ విఫలమయ్యింది.

ప్రస్తుత సిరీస్ లోని కీలక రెండో టీ-20 ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా సూపర్ సండే ఫైట్ గా జరుగనుంది.

First Published:  12 Jan 2024 4:27 AM GMT
Next Story