Telugu Global
Sports

హాకీ ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా ప్రపంచ రికార్డు!

ప్రపంచ హాకీలో ఆస్ట్ర్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా 12వసారి హాకీ ప్రపంచకప్ సెమీస్ చేరడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

హాకీ ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా ప్రపంచ రికార్డు!
X

హాకీ ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా ప్రపంచ రికార్డు!

ప్రపంచ హాకీలో ఆస్ట్ర్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా 12వసారి హాకీ ప్రపంచకప్ సెమీస్ చేరడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో జర్మనీతో తలపడనుంది.

భారత్ వేదికగా జరుగుతున్న 15వ హాకీ ప్రపంచకప్ పురుషుల టోర్నీలో సైతం యూరోప్ , ఆస్ట్ర్రేలియాజట్ల దూకుడే కొనసాగుతోంది. ఆసియాజట్లు పూర్తిగా వెనుకబడి పోయాయి.

గ్రూప్ లీగ్, క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ పోటీలు ముగియటంతో సెమీస్ పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

సెమీస్ లో 12వసారి ఆస్ట్ర్రేలియా..

15 ప్రపంచకప్ హాకీ టోర్నీల చరిత్రలో వరుసగా 12వసారి సెమీఫైనల్స్ కు అర్హత సాధించడం ద్వారా ఆస్ట్ర్రేలియా తన ప్రపంచ రికార్డును తానే అధిగమించుకొంది.

ఇప్పటికే మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన కంగారూజట్టు ప్రస్తుత 2023 ప్రపంచకప్ లో సైతం జైత్రయాత్ర మొదలుపెట్టింది.

హోరాహోరీగా సాగిన తొలి క్వార్టర్ ఫైనల్స్ లో స్పెయిన్ ను 4-3 గోల్స్ తో అధిగమించడం ద్వారా సెమీస్ లో అడుగుపెట్టింది. ఈ నెల 27న జరిగే సెమీఫైనల్లో జర్మనీతో కంగారూ టీమ్ తలపడనుంది.

కొరియాపై నెదర్లాండ్స్ విజయం...

మరో క్వార్టర్ ఫైనల్లో ఆసియాటీమ్ దక్షిణ కొరియాను నెదర్లాండ్స్ 5-1 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా సెమీస్ పోరుకు అర్హత సాధించింది. గ్రూపులీగ్ దశలో 14 గోల్స్ తో నెగ్గడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన డచ్ జట్టు సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియంతో అమీతుమీ తేల్చుకోనుంది.

షూటౌట్ లో గట్టెక్కిన జర్మనీ

ఇంగ్లండ్ తో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ సమరంలో జర్మనీ గట్టి పోటీ ఎదుర్కొని పెనాల్టీ షూటౌట్ ద్వారా 4-3తో ఇంగ్లండ్ పై నెగ్గి సెమీస్ లో అడుగుపెట్టింది.ఆట నిర్ణితసమయంలో జర్మనీపై 2-0 గోల్స్ ఆధిక్యత సంపాదించిన ఇంగ్లండ్ ఆ తర్వాత ఆధిక్యాన్ని చేజార్చుకొంది. జర్మన్ జట్టులోని సోదరులు మాట్స్ గ్రామ్‌ బాష్, టామ్ బాష్ ఆట 58, 59 నిముషాలలో గోల్సు సాధించడం ద్వారా 2-2తో సమఉజ్జీగా నిలపడంతో పోటీ పెనాల్టీ షూటౌట్ కు చేరింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో మూడుసార్లు విజేత, హాట్ ఫేవరెట్ ఆస్ట్ర్రేలియాతో జర్మనీ ఢీ కోనుంది.

జపాన్ తో భారత్ సమరం..

క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకోడంలో విఫలమైన ఆతిథ్య భారత్ చివరకు 9 నుంచి 16 స్థానాల వర్గీకరణ రౌండ్ లో తలపడాల్సి వచ్చింది. తొలిపోరులో జపాన్ తో భారత్ పోటీ పడనుంది.

క్వార్టర్స్ బెర్త్ కోసం న్యూజిలాండ్ తో జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్ లో భారత్ పెనాల్టీ షూటౌట్ లో 3-4 గోల్స్ తో పరాజయం పొందటంతో క్వార్టర్స్ కు అర్హత సాధించలేకపోయింది.

9నుంచి 16 స్థానాల రౌండ్లో భారత్, అర్జెంటీనా, జపాన్, ఫ్రాన్స్, చిలీ, కొరియా, వేల్స్ తలపడనున్నాయి.

ప్రపంచకప్ హాకీ సెమీస్ జనవరి 27న, ఫైనల్స్ జనవరి 29న జరుగనున్నాయి.

First Published:  26 Jan 2023 7:26 AM GMT
Next Story