Telugu Global
Sports

నేడే ఫైనల్స్, పదో టైటిల్ కు జోకోవిచ్ గురి!

ఆస్ట్ర్లేలియన్ ఓపెన్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పదోసారి ట్రోఫీ అందుకోడానికి జోకోవిచ్ సిద్ధమయ్యాడు.

నేడే ఫైనల్స్, పదో టైటిల్ కు జోకోవిచ్ గురి!
X

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను పదోసారి గెలుచుకోడానికి సెర్బియన్ థండర్ జోకోవిచ్ తహతహలాడుతున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఈ రోజు జరిగే ఫైనల్లో గ్రీకువీరుడు సిట్సీపాస్ తో తలపడనున్నాడు...

గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో ప్రపంచ మాజీ నంబర్ వన్ స్టార్, 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ నొవాక్ జోకోవిచ్ జోరు కొనసాగుతోంది.

ఆస్ట్ర్లేలియన్ ఓపెన్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పదోసారి ట్రోఫీ అందుకోడానికి జోకోవిచ్ సిద్ధమయ్యాడు.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ఈరోజు జరిగే టైటిల్ సమరంలో గ్రీకు వీరుడు స్టెఫానోస్ సిట్సీపాస్ తో తలపడనున్నాడు.

సెమీస్ లో అలవోక గెలుపు..

తన కెరియర్ లో ఇప్పటికే తొమ్మిదిసార్లు ( 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 ) ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జోకోవిచ్..ప్రస్తుత 2023 సీజన్ సెమీఫైనల్లో అమెరికా ఆటగాడు టోమీ పాల్ ను 7-5, 6-1, 6-1తో అమెరికన్ అన్ సీడెడ్ ఆటగాడు టోమీ పాల్ ను చిత్తు చేశాడు. ఇప్పటికే తన కెరియర్ లో 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన జోకోవిచ్ కు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇది వరుసగా 27వ గెలుపు కావడం విశేషం. ఏకబిగిన 27 మ్యాచ్ లు నెగ్గడం తో పాటు పదిసార్లు ఫైనల్స్ చేరిన ఏకైక ఆటగాడిగా జోకోవిచ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

హాట్ ఫేవరెట్ జోకోవిచ్...

గత దశాబ్దకాలంగా ప్రపంచ పురుషుల టెన్నిస్ లో జోకోవిచ్ ఆధిపత్యమే కొనసాగుతోంది.2011 నుంచి 2021 మధ్యకాలంలో జోకోవిచ్ 18 గ్రాండ్ స్లామ్, 31 మాస్టర్స్, 4 ఏటీపీ టైటిల్స్ నెగ్గడం ద్వారా నడాల్, ఫెదరర్ లాంటి ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు. 2022 గ్రాండ్ స్లామ్ సీజన్ లోని నాలుగుటోర్నీలలో ఏ రెండు టైటిల్స్ నెగ్గినా..జోకోవిచ్ అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన మొనగాడిగా నిలిచిపోగలుగుతాడు.

హార్డ్ కోర్ట్ టెన్నిస్ లో ఇప్పటికే జోకోవిచ్ 9సార్లు ఆస్ట్ర్రేలియన్ టైటిల్ నెగ్గడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు. నడాల్ 22

గ్రాండ్ స్లామ్ టైటిల్స్, జోకోవిచ్ 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ...మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నారు.

గత 15 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టోర్నీలలో తొమ్మిదిసార్లు జోకోవిచ్ మాత్రమే విజేతగా నిలవడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

తొలిటైటిల్ వేటలో సిట్సీపాస్..

టైటిల్ సమరంలో జోకోవిచ్ తో తలపడనున్న గ్రీకువీరుడు, 24 సంవత్సరాల సిట్సీపాస్ తన కెరియర్ లో అందని ద్రాక్షలా ఉన్న ఆస్ట్ర్రేలియన్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాడు. తొలిసెమీఫైనల్లో 3వ సీడ్ సిటిస్ పాస్ నాలుగుసెట్ల పోరులో 18వ సీడ్ కారెన్ కచనోవ్ ను అధిగమించాడు. సిట్సీ పాస్ 7-6, 6-4, 6-7, 6-3తో విజేతగా నిలిచాడు.

గతంలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జోకోవిచ్ చేతిలో ఓటమి పొందిన 24 సంవత్సరాల సిటిస్ పాస్ తొలిసారిగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ పోరులో హాట్ ఫేవరెట్ జోకోవిచ్ పై బదులుతీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన పదికి పది మ్యాచ్ లు నెగ్గడం ద్వారా 10-0 రికార్డుతో ఉన్న సిటిస్ పాస్..ఫైనల్లో జోకోవిచ్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

2019 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో రోజర్ ఫెదరర్ పై సంచలన విజయం సాధించడం ద్వారా దూసుకొచ్చిన సిటిస్ పాస్ కు 2021, 2022 టోర్నీల సెమీస్ చేరిన రికార్డు ఉంది.

ఈ రోజు జరిగే టైటిల్ సమరంలో నెగ్గిన ఆటగాడికి 15 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో పాటు...ట్రోఫీని సైతం అందచేయనున్నారు. జోకోవిచ్ రికార్డుస్థాయిలో 10వసారి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ గా నిలిస్తే..కెరియర్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను 22కు పెంచుకొని నడాల్ సరసన నిలువగలుతాడు.

First Published:  29 Jan 2023 4:41 AM GMT
Next Story