Telugu Global
Sports

ఐదేళ్ల తర్వాత టెస్ట్ వేదికగా ఢిల్లీ

భారత క్రికెట్ ప్రధాన టెస్టు వేదికల్లో ఒకటైన న్యూఢిల్లీ ఐదుసంవత్సరాల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది.

ఐదేళ్ల తర్వాత టెస్ట్ వేదికగా ఢిల్లీ
X

ఐదేళ్ల తర్వాత టెస్ట్ వేదికగా ఢిల్లీ

భారత క్రికెట్ ప్రధాన టెస్టు వేదికల్లో ఒకటైన న్యూఢిల్లీ ఐదుసంవత్సరాల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఓ టెస్టుమ్యాచ్ కు వేదిక కానుంది...

భారత క్రికెట్ ప్రధాన అంతర్జాతీయమ్యాచ్ వేదికల్లో న్యూఢిల్లీకి ప్రత్యేకస్థానం ఉంది. గతంలో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరుతో పలు అంతర్జాతీయ వన్డే, టీ-20, టెస్టుమ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన ఢిల్లీ స్టేడియం ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చుకొంది.

ఐదేళ్ల క్రితమే చివరిసారిగా ఓ టె్స్టుమ్యాచ్ కు వేదికగా నిలిచిన ఢిల్లీ ఆ తర్వాత నుంచి ఐపీఎల్ లేదా..వన్డే, టీ-20 అంతర్జాతీయమ్యాచ్ లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

ఆస్ట్ర్రేలియాతో భారత్ టెస్టు సిరీస్..

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్- ఆస్ట్ర్రేలియాజట్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి వరకూ నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తలపడనున్నాయి.

ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్ర్రేలియాజట్టు భారత పర్యటనకు రానుంది. మొత్తం నాలుగు టెస్టుల సిరీస్ కు న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం, అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం, ధర్మశాల హిమాచల్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికలుగా ఖరారయ్యాయి. నాగపూర్ లేదా చెన్నై వేదికగా మరో టెస్టు మ్యాచ్ నిర్వహించనున్నారు.

ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్స్ కు భారత్ అర్హత సాధించాలంటే ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను 4-0తో నెగ్గితీరాల్సి ఉంది.

2024 ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లను ఐసీసీ నిర్వహించనుంది. ప్రస్తుతం నాలుగుమ్యాచ్ ల సిరీస్ లు మాత్రమే నిర్వహిస్తున్నారు.

2017 తర్వాత ఢిల్లీలో తొలిటెస్టు...

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చివరిసారిగా 2017లో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత కోవిడ్ దెబ్బతో అంతర్జాతీయ టెస్టులకు ఢిల్లీ దూరమయ్యింది.

భారత క్రికెట్ సంఘం పాటిస్తున్నరొటేషన్ పాలసీ ప్రకారం ఢిల్లీ వేదికగా టెస్టు మ్యాచ్ నిర్వహించాలని భావిస్తున్నారు.

ఆరేళ్ల క్రితం తొలిసారిగా టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన ధర్మశాల స్టేడియాన్ని సైతం మరోసారి టెస్టు వేదికగా ఖాయం చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

సిరీస్ లో భాగంగా నిర్వహించే డే-నైట్ టెస్టు మ్యాచ్ కు వేదికగా నాగపూర్, చెన్నై, హైదరాబాద్ లలో ఒక స్టేడియాన్ని బీసీసీఐ ఎంపిక చేయాల్సి ఉంది.

డే- నైట్ టెస్టులను భారత గడ్డపై ఇప్పటి వరకూ మూడుసార్లు మాత్రమే నిర్వహించారు. బంగ్లాదేశ్ తో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్, మొహాలీ వేదికగా ఇంగ్లండ్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో గతంలో పింక్ బాల్ టెస్టులను బీసీసీఐ నిర్వహించింది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా కోవిడ్ కు ముందు కాలంలో భారత్ ఎనిమిది టెస్టులకు ఆతిథ్యమిచ్చింది. 2021లో ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్, న్యూజిలాండ్, శ్రీలంకజట్లతో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లను నిర్వహించింది.

కోవిడ్ కు ముందు చెన్నై, అహ్మదాబాద్, కాన్పూర్, ముంబై, మొహాలీ, బెంగళూరు వేదికలుగా టెస్టు మ్యాచ్ లు జరిగాయి.

First Published:  19 Nov 2022 7:48 AM GMT
Next Story