Telugu Global
Sports

మహిళా ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా డబుల్ హ్యాట్రిక్!

సీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది.

మహిళా ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా డబుల్ హ్యాట్రిక్!
X

ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. కంగారూజట్టు ఆరోసారి ప్రపంచకప్ నెగ్గి తన రికార్డును తానే తిరగరాసుకొంది...

ధూమ్ ధామ్ టీ-20 మహిళా ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా తన రికార్డులను తానే అధిగమిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది. సంవత్సరాలు, వేదికలు మారినా విజేతను తానేనని చాటుకొంటూ వస్తోంది.

గత ఏడు ప్రపంచకప్ టోర్నీలలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్ర్రేలియా 2023 ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో సైతం తన ఆధిపత్యం చాటు కొంది. వరుసగా ఏడోసారి ప్రపంచకప్ ఫైనల్స్ కు అర్హత సాధించిన ఆస్ట్ర్రేలియా ఆరోసారి విజేతగా నిలవడం ద్వారా డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

ఫైనల్లో సఫారీల సఫా...

కేప్ టౌన్ న్యూల్యాండ్స్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ కు రికార్డుస్థాయిలో 17వేల మంది అభిమానులు హాజరయ్యారు. దక్షిణాఫ్రికా మహిళాజట్టు తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియాను ఢీకోనుండడంతో గతంలో ఎన్నడూలేని విధంగా అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. అయితే..ఐదుసార్లు విజేత, ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా చేతిలో తమజట్టు 19 పరుగుల పరాజయం చవిచూడటాన్ని చూసి తీవ్రనిరాశకు గురయ్యారు.

బెత్ మూనీ షో....

ఈ కీలక సమరంలో టాస్‌ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగుల స్కోరు సాధించగలిగింది. ఓపెనర్ బెత్ మూనీ 53 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సతో 74 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచింది.

ఆల్ రౌండర్ గార్డ్నర్ (29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఓపెనర్ అలీసా హీలీ (18; 3 ఫోర్లు) తమవంతు పాత్ర పోషించారు. సఫారీ మెరుపు ఫాస్ట్ బౌలర్ల జోడీ

షబ్నమ్‌ ఇస్మాయిల్‌, మరీనే కాప్‌ చె చెరో 2 వికెట్లు పడగొట్టారు.

చేజింగ్ లో తేలిపోయిన సఫారీలు..

కేప్ టౌన్ న్యూల్యాండ్స్ వేదికగా గతంలో రెండుకు రెండుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన సమయంలో మాత్రమే విజయాలు సాధించిన ఆతిథ్య దక్షిణాఫ్రికాజట్టు..టైటిల్ సమరంలో మాత్రం చేజింగ్ కు దిగాల్సి వచ్చింది.

157 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన సఫారీటీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు మాత్రమ చేయగలిగింది. లారా వాల్‌వార్ట్‌ దూకుడుగా ఆడి 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీతో 61 పరుగులు చేసినా..మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 19 పరుగుల పరాజయం తప్పలేదు.

తొలిసారి ఫైనల్స్ చేరిన సఫారీటీమ్ చివరకు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు.

ఆస్ట్ర్రేలియా ఓపెనర్ బెత్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్, ఆల్ రౌండర్ యాష్ గార్డ్నర్ కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

వరుసగా మూడో ప్రపంచకప్ టైటిల్..

2009 ప్రారంభ మహిళా టీ-20 ప్రపంచకప్ నుంచి 2020 టోర్నీ వరకూ ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్ర్రేలియా..2018, 2020 ప్రపంచకప్ లతో పాటు 2023 టైటిల్ సైతం నెగ్గడం ద్వారా హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేసింది. వరుసగా మూడు ప్రపంచకప్ టైటిల్స్ నెగ్గిన ఏకైకజట్టుగా, ఆరుసార్లు ప్రపంచకప్ ట్రోఫీ అందుకొన్న ఒకే ఒక్కజట్టుగా, వరుసగా ఏడుసార్లు ఫైనల్స్ చేరిన జట్టుగా ఆస్ట్ర్రేలియా ప్రపంచ రికార్డుల మోత మోగించింది.

మూడుజట్లకే ప్రపంచవిజేత యోగం....

పురుషుల విభాగంలో తొలిసారి 2007లో ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను నిర్వహిస్తే..మహిళల విభాగంలో తొలిసారిగా 2009లో తొలి టీ-20 ప్రపంచకప్ ను నిర్వహించారు.

తొలి ప్రపంచకప్ లో ఇంగ్లండ్‌ విజేతగా నిలిస్తే.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు (2010, 2012, 2014లో) ఆస్ట్రేలియా తొలి హ్యాట్రిక్ తో కప్పు చేజిక్కించుకొంది.

2016లో భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ సరికొత్త చాంపియన్ గా అవతరించడం ద్వారా కంగారూ ఆధిపత్యానికి గండి కొట్టింది.

ఆ తర్వాత నుంచి ఆస్ట్ర్రేలియా మరోసారి (2018, 2020, 2023లో) వరుసగా మూడు టోర్నీలు నెగ్గి డబుల్‌ హ్యాట్రిక్‌ పూర్తి చేయగలిగింది.

2020 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టు.. ఈసారి సెమీఫైనల్లోనే ఆస్ట్ర్రేలియా చేతిలోనే పరాజయం చవిచూడక తప్పలేదు.

First Published:  27 Feb 2023 4:42 AM GMT
Next Story