Telugu Global
Sports

మహిళా టీ-20 సిరీస్ లో భారత్ కు కంగారూదెబ్బ!

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భారత్ 4-1తో ఓటమి పాలయ్యింది. కంగారూ బౌలర్ హీథర్ గ్రాహం హ్యాట్రిక్ నమోదు చేసింది.

Australia blow to India in womens T-20 series!
X

మహిళా టీ-20 సిరీస్ లో భారత్ కు కంగారూదెబ్బ!

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భారత్ 4-1తో ఓటమి పాలయ్యింది. కంగారూ బౌలర్ హీథర్ గ్రాహం హ్యాట్రిక్ నమోదు చేసింది....

భారత మహిళా క్రికెట్ పరిస్థితి రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి అన్నచందంగా తయారయ్యింది. పురుషులతో సమానంగా అవకాశాలు, ప్రోత్సాహకాలు, సౌకర్యాలు కల్పిస్తున్నా ఎదుగుబొదుగూ లేకుండా పోతోంది.

దక్షిణాఫ్రికా వేదికగా మరికొద్ది మాసాలలో జరుగనున్న 2023 మహిళా టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్ర్రేలియాతో పాంచా పటాకా సిరీస్ లో తలపడిన భారత్ కు 54 పరుగుల భారీఓటమి ఎదురయ్యింది.

మొత్తం ఐదుమ్యాచ్ ల్లో భారత్ నాలుగు పరాజయాలు చవిచూసి..ఒక్క గెలుపుతో పరువు దక్కించుకొంది

గతి తప్పిన భారత బౌలింగ్...

ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన సిరీస్ లోని ఆఖరి టీ-20లో కంగారూజట్టుకు భారత్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్ర్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగుల భారీస్కోరు సాధించింది.

మిడిలార్డర్ బ్యాటర్లు గార్డనర్, గ్రేస్ హారిస్ పవర్ హిట్టింగ్ తో అజేయ హాఫ్ సెంచరీలు బాది..భారత బౌలింగ్ ఎటాక్ ను కకావికలు చేశారు. గార్డ్నర్ 32 బాల్స్ లో 11 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 66, గ్రేస్ హారిస్ 36 బాల్స్ లో 6 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 64 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలిచారు.

భారత బౌలర్లలో అంజలి, షెఫాలీ, దేవకి తలో వికెట్ పడగొట్టారు.

హీథర్ గ్రాహం హ్యాట్రిక్...

197 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్..20 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. వైస్ కెప్టెన్ మంధానా 4, షెఫాలీ వర్మ 13, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 12 పరుగులకే వెనుదిరిగారు. ఆల్ రౌండర్ దీప్తి శర్మ 34 బాల్స్ లో 53 పరుగులు సాధించడంతో భారత్ 142 పరుగుల స్కోరు సాధించగలిగింది.

కంగారూ బౌలర్ హీథర్ గ్రాహం భారత బ్యాటర్లు దేవికా వైద్య, రాథా యాదవ్, రేణుకా సింగ్ లను వరుస బంతుల్లో అవుట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించింది. తన ఆఖరి ఓవర్లో దీప్తి శర్మను సైతం పెవీలియన్ దారి పట్టించింది.

హీథర్ గ్రాహం కేవలం 2 ఓవర్లలోనే 8 పరుగులిచ్చి హ్యాట్రిక్ తో సహా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అంతేకాదు..ఆస్ట్ర్రేలియా మహిళా టీ-20 చరిత్రలోనే హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్ గా రికార్డుల్లో చోటు సంపాదించింది.

2018లో మేగాన్ షుట్ ఆస్ట్ర్రేలియా తరపున తొలి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లకు హీథర్ గ్రాహం రెండో హ్యాట్రిక్ నమోదు చేయగలిగింది.

స్వదేశీ సిరీస్ లో సైతం భారత్ ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోడం అభిమానులను నిరాశకు గురి చేసింది.

First Published:  21 Dec 2022 6:03 AM GMT
Next Story