Telugu Global
Sports

పాకిస్థాన్ పై భారత్ విజయంతో సెమీస్ లో భారత్!

ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ విజేత భారత్ హాంగ్జు ఆసియాక్రీడల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై అతిపెద్ద విజయంతో సెమీస్ లో చోటు ఖాయం చేసుకొంది.

పాకిస్థాన్ పై భారత్ విజయంతో సెమీస్ లో భారత్!
X

ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ విజేత భారత్ హాంగ్జు ఆసియాక్రీడల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై అతిపెద్ద విజయంతో సెమీస్ లో చోటు ఖాయం చేసుకొంది.

ఆసియాక్రీడల పురుషుల హాకీ గ్రూప్ లీగ్ లో ప్రపంచ 3వ ర్యాంకర్ భారత్ భారీవిజయాల జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. తొలిదశ గ్రూపు లీగ్ తొలిమ్యాచ్ లో ఉజ్బెకిస్థాన్ ను 16-0తోనూ, రెండోమ్యాచ్ లో సింగపూర్ ను 16-1తోనూ చిత్తు చేసిన భారత్ మూడోరౌండ్ పోరులో గత ఆసియాక్రీడల గోల్డ్ మెడలిస్ట్ జపాన్ పై 4-2తో విజయాల హ్యాట్రిక్ ను పూర్తి చేసింది.

సెమీస్ చేరాలంటే నెగ్గితీరాల్సిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో ప్రపంచ మాజీ చాంపియన్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను సైతం భారతజట్టు భారీవిజయంతో కంగు తినిపించింది.

ఏకపక్షంగా సాగిన పోరు......

భారత్- పాకిస్థాన్ జట్ల హాకీ పోరు అంటే నువ్వానేనా అన్నట్లుగా మ్యాచ్ లు జరిగే రోజులు పోయాయి. ఆసియాలోని అత్యుత్తమజట్లలో ఒకటిగా పేరుపొందిన పాకిస్థాన్ ఈమధ్యకాలంలో దారుణంగా దిగజారిపోయింది. నాసిరకం జట్లతో పాతాళానికి పడిపోయింది.

భారత్ తో జరిగిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో భారత్ కు పాక్ జట్టు ఏమాత్రం సరిజోడీ కాలేకపోయింది. భారతజట్టు 10-2 గోల్స్ తేడాతో పాకిస్థాన్ ను ఊదిపారేసింది. పాకిస్థాన్ ప్రత్యర్థిగా భారత్ కు ఇదే అతిపెద్ద విజయంగా నమోదయ్యింది.

హార్మన్ ప్రీత్ వరుసగా నాలుగు గోల్స్...

భారత కెప్టెన్, డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ వరుసగా నాలుగు గోల్స్ సాధించడం ద్వారా పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. హర్మన్ ప్రీత్ ఆట 11, 17, 33, 34 నిముషాలలో గోల్స్ సాధిస్తే.. మాజీ కెప్టెన్ మన్ దీప్ సింగ్ ఆట 8వ నిముషంలోనూ, సుమిత్ 30వ నిముషంలోనూ, షంషేర్ సింగ్ 46వ నిముషంలోనూ, లలిత్ కుమార్ 49వ నిముషంలోనూ తలో గోలు నమోదు చేశారు.

పాక్ తరపున 38వ నిముషంలో మహ్మద్ ఖాన్, 45వ నిముషంలో అబ్దుల్ రాణా చెరో గోలు సాధించారు.

2017లో పాకిస్థాన్ పై భారత్ సాధించిన 7-1 గోల్స్ విజయమే ఇప్పటి వరకూ అతిపెద్ద విజయంగా ఉంటూ వచ్చింది. ఆ రికార్డును భారత్ 10-2 విజయంతో..8 గోల్స్ తేడాతో అధిగమించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

రెండుజట్ల నడుమ 180వ మ్యాచ్...

హాకీ చరిత్రలో భారత్- పాక్ జట్ల నడుమ జరిగిన 180వ మ్యాచ్ గా ఇది నమోదయ్యింది. 1982 ఆసియాక్రీడల ఫైనల్లో పాకిస్థాన్ 7-1 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా

అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తే..2017లో భారత్ 7-1 తేడాతో నెగ్గడం ద్వారా దెబ్బకు దెబ్బతీసింది.

గత 41 సంవత్సరాల కాలంలో భారత్ చేతిలో పాకిస్థాన్ 2-10 తేడాతో ఓటమి పొందటం ఇదే మొదటిసారి. పూల్ -ఏ లీగ్ మొదటి నాలుగురౌండ్ల పోటీలలో విజయాలు సాధించడం ద్వారా భారత్ 12 పాయింట్లతో సెమీస్ లో చోటు ఖాయం చేసుకొంది.

లీగ్ ఆఖరి రౌండ్లో భాగంగా సోమవారం జరిగే పోటీలో బంగ్లాదేశ్ తో భారత్ పోటీపడనుంది. బంగ్లాపైన సైతం భారత్ 10 గోల్స్ తేడాతో భారీవిజయం సాధించినా ఆశ్చర్యం లేదు.

First Published:  1 Oct 2023 12:11 PM GMT
Next Story