Telugu Global
Sports

మూడు స్వర్ణాలు తెచ్చినా గుర్తింపు లేని ఆంధ్ర ఆర్చర్ ?

హాంగ్జు ఆసియాక్రీడల్లో భారత్ రికార్డుస్థాయిలో బంగారు పతకాలు సాధించడంలో విజయవాడ కమ్ ఆంధ్ర ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం మూడు స్వర్ణాలతో తనవంతు పాత్ర పోషించినా ఆదరణ, ప్రోత్సాహం అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.

మూడు స్వర్ణాలు తెచ్చినా గుర్తింపు లేని ఆంధ్ర ఆర్చర్ ?
X

హాంగ్జు ఆసియాక్రీడల్లో భారత్ రికార్డుస్థాయిలో బంగారు పతకాలు సాధించడంలో విజయవాడ కమ్ ఆంధ్ర ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం మూడు స్వర్ణాలతో తనవంతు పాత్ర పోషించినా ఆదరణ, ప్రోత్సాహం అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి....

19వ ఆసియాక్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను పంజాబ్, ఒడిషా రాష్ట్ర్రాలు ఆకాశానికి ఎత్తేసి కోట్ల రూపాయలు నజరానాగా కుమ్మరిస్తుంటే...తెలుగు రాష్ట్ర్రాలలో మాత్రం ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం అభినందన సందేశాలతో ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మమ అనిపించారు.

పాపం! జ్యోతి సురేఖ....

దేశానికి ప్రపంచస్థాయిలో మాత్రమే కాదు..కొద్దిగంటల క్రితమే చైనాలోని హాంగ్జు నగరంలో ముగిసి ఆసియాక్రీడల్లో ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా మూడు బంగారు పతకాలు సాధించినా ..విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం తల్లిదండ్రుల్ని పలుకరించి,అభినందించే నాధుడే కరువయ్యాడు.

27 సంవత్సరాల జ్యోతి సురేఖ ..విలువిద్య కాంపౌండ్ టీమ్, మిక్సిడ్, వ్యక్తిగత విభాగాలలో బంగారు పతకాలు సాధించడం ద్వారా దేశానికే మాత్రమే కాదు...ఆంధ్రప్రదేశ్ కు, రెండు తెలుగు రాష్ట్ర్రాలకు ఎనలేని గుర్తింపు తెచ్చింది. భారత్ సాధించిన మొత్తం 28 స్వర్ణాలలో జ్యోతి సాధించినవే 3 పతకాలు ఉన్నాయి.

అయితే..విజయవాడ శివారులోని తాడేపల్లిలో నివాసం ఉంటున్న జ్యోతి సురేఖ తల్లిదండ్రుల్ని ఇటు మీడియా ప్రతినిధులు కానీ..అటు క్రీడాసంఘాల అధికారులు కానీ పలుకరించిన పాపాన పోలేదు.

జ్యోతి సురేఖ తండ్రి మాత్రం తన కుమార్తె సాధించిన విజయాలకు కృతజ్ఞతగా తమ నివాసానికి సమీపంలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి వచ్చారు. గత కొద్ది సంవత్సరాలుగా తమ కుటుంబం చేసిన , చేస్తూ వచ్చిన త్యాగాలకు తగిన ఫలం ఇప్పుడు దక్కిందని, అయితే..మిగిలిన క్రీడాకారులకు ఇచ్చిన ప్రాధాన్యం తన కుమార్తెకు లభించకపోడం దురదృష్టకరమని జ్యోతి సురేఖ్ తండ్రి సురేంద్ర వాపోతున్నారు.

ఆస్తులు ఆమ్మి ఆర్చరీ...

జ్యోతి సురేఖ్ ను అంతర్జాతీయ ఆర్చర్ గా తీర్చి దిద్దడం కోసం తనకుటుంబం అతిపెద్ద త్యాగమే చేసిందని, ఆస్తులు తెగనమ్ముకొని మరీ అండగా నిలిచామని గుర్తు చేసుకొన్నారు.

గత ఏడాది వరకూ తమకు సొంత ఇల్లు లేదని, ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్న తమ కుమార్తె 70 లక్షల లోను తీసుకొంటే గానీ సొంత ఫ్లాట్ ను సమకూర్చుకోలేకపోయామని చెప్పుకొచ్చారు.

నాన్- ఒలింపిక్ అంశం కావడమే శాపమా?

విలువిద్య క్రీడలో రికర్వ్, కాంపౌండ్ అన్న రెండు విభాగాలున్నాయి. అయితే..కాంపౌండ్ తరగతి ఆర్చరీ ఒలింపిక్స్ అధికారిక క్రీడాంశాలలో లేకపోడం జ్యోతి సురేఖ పాలిట శాపంగా మారిందని క్రీడావిశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ స్థాయిలోనే పతకాలు సాధించే అవకాశం ఉంది. ఒలింపిక్స్ లో మాత్రం కాంపౌండ్ ఆర్చరీ ఓ ప్రధాన అంశం కాకపోడంతో ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోడం లేదన్న విమర్శ సైతం ఉంది.

అంతర్జాతీయస్థాయిలో 30 స్వర్ణాలు...

జ్యోతి సురేఖ గత దశాబ్దకాలంలో అంతర్జాతీయ, ప్రపంచ, ఆసియా, కామన్వెల్త్ విభాగాల విలువిద్య కాంపౌండ్ విభాగంలో 30కి పైగా బంగారు పతకాలు సాధించింది.

అయినా..తన కుమార్తెకు తగిన ప్రోత్సాహం లేదంటూ జ్యోతి సురేఖ తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

పురుషుల జావలిన్ త్రో విభాగంలో రజత పతకం సాధించిన కిశోర్ కుమార్ జెనాకు ఒడిషా ముఖ్యమంత్రి నీవన్ పట్నాయిక్ కోటీ 50 లక్షల రూపాయలు నజరానాగా ప్రకటించారు. హాకీలో బంగారు పతకం సాధించిన ఒక్కో ఆటగాడికి 5 లక్షల రూపాయలు చొప్పున అందించారు.

అదే..తెలంగాణా షూటర్ ఈషా సింగ్, ఆంధ్ర ఆర్చర్ జ్యోతి సురేఖలు మాత్రం...ఏమాత్రం ఖర్చులేని, ప్రచారానికి మాత్రమే ఉపయోగపడే అభినందన సందేశాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.

First Published:  8 Oct 2023 1:30 PM GMT
Next Story