Telugu Global
Sports

భారత్ కు 41 సంవత్సరాల తర్వాత అశ్వక్రీడల స్వర్ణం!

19వ ఆసియా క్రీడల అశ్వక్రీడల్లో భారత్ బంగారు పతకం గెలుచుకొని నాలుగు దశాబ్దాల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకొంది. 209.205 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది...

భారత్ కు 41 సంవత్సరాల తర్వాత అశ్వక్రీడల స్వర్ణం!
X

19వ ఆసియా క్రీడల అశ్వక్రీడల్లో భారత్ బంగారు పతకం గెలుచుకొని నాలుగు దశాబ్దాల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకొంది. 209.205 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది...

హాంగ్జు వేదికగా జరుగుతున్న 2022-ఆసియాక్రీడల్లో భారత్ కు అనుకోని స్వర్ణం దక్కింది. అశ్వక్రీడల్లో బంగారు పతకం సాధించాలని గత నాలుగు దశాబ్దాలుగా కంటున్న కల ఎట్టకేలకు ఫలించింది.


1982 తర్వాత ఇదే అశ్వక్రీడల స్వర్ణం....

భారత అశ్వక్రీడల జట్టు 1982 న్యూఢిల్లీ ఆసియాక్రీడల్లో చివరిసారిగా బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత నుంచి మరో స్వర్ణం కోసం గత 41 సంవత్సరాలుగా ఎదురుచూస్తూ వస్తోంది.

జపాన్, కొరియా, చైనా లాంటి జట్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా...అన్షు అగర్వాల్, హృదయ్ విపుల్, దివ్యాకృతి, సుదీప్తి హజేలాలతో కూడిన భారతజట్టు...టీమ్ డ్రెసాజ్ విభాగంలో స్వర్ణ పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

అశ్వమూ, దానిని అధిరోహించే రౌతు ( క్రీడాకారుడు) కలసి సమన్వయంతో కలసి చేసే పలు రకాల విన్యాసాలతో కూడినదే డ్రెసాజ్. అశారోహకుడు చెప్పినట్లుగా అశ్వం నడుచుకోడం, లయబద్ధంగా విన్యాసాలు చేయటం ఇందులో ప్రధానం.

ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన జట్లు ఈ విభాగంలో పాల్గొని, సాధించిన పాయింట్ల ప్రాతిపదికన విజేతను నిర్ణయిస్తారు.

భారత్ జట్టుకు రికార్డు స్థాయిలో పాయింట్లు..

భారతజట్టు మొత్తం 209.205 పాయింట్లతో తిరుగులేని విజేతగా బంగారు పతకం గెలుచుకొంది. 10 గంటలపాటు సాగిన ఈ పోటీలో భారతజట్టులోని నలుగురు క్రీడాకారులు అద్భుత విన్యాసాలతో ఆకట్టుకొన్నారు.

ఎట్రో అనే అశ్వంతో పోటీలో పాల్గొన్న అన్షు అగర్వాల్ అత్యధికంగా 71.088 పాయింట్లు సాధించింది. ఎమిరాల్డ్ అనే అశ్వంతో బరిలో నిలిచిన హృదయ్ 69.941 పాయింట్లు, యాండ్రినెలిన్ అనే అశ్వంతో పాల్గొన్న దివ్యాకృతికి 68.176 పాయింట్లు, చిన్ స్కీ అనే అశ్వంతో పోటీలో నిలిచిన సుదీప్తికి 66.706 పాయింట్లు దక్కాయి.

భారతజట్టు మొత్తం 209.205 పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత సమీప ప్రత్యర్థి చైనాకు 204. 882 పాయింట్లు మాత్రమే వచ్చాయి.

డ్రెసాజ్ విభాగంలో భారత్ చివరిసారిగా 1986 ఆసియాక్రీడల్లో కాంస్య పతకం సాధించింది. బంగారు పతకాన్ని 1982 ఆసియాక్రీడల్లో గెలుచుకొన్న తర్వాత మరో బంగారు పతకం 41 సంవత్సరాల విరామం తర్వాత చిక్కింది.

సెయిలింగ్ లో మరో రెండు పతకాలు...

ఆసియాక్రీడల మూడోరోజు పోటీలలో భారత్ సెయిలింగ్ లో రెండు పతకాలు సాధించింది. మహిళల డింగీ-ఐఎల్ సీఏ 4 తరగతి విభాగంలో భారత బాలిక నేహా ఠాకూర్ రజత పతకం గెలుచుకొంది.

పురుషుల విండ్ సర్ఫింగ్ విభాగంలో ఇబాద్ అలీ కాంస్య పతకంతో సరిపెట్టుకొన్నాడు. మొదటి మూడురోజుల పోటీలు ముగిసే నాటికి భారత్ మొత్తం 3 స్వర్ణాలతో సహా 14 పతకాలు సంపాదించింది.

First Published:  27 Sep 2023 3:30 AM GMT
Next Story