Telugu Global
Sports

పాక్ చిత్తు, ఆసియా హాకీ సెమీస్ లో భారత్!

ఆసియాక్రీడలకు సన్నాహకంగా జరుగుతున్న 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీస్ కు 4వ ర్యాంక్ భారత్ చేరుకోగా..16వ ర్యాంకర్ పాకిస్థాన్ విఫలమయ్యింది.

పాక్ చిత్తు, ఆసియా హాకీ సెమీస్ లో భారత్!
X

పాక్ చిత్తు, ఆసియా హాకీ సెమీస్ లో భారత్!

ఆసియాక్రీడలకు సన్నాహకంగా జరుగుతున్న 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీస్ కు 4వ ర్యాంక్ భారత్ చేరుకోగా..16వ ర్యాంకర్ పాకిస్థాన్ విఫలమయ్యింది.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ అలవోకగా చేరుకొంది. గ్రూప్ -ఏ లీగ్ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 4-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా లీగ్ దశ నుంచి నాకౌట్ రౌండ్లోకి అడుగుపెట్టగలిగింది.

భారత్ ముందు తేలిపోయిన పాక్...

చెన్నైలోని మేయర్ రాధా కృష్ణన్ స్టేడియం వేదికగా జరుగుతున్న 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ గ్రూప్- ఏ లీగ్ టాపర్ గా ఆతిథ్య భారత్ నిలిచింది. నాలుగు విజయాలు, ఓ డ్రాతో మొత్తం 13 పాయింట్లు సంపాదించడం ద్వారా గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది.

గ్రూప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో చైనాను 7-2తోను, మలేసియాను 5-0తోనూ, కొరియాను 3-1 గోల్స్ తోను చిత్తు చేయడంతో పాటు..జపాన్ తో జరిగిన మ్యాచ్ ను 1-1తో డ్రాగా ముగించడం ద్వారా అజేయంగా నిలిచింది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన గ్రూప్ లీగ్ ఆఖరి రౌండ్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.

జూనియర్ ఆటగాళ్లతోనే పాక్ పోరు...

ఆసియా హాకీ దిగ్గజాలలో ఒకటైన పాకిస్థాన్ గత కొద్దిసంవత్సరాలుగా ప్రపంచహాకీలో దిగజారి..16వ ర్యాంక్ కు పడిపోయింది. ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో సైతం మొత్తం 14 మంది జూనియర్ ఆటగాళ్లతో బరిలోకి దిగింది.

ప్రపంచ 4వ ర్యాంకర్ భారత్ తో జరిగిన పోరులో పాక్ నామమాత్రమైన పోటీనే ఇవ్వగలిగింది. ఆట ప్రారంభంలో పాక్ లభించిన గోల్ ను రిఫరీ తిరస్కరించారు. ఆ తర్వాత నుంచి భారత ఆధిపత్యమే కొనసాగింది.

భారత కెప్టెన్ కమ్ పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్సు, జుగ్ రాజ్ సింగ్, ఆకాశ్ దీప్ సింగ్ చెరో గోలు సాధించారు.

ఆట తొలిక్వార్టర్ లో రెండుజట్లూ హోరాహోరీగా తలపడటంతో ఏ జట్టూ గోలు సాధించలేకపోయింది.

రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే భారత్ కు దక్కిన పెనాల్టీకార్నర్ ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ గోలుగా మలచి బోణీ కొట్టాడు. అదే దూకుడు కొనసాగిస్తూ ఆ తర్వాతి పది నిమిషాల్లోపే దక్కిన మరో షార్ట్ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ గోల్‌ గా మార్చాడు. దీంతో భారత్‌ ఆధిక్యం 2-0కు చేరుకుంది. ఆ తర్వాత నుంచి భారత్‌ వరుస దాడులతో పాక్ రక్షణవలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. మూడో క్వార్టర్‌లో జుగ్‌రాజ్‌సింగ్‌ ..ఆఖర్లో ఆకాశ్‌దీప్‌సింగ్‌ చెరో గోల్‌ చేయడంతో భారత్‌ తిరుగులేని విజయంతో టాపర్ గా నిలిచింది.

హర్మన్‌ప్రీత్‌సింగ్‌(15ని), (23ని) గోల్స్‌ డబుల్ సాధించగా జుగ్‌రాజ్‌ సింగ్‌(36ని), ఆకాశ్‌దీప్‌సింగ్‌(55ని) చెరో గోల్‌ నమోదు చేశారు. భారత్ చేతిలో ఓటమితో పాకిస్థాన్ టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించింది.

సెమీస్ లో జపాన్ తో భారత్ పోరు...

ఆగస్టు 11న జరిగే తొలి సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా, రెండోసెమీఫైనల్లో జపాన్ తో భారత్ తలపడతాయి. గత చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జపాన్ ను ప్రస్తుత టోర్నీ ఫైనల్లో విజేతగా నిలవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.

గ్రూప్ -ఏ లీగ్ మ్యాచ్ లో జపాన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని మ్యాచ్ ను 1-1తో సరిపెట్టుకొన్న భారత్..ఫైనల్స్ చేరాలంటే ముందుగా సెమీస్ లో జపాన్ ను చిత్తుచేయక తప్పదు.

First Published:  10 Aug 2023 10:00 AM GMT
Next Story