Telugu Global
Sports

టాస్ పోయిందా!..మ్యాచ్ గోవిందా!

భారత్ కు దెబ్బ మీద దెబ్బ..ఫైనల్ ఆశలు గల్లంతు!

టాస్ పోయిందా!..మ్యాచ్ గోవిందా!
X

ఏడుసార్లు విజేత భారత్ ఫైనల్ ఆశలు గాల్లో దీపంలా మారాయి. సూపర్ -4 రౌండ్లో వరుసగా రెండో ఓటమితో రోహిత్ సేన తీవ్రనిరాశలో కూరుకుపోయింది.

శ్రీలంక చేతిలో 6 వికెట్ల ఓటమితో కుదేలైపోయింది....

15వ ఆసియాకప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పరిస్థితి ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. తొలిదశ గ్రూప్- ఏ లీగ్ లో వరుస విజయాలతో టాపర్ గా నిలిచిన భారత్..రెండోదశ సూపర్ -4 రౌండ్లో వరుస పరాజయాలతో ఫైనల్ అవకాశాలను గాల్లో దీపంలా మార్చుకొంది.

సూపర్-4 తొలిరౌండ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో 5 వికెట్ల ఓటమి చవిచూసిన భారత్..నెగ్గితీరాల్సిన రెండోరౌండ్ పోరులో సైతం శ్రీలంక చేతిలో 6 వికెట్ల పరాజయంతో..

ఫైనల్ చేరే అవకాశాలను దాదాపుగా దూరం చేసుకొంది.

భారత్ ను ముంచిన టాస్....

ఎమిరేట్స్ క్రికెట్ వేదికల్లో భారత్ కు అచ్చిరాని మైదానం ఏదైనా ఉంటే అదీ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మాత్రమే. ప్రస్తుత ఆసియాకప్ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ ఆడిన నాలుగుమ్యాచ్ ల్లో రెండు పరాజయాలు చవిచూసింది. అంతేకాదు..టాస్ ఓడిన ప్రతిసారీ మ్యాచ్ లు చేజార్చుకొంది.

పాకిస్థాన్ తో జరిగిన సూపర్ -4 తొలిరౌండ్లో టాస్ ఓడిన భారత్ కు 5 వికెట్లతో ఓటమి తప్పలేదు. చివరకు శ్రీలంకతో ముగిసిన రెండోరౌండ్ పోరులో సైతం భారత టాస్ ఓడి మ్యాచ్ ను పోగొట్టుకోక తప్పలేదు.

ఆదుకొన్న రోహిత్- సూర్య..

ఈ కీలక పోరులో శ్రీలంక కెప్టెన్ సునక ముందుగా కీలక టాస్ నెగ్గి..ఫీల్డింగ్ ఎంచుకోడంతో భారత్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. ప్రారంభఓవర్లలోనే ఓపెనర్ రాహుల్, వన్ డౌన్ విరాట్ కొహ్లీల వికెట్లు నష్టపోయిన భారత్ పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

అయితే...కెప్టెన్ రోహిత్, రెండోడౌన్ సూర్య కలసి మూడో వికెట్ కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. భారత సారథి రోహిత్ శర్మ మరోసారి తన బ్యాట్ పవర్ ఏంటో శ్రీలంక బౌలర్లకు రుచిచూపించాడు.

రోహిత్ కేవలం 41 బాల్స్ లోనే 4 సిక్సర్లు, 5 బౌండ్రీలతో 72 పరుగుల స్కోరుతో చెలరేగిపోయాడు. పుల్, లాఫ్టెడ్, స్వీప్ షాట్లతో ప్రత్యర్థిబౌలర్లపై విరుచుకు పడ్డాడు.

హిట్ మాన్ రికార్డుల మోత.....

రోహిత్ శర్మ 72 పరుగుల స్కోరు సాధించడం ద్వారా మరో మూడు సరికొత్త రికార్డులు నమోదు చేయగలిగాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్, షాహీద్ ఆఫ్రిదీల పేరుతో ఉన్న ఆసియాకప్ రికార్డులను రోహిత్ తెరమరుగు చేశాడు.

టీ-20ల్లో తన 32వ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా..విరాట్ కొహ్లీ సరసన నిలిచిన రోహిత్...ఆసియాకప్ లో అత్యధిక సిక్సర్లు, వెయ్యికి పైగా పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

శ్రీలంకతో పోరు వరకూ మొత్తం 31 ఆసియాకప్ మ్యాచ్ లు ఆడిన రోహిత్ 29 సిక్సర్లు బాదాడు. ఆఫ్రిదీ పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు.

ఆఫ్రిదీ 26 సిక్సర్లతో రెండు, సురేశ్ రైనా 18 సిక్సర్లతో మూడు స్థానాలలో కొనసాగుతున్నారు.

అంతేకాదు..ఆసియాకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా సచిన్ పేరుతో ఉన్న 970 పరుగుల రికార్డును రోహిత్ ( 1016 పరుగులు ) తెరమరుగు చేశాడు. ఆసియాకప్ టోర్నీలో వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా రోహిత్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.

ఆసియాకప్ లో అత్యధిక పరుగులు సాధించిన మొనగాళ్ల వరుసలో సనత్ జయసూర్య ( 1220 పరుగులు ), కుమార సంగక్కర ( 1075 ) ఉన్నారు.

ఆసియాకప్ లో అత్యధికంగా 9 హాఫ్ సెంచరీలు సాధించిన ఇద్దరు భారత క్రికెటర్లలో సచిన్ సరసన రోహిత్ నిలిచాడు. కుమార సంగక్కర మాత్రమే 12 అర్థశతకాలతో ఆసియాకప్ రికార్డు నమోదు చేశాడు.

తగ్గి ఆడిన సూర్యకుమార్...

360 డిగ్రీల హిట్టర్ గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్...తన ఆటతీరును పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని, తన సహజశైలికి విరుద్ధంగా తగ్గి మరీ ఆడాడు.

తన కెప్టెన్ కు తోడుగా నిలవడం ద్వారా 29 బాల్స్ లో 34 పరుగులు సాధించి అవుటయ్యాడు. ఒకదశలో 3 వికెట్లకు 110 పరుగుల స్కోరుతో అత్యంత పటిష్టమైన స్థితిలో ఉన్న భారత్..కెప్టెన్ రోహిత్ అవుటైన తరువాత...చివరి 7 ఓవర్లలో స్కోరుకు 63 పరుగులు మాత్రమే జోడించగలిగింది.

శ్రీలంక బౌలర్లు చక్కటి బౌలింగ్ తో భారత్ భారీస్కోరుకు పగ్గాలు వేయగలిగారు. యువపేసర్ మధుశంక 24 పరుగులిచ్చి 3 వికెట్లు, కరుణరత్న 2 వికెట్లు, షనక 2 వికెట్లు పడగొట్టారు.

శ్రీలంక ఓపెనర్ల టాప్ గేర్...

174 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన శ్రీలంకకు ఓపెనింగ్ జోడీ నిస్సంక ( 37 బాల్స్ లో 52 పరుగులు ), కుశల్ మెండిస్ ( 37 బాల్స్ లో 57 పరుగులతో ) కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. 11.1 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న జట్టుకు దుబాయ్ పిచ్ అనుకూలంగా మారుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది. బౌలర్లకు ఏమాత్రం అనువుకాని ఈ పిచ్ పై తొలి వికెట్ పడగొట్టడానికి భారత బౌలర్లు నానాపాట్లు పడాల్సి వచ్చింది.

లెగ్ స్పిన్నర్ చహాల్ 3 వికెట్లు, అశ్విన్ 1 వికెట్ పడగొట్టడంతో...శ్రీలంక విజయం కోసం ఆఖరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆట 19వ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ 14 పరుగులు ఇవ్వడంతో శ్రీలంక విజయం ఖాయమైపోయింది.

కెప్టెన్ షనక 33, రాజపక్స 25 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో 19.5 ఓవర్లలోనే శ్రీలంక 4 వికెట్ల విజయంతో ఫైనల్లో చోటు ఖాయం చేసుకోగలిగింది.

శ్రీలంక విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆల్ రౌండర్ కమ్ కెప్టెన్ షనకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

చేజింగ్ జట్లకే విజయాలు..

దుబాయ్ వేదికగా జరిగిన గత నాలుగు మ్యాచ్ ల్లో సగటున 170 స్కోర్లు మాత్రమే నమోదయ్యాయి. చేజింగ్ కు దిగిన జట్లే విజేతగా నిలుస్తూ వస్తోంది. టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం ద్వారా చేజింగ్ కు దిగడం, మ్యాచ్ విన్నర్ గా నిలవడం జరిగిపోతున్నాయి. అంతేకాదు..శ్రీలంకజట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగిన గత ఏడుమ్యాచ్ ల్లోనూ పరాజయాలు చవిచూసింది. చేజింగ్ కు దిగిన గత ఐదుకు ఐదుమ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గత 28 టీ-20 మ్యాచ్ ల్లో చేజింగ్ కు దిగిన జట్లే 25సార్లు విజయాన్ని అందుకోగలిగాయి.

ఇక శ్రీలంక ప్రత్యర్థిగా భారత్ ఆడిన మొత్తం 26 టీ-20 మ్యాచ్ ల్లో 17 విజయాలు, 8 పరాజయాల రికార్డుతో ఉంది.

పాక్ ఓడితేనే భారత్ కు చాన్స్...

భారతజట్టు ఫైనల్ అవకాశాలు ఆఫ్గనిస్థాన్ దయాదాక్షిణ్యాల పైన ఆధారపడి ఉన్నాయి. సూపర్ -4 రౌండ్ పోరులో పాకిస్థాన్ పై ఆప్ఘనిస్థాన్ ముందుగా నెగ్గి తీరాలి. ఆ తర్వాత ఆప్ఘన్ తో జరిగే పోరులో భారత్ భారీ తేడాతో విజేతగా నిలిస్తేనే ఫైనల్స్ చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఆప్ఘనిస్థాన్ ను పాక్ అధిగమించగలిగితే..ఫైనల్ రేస్ నుంచి భారత్ తప్పుకోక తప్పదు.

First Published:  7 Sep 2022 3:50 AM GMT
Next Story