Telugu Global
Sports

'రిజర్వ్ డే' తో రేపే భారత్- పాక్ పోరు!

ఆసియాకప్ సూపర్-4 రౌండ్లో భారత్- పాకిస్థాన్ జట్ల మ్యాచ్ ను 'రిజర్వ్ డే' నిబంధనతో నిర్వహించాలని ఆసియా క్రికెట్ మండలి నిర్ణయించింది.

రిజర్వ్ డే తో రేపే భారత్- పాక్ పోరు!
X

'రిజర్వ్ డే' తో రేపే భారత్- పాక్ పోరు!

ఆసియాకప్ సూపర్-4 రౌండ్లో భారత్- పాకిస్థాన్ జట్ల మ్యాచ్ ను 'రిజర్వ్ డే' నిబంధనతో నిర్వహించాలని ఆసియా క్రికెట్ మండలి నిర్ణయించింది.

శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ మ్యాచ్ లకు వానదెబ్బ తగలకుండా నిర్వాహక సంఘం కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

ఎట్టిపరిస్థితిలోనూ మ్యాచ్ లను నిర్వహించితీరాలని ఆసియాక్రికెట్ మండలి భావిస్తోంది.

పల్లెకెలీ కాదు..కొలంబో...

ప్రస్తుత 2023 ఆసియాకప్ ను గతంలో ఎన్నడూ లేని విధంగా హైబ్రిడ్ మోడల్ ( రెండుదేశాల సంయుక్త ఆతిథ్యం) తో నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్, శ్రీలంకబోర్డులు కలసి మొత్తం 13 మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్నాయి.

పాకిస్థాన్ లోని లాహోర్, శ్రీలంకలోని పల్లెకెలీ, కొలంబో వేదికలుగా మొత్తం టోర్నీని నిర్వహించడానికి రంగం సిద్థం చేశారు. అయితే...క్యాండీ సమీపంలోని పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్ ఆడిన రెండుకు రెండుమ్యాచ్ లకూ వానదెబ్బ తగిలింది.

గ్రూప్ -ఏ లీగ్ లో భారత్- పాక్ జట్ల మ్యాచ్ వానదెబ్బతో కేవలం భారత బ్యాటింగ్, పాక్ బౌలింగ్ కు మాత్రేమే పరిమితమయ్యింది. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూసిన రెండు దేశాల అభిమానులకు గ్రూప్‌ స్థాయిలోనే నిరాశే ఎదురైంది. ఇరుజట్ల మధ్య జరగాల్సిన గ్రూప్‌ స్థాయి మ్యాచ్‌ వర్షార్పణం అయ్యింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత వర్షం రావడంతో పాకిస్తాన్‌ జట్టు ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే మ్యాచ్‌ రద్దయ్యింది.

పాకిస్థాన్ బ్యాటింగ్ కు దిగకుండానే కుండపోత వర్షంతో మ్యాచ్ రద్దులపద్దులో చేరిపోడంతో..రెండుజట్లు చెరో పాయింట్ పంచుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత భారత్- నేపాల్ జట్ల జరిగిన రెండో లీగ్ మ్యాచ్ ను సైతం వెంటాడటంతో ఓవర్లు కుదించి మరీ ముగించారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని..వర్షం ప్రభావం తక్కువగా ఉండే కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా సూపర్-4 రౌండ్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.

సూపర్ సండే సమరానికి కౌంట్ డౌన్...

సూపర్-4 రౌండ్లలో భాగంగా ఆదివారం కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే కీలక పోరులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ టీమ్ పాకిస్థాన్, 3వ ర్యాంకర్ భారత్ తలపడనున్నాయి.

ఒకవేళ ఈమ్యాచ్ వానదెబ్బతో ఆదివారం జరుగకపోతే..రిజర్వ్ డేగా ప్రకటించిన సోమవారం నిర్వహించనున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వానకారణంగా మ్యాచ్ లు రద్దుకారాదని నిర్వాహక ఆసియాక్రికెట్ మండలి భావిస్తోంది.

కొలంబో అంచె సూపర్ -4 రౌండ్ మ్యాచ్ ల్లో భాగంగా సెప్టెంబర్ 9న శ్రీలంకతో బంగ్లాదేశ్ పోటీపడనుంది. సెప్టెంబర్ 10 న జరిగే సూపర్ సండే పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

భారత్- శ్రీలంక, భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ లు సైతం కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగానే జరుగనున్నాయి. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ కు సైతం కొలంబో నగరమే వేదిక కానుంది.

9 తర్వాత నుంచి తగ్గనున్న వానలు...

సెప్టెంబర్ 9 తర్వాత నుంచి కొలంబో నగరంలో వానలు తక్కువగా పడతాయని శ్రీలంక వాతావరణశాఖ అధికారి అతుల కరుణానాయకే ప్రకటించారు. క్రికెట్ కు వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుందని, వానబెడద తక్కువేనని తేల్చి చెప్పారు.

వచ్చేవారం శ్రీలంక పశ్చిమ ప్రాంతానికి వానముప్పు ఉన్నా..సెప్టెంబర్ 17న జరిగే ఆసియాకప్ టైటిల్ పోరుకు ఏవిధమైన ముప్పు ఉండే ప్రసక్తేలేదని తెలిపారు.

సూపర్-4 రౌండ్లో ఒక్కోజట్టు మూడేసి మ్యాచ్ లు ఆడనుంది. అత్యధిక విజయాలతో మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి.

First Published:  9 Sep 2023 4:53 AM GMT
Next Story