Telugu Global
Sports

రచ్చ వద్దు..ఇష్టంలేకపోతే మ్యాచ్ లు చూడకండి- గవాస్కర్

2023 ఆసియాకప్ క్రికెట్ చాంపియన్షిప్ లో పాల్గొనే 17 మంది సభ్యుల భారతజట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు చెలరేగాయి. అయితే..జట్టు ఎంపిక పై రచ్చ చేయవద్దని, ఇష్టం లేకుంటే మ్యాచ్ లు చూడవద్దంటూ సునీల్ గవాస్కర్ విమర్శకులకు సలహా ఇచ్చారు.

రచ్చ వద్దు..ఇష్టంలేకపోతే మ్యాచ్ లు చూడకండి- గవాస్కర్
X

రచ్చ వద్దు..ఇష్టంలేకపోతే మ్యాచ్ లు చూడకండి- గవాస్కర్

2023 ఆసియాకప్ క్రికెట్ చాంపియన్షిప్ లో పాల్గొనే 17 మంది సభ్యుల భారతజట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు చెలరేగాయి. అయితే..జట్టు ఎంపిక పై రచ్చ చేయవద్దని, ఇష్టం లేకుంటే మ్యాచ్ లు చూడవద్దంటూ సునీల్ గవాస్కర్ విమర్శకులకు సలహా ఇచ్చారు...

ఆసియా, ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలకు భారతజట్లను ఎంపిక చేసిన సమయంలో కొందరిలో అసంతృప్తి ఉన్నా, బాహాటంగా విమర్శలు చేయటం తక్కువగానే ఉంటుంది.

అయితే..శ్రీలంక, పాకిస్థాన్ దేశాల సంయుక్త ఆతిథ్యంలో ఆగస్టు 30 నుంచి జరుగనున్న ఆసియాకప్ క్రికెట్ టోర్నీకి 17 మంది సభ్యులజట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించడంతోనే చర్చకు తెరలేచింది.గతంలో ఎన్నడూ లేనంతగా విమర్శలు వెల్లువెత్తాయి.

చహాల్ భార్య గరంగరం...

భారతజట్టులో తన భర్తకు చోటు దక్కకపోడంతో లెగ్ స్పిన్ జాదూ యజువేంద్ర చహాల్ భార్య ధనశ్రీ సోషల్ మీడియా ద్వారా విమర్శల బాణాలు వేసింది. భారత బౌలింగ్ కు వెన్నెముక లాంటి యజువేంద్ర చహాల్ ను పక్కనపెట్టడంలో ఔచిత్యమేమిటంటూ నిలదీసింది.

మరోవైపు..వెటరన్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ను సైతం విస్మరించడం, స్పిన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లకు మాత్రమే ప్రాధాన్యమివ్వడం పైన కూడా పలువురు విశ్లేషకులు, వ్యాఖ్యాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారతజట్టుకు వన్డే, టీ-20 ఫార్మాట్లలో కేవలం తన బౌలింగ్ నైపుణ్యంతోనే పలు చిరస్మరణీయ విజయాలు అందించిన చహాల్ ను విదేశీ సిరీస్ లకు, ప్రపంచకప్ కు ఎంపిక చేసినా తుదిజట్టులోకి తీసుకోకుండా బెంచ్ కే పరిమితం చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

2021 టీ-20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన చహాల్ ను డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం చేయడంతో భారత్ సెమీస్ దశలోనే విఫలమయ్యిందంటూ విమర్శించేవారూ లేకపోలేదు.

నలుగురి రాకతోనే ఈ గందరగోళం....

గాయాలతో గత కొద్దిమాసాలుగా జట్టుకు దూరమైన పేస్ బౌలింగ్ జోడీ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకొని ఫిట్ నెస్ తో అందుబాటులోకి రావడంతో జట్టు ఎంపికలో భారీగా మార్పులు చోటు చేసుకొన్నాయి. దానికితోడు స్పెషలిస్ట్ బౌలర్ల కంటే కాస్తో కూస్తో బ్యాటింగ్ చేయగల స్పెషలిస్ట్ స్పిన్ ఆల్ రౌండర్లకే ఎంపిక సంఘం అధికప్రాధాన్యమిచ్చింది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల కోసం అపారఅనుభవం కలిగిన స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ లను పక్కన పెట్టింది.

బ్యాటింగ్ లేమితో చహాల్ అవుట్...

బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సత్తా ఉన్న ఆల్ రౌండ్ క్రికెటర్ల వైపే మొగ్గుచూపే విధానాన్ని చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పాటిస్తున్నారు. బౌలింగ్ లో అసాధారణ ప్రతిభ కలిగిన చహాల్ బ్యాటింగ్ లో మాత్రం నామమాత్రం కావడంతో..బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాణించే సత్తా కలిగిన కుల్దీప్ యాదవ్ వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గుచూపింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ అపారప్రతిభ కలిగిన అశ్విన్ విషయంలో మాత్రం చురుకైన ఫీల్డర్ కాక పోడం శాపంగా మారింది.

కుల్దీప్ తో పోల్చిచూస్తే బ్యాటింగ్ లో చహాల్ బలహీనంగా ఉన్నాడని, సెలెక్టర్లు అదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పక్కనపెట్టి ఉండవచ్చునని క్రికెట్ విశ్లేషకుడు, విమర్శకుడు గవాస్కర్ అంటున్నారు.

జట్టు ఎంపికపై వివాదం వద్దు....

భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాకంగా జరుగనున్న ఆసియాకప్ కు భారతజట్టును ప్రకటించిన అనంతర పరిణామాల పట్ల భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్, క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

జట్టు ఎంపికలో ఎలాంటి లోపాలు లేవని, జట్టు అవసరాలు, ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగానే జట్టును ఎంపిక చేశారని కితాబిచ్చారు. భారతజట్టులో కేవలం 15 మందికి మాత్రమే చోటు ఉంటుందని, ఎంపికకాని వారిలో బాధ, అసంతృప్తి ఉండటం సహజమేనని, ఇది ఆటలో ఓ భాగమేనని గవాస్కర్ గుర్తు చేశారు. గాయాల నుంచి కోలుకొని నలుగురు ప్రధాన ఆటగాళ్లు తిరిగి అందుబాటులోకి రావడంతోనే ఈ గందరగోళమని తేల్చి చెప్పారు.

భారతజట్టు ఆసియాకప్ తో పాటు ప్రపంచ విజేతగా నిలవడం ముఖ్యమని, జట్టులో చోటు దొరకడం ప్రధానంకాదని అన్నారు. చహాల్, అశ్విన్ లను పక్కనపెట్టడం గురించి అనవసర వివాదాలకు, చర్చలకు తెరతీయవద్దని గవాస్కర్ సూచించారు.

దూకుడుగా ఆడే బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా బహుముఖ ప్రతిభకలిగిన సంజు శాంసన్ ను స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసి జట్టుతోనే కొనసాగించడం మంచినిర్ణయమని అన్నారు.

సంజు శాంసన్ వయసు 29 సంవత్సరాలు మాత్రమేనని, రానున్నకాలంలో స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొనటం ఏమంత కష్టంకాబోదని అభిప్రాయపడ్డారు.

భారత క్రికెట్ ప్రయోజనాలే ప్రధానం...

ఆసియాకప్ కు భారతజట్టు ఎంపిక జరిగిపోయిందని, దానిపై ఇప్పుడు అనవసరపు చర్చ, రచ్ఛ వద్దని, ఇష్టం లేకుంటే మ్యాచ్ లు చూడకుండా ఉండిపోండంటూ గవాస్కర్ విమర్శకులను కోరారు. సానుకూల దృక్పథంతో ఆలోచించాలని, నెగిటివ్ మెండ్ సెట్ వద్దే వద్దని సలహా ఇచ్చారు.

ఆసియాకప్ కు అత్యుత్తమమైన జట్టునే ఎంపిక చేశారంటూ సెలెక్టర్లకు కితాబిచ్చారు. ఆసియాకప్ లో భారత్ ఆగస్టు 31న జరిగే తన ప్రారంభమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి

పాకిస్థాన్ తో తలపడనుంది.

First Published:  23 Aug 2023 10:58 AM GMT
Next Story