Telugu Global
Sports

పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్.. హైబ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్

ఆసియా కప్ 2023లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి.

పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్.. హైబ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్
X

ఆసియా కప్ నిర్వహణ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తన పంతం నెగ్గించుకున్నది. ఆసియా కప్ కోసం తమ జట్టును పాకిస్తాన్ పంపబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, ఆసియా కప్ మొత్తాన్ని పాకిస్తాన్ నుంచి తరలించలేమని.. కనీసం హైబ్రీడ్ మోడల్‌లో అయినా టోర్నీని నిర్వహించాలని పీసీబీ పట్టబట్టింది. అయితే బీసీసీఐ మాత్రం అలా ఏమీ కుదరదంటూ చెప్పింది. దీంతో ఒకానొక దశలో వన్డే వరల్డ్ కప్‌కు తమ జట్టు ఇండియాకు పంపమని కూడా పీసీబీ పెద్దలు వ్యాఖ్యానించారు.

తాజాగా ఈ వివాదానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడల్‌లో పాకిస్తాన్, శ్రీలంకలో నిర్వహిస్తామని పేర్కొన్నది. పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయని గురువారం ప్రకటించింది.

ఆసియా కప్ 2023లో రెండు గ్రూప్‌లుగా 6 జట్లు తలపడతాయి. ఇందులో క్వాలిఫై అయిన నాలుగు జట్లు సూపర్ ఫోర్ స్టేజ్‌కు వెళ్తాయి. అక్కడ టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. ఆసియా కప్ 2023లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. 15 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఆసియా కప్‌లోని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండటం గమనార్హం.

ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నారు. ఆసియా కప్ షెడ్యూల్ విడుదల కావడంతో.. ఇండియాలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలోనే విడుదల చేయనున్నది.

First Published:  15 Jun 2023 11:47 AM GMT
Next Story