Telugu Global
Sports

భారతజట్టుకు ఆరురోజుల శిక్షణాశిబిరం!

ఆసియాకప్ కోసం ఎంపిక చేసిన 17 మంది సభ్యుల భారతజట్టుకు ఈ రోజు నుంచి ఆరురోజులపాటు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని బీసీసీఐ నిర్వహిస్తోంది.

భారతజట్టుకు ఆరురోజుల శిక్షణాశిబిరం!
X

భారతజట్టుకు ఆరురోజుల శిక్షణాశిబిరం!

ఆసియాకప్ కోసం ఎంపిక చేసిన 17 మంది సభ్యుల భారతజట్టుకు ఈ రోజు నుంచి ఆరురోజులపాటు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని బీసీసీఐ నిర్వహిస్తోంది.

భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా ఈనెల 30 నుంచి ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే 2023-ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారతజట్టు సభ్యులకు బీసీసీఐ ప్రత్యేకశిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది.

కర్ణాటక క్రికెట్ సంఘానికి చెందిన అలూరులోని త్రీ- ఓవల్స్ వేదిక వచ్చే ఆరురోజులపాటు జరిగే కండిషనింగ్ క్యాంప్ ను చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షించనున్నారు.

రాహుల్ ఫిట్ నెస్సే కీలకం.....

వెన్నెముక గాయంతో గత కొద్దిమాసాలుగా భారతజట్టుకు దూరమైన కీలక ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఫిట్ నెస్ ఇప్పుడు కీలకంగా మారింది.

గాయాలతో జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ల జోడీ జస్ ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ ..ఐర్లాండ్ తో ముగిసిన టీ-20 సిరీస్ లో పాల్గొని స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా పిట్ నెస్ ను నిరూపించుకోగా...వెన్నెముక, కాలిమడమ గాయాలతో దూరమైన మిడిలార్డర్ జోడీ కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మాత్రం ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడుతూ ఫిట్ నెస్ ను చాటుకొన్నారు.

అయితే...రాహుల్ మాత్రం ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అసౌకర్యానికి గురికావడంతో బీసీసీఐ వైద్యసిబ్బందితో పాటు..ఫిట్ నెస్ సిబ్బంది ప్రత్యేక దృష్టిని పెట్టి మరీ పరిశీలిస్తున్నారు.

శ్రేయస్ అయర్ ప్రాక్టీసుమ్యాచ్ లో 191 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా తాను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు.

యోయో టెస్టులో విరాట్ టాప్...!

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫిట్ నెస్ కలిగిన ఆటగాళ్లలో ఒకడిగా పేరుపొందిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ..ఆరురోజుల కండిషనింగ్ క్యాంప్ ప్రారంభానికి ముందే నిర్వహించిన యోయో టెస్టులో పాల్గొని 17.5 పాయింట్లతో టాపర్ గా నిలిచాడు.

నేటినుంచి ఆరురోజులపాటు జరిగే ఈ శిబిరం తొలిరోజున ఇండోర్స్ లో ఫిట్ నెస్ డ్రిల్స్ నిర్వహిస్తారు. గత నెలరోజులుగా వెస్టిండీస్ పర్యటనలో పాల్గొన్న క్రికెటర్ల ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

ఐర్లాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొన్న బుమ్రా, సంజు శాంసన్, ప్రసిద్ధ కృష్ణ, తిలక్ వర్మతో మిగిలిన ఆటగాళ్లు డబ్లిన్ నుంచి నేరుగా బెంగళూరుకు రానున్నారు.

మొత్తం 17 మంది సభ్యులజట్టులోని మిగిలిన ఆటగాళ్లంతా ఇప్పటికే బెంగళూరు చేరుకొని కసరత్తులు ప్రారంభించారు.


సీనియర్ క్రికెటర్లకు ప్రత్యేక వ్యాయామాలు..

వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లతో ముగిసిన వన్డే, టీ-20 సిరీస్ లకు దూరంగా ఉన్న సీనియర్ క్రికెటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మతో సహా పలువురికి ప్రత్యేక వ్యాయామాలను టీమ్ ట్రెయినర్ సిద్ధం చేశారు.

అయితే...ఆసియాకప్ లో భాగంగా భారత్ పాల్గొనే మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో రాహుల్ పాల్గొనే అవకాశం తక్కువని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే ప్రకటించారు.

30న శ్రీలంక ప్రయాణం...

ఆరురోజుల శిక్షణ శిబిరం ముగిసిన వెంటనే బెంగళూరు నుంచి ఆగస్టు 30న రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు శ్రీలంక బయలుదేరనుంది. పల్లెకెలీ వేదిక సెప్టెంబర్ 2న జరిగే తన ప్రారంభమ్యాచ్ లో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది.

భారతజట్టు ఒకవేళ ఆసియాకప్ ఫైనల్ చేరే పక్షంలో..ప్రపంచకప్ కు ముందు ఆరు అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కుతుంది. ఆసియాకప్ ముగిసిన వెంటనే ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్ర్రేలియాతో జరిగే మూడుమ్యాచ్ ల సిరీస్ లో భారతజట్టు పాల్గోనుంది.

సెప్టెంబర్ 30 నుంచి ప్రపంచకప్ ప్రాక్టీసు మ్యాచ్ లు..

ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రాక్టీసు మ్యాచ్ ల కార్యక్రమాన్ని ఐసీసీ ప్రకటించింది. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్, అక్టోబర్ 3న నెదర్లాండ్స్ జట్లతో జరిగే సన్నాహక మ్యాచ్ ల్లో భారతజట్టు పాల్గోనుంది.

అక్టోబర్ 8న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా భారతజట్టు ప్రపంచకప్ లో తన తొలి లీగ్ మ్యాచ్ ను ఆస్ట్ర్రేలియాతో ఆడనుంది.

First Published:  24 Aug 2023 9:00 AM GMT
Next Story