Telugu Global
Sports

నేడే భారత్- అప్గన్ ఆఖరాట !

ఆసియాకప్ సూపర్-4 రౌండ్ ఆఖరిమ్యాచ్ లో టాప్ ర్యాంకర్ భారత్ తో 10వ ర్యాంకర్ అఫ్ఘనిస్థాన్ నేడు ఢీకొననుంది.

నేడే భారత్- అప్గన్ ఆఖరాట !
X

ఆసియాకప్ సూపర్-4 రౌండ్ ఆఖరిమ్యాచ్ లో టాప్ ర్యాంకర్ భారత్ తో 10వ ర్యాంకర్ అఫ్ఘనిస్థాన్ నేడు ఢీకొననుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7-30 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 15వ ఆసియాకప్ టీ-20 టోర్నీ ఫైనల్స్ కు మాజీ చాంపియన్లు శ్రీలంక, పాకిస్థాన్ జట్లు చేరుకోడంతో..ఈరోజు భారత్- అప్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగే సూపర్ -4 రౌండ్ ఆఖరాటకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది.

కంటితుడుపు గెలుపు కోసం ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్, 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తలపడనున్నాయి.

పరాజయాలతో ఢీలా...

ఏడుసార్లు విజేత భారత్, పసికూన అప్ఘనిస్థాన్ గ్రూప్ లీగ్ దశలో రెండుకు రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా టాపర్లుగా నిలిచినా...నాలుగుజట్ల సూపర్ -4 రౌండ్లో మాత్రం శ్రీలంక, పాకిస్థాన్ జట్ల చేతిలో పరాజయాలతో టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించాయి.

ఐదుసార్లు విజేత శ్రీలంకతో జరిగిన ప్రారంభమ్యాచ్ లో కంగు తిన్న అఫ్ఘనిస్థాన్..నెగ్గితీరాల్సిన రెండోరౌండ్ పోరులో పాకిస్థాన్ తో తుదివరకూ పోరాడి ఓడటంతో ఫైనల్ రౌండ్ ఆశలు ఆవిరైపోయాయి.

మరోవైపు...పాకిస్థాన్ చేతిలో 5 వికెట్లు, శ్రీలంక చేతిలో 6 వికెట్ల పరాజయాలతో కుదేలైన భారత్..గత తొమ్మిదిమాసాలుగా తుదిజట్టులో మార్పులు చేర్పులూ చేస్తూ రావడం ద్వారా భారీమూల్యమే చెల్లించింది.

దీనికి తోడు దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లు నెగ్గాలంటే టాస్ నెగ్గి ఫీల్డింగ్ తీసుకోడం అనివార్యంగా మారింది. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ...సూపర్ -4 రౌండ్లో రెండుకు రెండుమ్యాచ్ ల్లో టాస్ ఓడటం ద్వారా తన జట్టు అవకాశాలను మృగ్యం చేసుకొన్నాడు. 170కి పైగా స్కోర్లు సాధించినా...పసలేని బౌలింగ్ తో ప్రత్యర్థి పాక్, శ్రీలంక జట్ల చేజింగ్ ను నిలువరించలేకపోయాడు.

తుదిజట్టులో దీపక్, దినేశ్...

ప్రస్తుత ప్రపంచ టీ-20 ఫార్మాట్లో అంచనాలకు అందని,సంచలనాల జట్టుగా పేరుపొందిన అప్ఘనిస్థాన్ తో ఈ రోజు జరిగే ఆఖరిరౌండ్ పోరులో భారత్ తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

తుదిజట్టులోకి పేస్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్, రవి బిష్నోయ్ లను తీసుకొనే అవకాశం ఉంది. రిషభ్ పంత్, అశ్విన్, దీపక్ హుడా ల ను పక్కన పెట్టే అవకాశం ఉంది.

స్పిన్ జోడీ ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్, నబీ, ఇబ్రహీం జడ్రాన్, జజాయ్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్లతో అప్ఘనిస్థాన్ సవాలు విసురుతోంది. దుబాయ్ స్టేడియం వేదికగా టాస్ నెగ్గిన జట్టే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని...ఆతర్వాత చేజింగ్ కు దిగుతూ విజేతలుగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది.

సూపర్ -4 రౌండ్లో భాగంగా జరిగిన మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ టాస్ నెగ్గిన శ్రీలంక, పాక్ జట్లే విజయాన్ని సొంతం చేసుకోగలిగాయి.

అప్ఘన్ పై భారత్ దే పైచేయి...

10వ ర్యాంకర్ అఫ్ఘనిస్థాన్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ టాప్ ర్యాంకర్ భారత్ మూడుసార్లు మాత్రమే టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో తలపపడింది. మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ భారతజట్టే విజేతగా నిలవడం ద్వారా నూటికి నూరుశాతం విజయాల రికార్డుతో ఉంది.

అయితే...ప్రస్తుత అప్ఘన్ జట్టు గతం కంటే ఎంతో పటిష్టంగా సమతూకంతో ఉంది. భారత్ ఏమాత్రం తక్కువగా అంచనావేసినా కంగుతినక తప్పదు. సూపర్ -4 రౌండ్లో వరుస పరాజయాలతో డీలాపడిపోయిన ఈ రెండుజట్లూ ఆఖరిరౌండ్ పోరును ఏమాత్రం సీరియస్ గా తీసుకొంటాయన్నది అనుమానమే. అయితే...విజయంతో స్వదేశానికి తిరిగి వెళ్లాలని రెండుజట్లూ భావిస్తున్నాయి.

ఆసియాకప్ గత 14 టోర్నీల చరిత్రలో అత్యధికంగా ఏడుసార్లు విజేతగా నిలిచిన భారత్ లేకుండానే 2022 ఆసియాకప్ టోర్నీ టైటిల్ సమరం ఈనెల 11న జరుగనుంది.

First Published:  8 Sep 2022 4:09 AM GMT
Next Story