Telugu Global
Sports

భారత్-పాక్ జట్ల సూపర్ ఫైట్ నేడే!

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో అతిపెద్ద సమరానికి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

భారత్-పాక్ జట్ల సూపర్ ఫైట్ నేడే!
X

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో అతిపెద్ద సమరానికి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాత్రి 7-30 గంటలకు ఈ పోరు ప్రారంభమవుతుంది...

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 15వ ఆసియాకప్ పోటీలు నాలుగుజట్ల సూపర్ -4 రౌండ్ నుంచే మరింత వేడెక్కాయి. ప్రారంభమ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ తో తుదివరకూ పోరాడి శ్రీలంక 4 వికెట్ల తేడాతో నెగ్గితే...ఈరోజు జరిగే పోరులో డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.టాప్ గేర్ లో భారత్...

గ్రూప్-ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ లో పాకిస్థాన్ ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేయడంతో పాటు..రెండోరౌండ్లో హాంకాంగ్ ను 40 పరుగుల తో ఓడించిన భారత్ వరుసగా మూడో విజయం కోసం ఉరకలేస్తోంది.

మరోవైపు..భారత్ చేతిలో ఎదురైన ఓటమితో రగిలిపోతున్న పాక్ జట్టు సర్వశక్తులూ కూడ దీసుకొని మరీ దెబ్బకు దెబ్బ తీయాలన్న పట్టుదలతో ఉంది. హాంకాంగ్ పై 155 పరుగుల భారీవిజయం సాధించిన ఉత్సాహంతో భారత్ తో పోరుకు సిద్ధమయ్యింది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ సైతం స్థాయికి తగ్గట్టుగా ఆడితే పాకిస్థాన్ బౌలర్లకు కష్టాలు తప్పవు. విరాట్, సూర్యకుమార్, హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ టాప్ గేర్ ను అందుకోడంతో భారత బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది.


కీలక ఆటగాళ్లకు గాయాలు...

భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, యువఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ ఫిట్ నెస్ సమస్యలతో తుదిజట్టుకు దూరమయ్యారు. మరోవైపు..పాక్ర జట్టు కు సైతం యువఫాస్ట్ బౌలర్ దహానీ గాయంతో దూరమయ్యాడు.

భారత తుదిజట్టులో లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ లలో ఇద్దరికి మాత్రమే తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. హాంకాంగ్ తో పోరుకు దూరంగా ఉన్న స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తిరిగి తుదిజట్టులో చేరనున్నాడు.

విరాట్ ను ఊరిస్తున్న మరో రికార్డు...

గత రెండుసంవత్సరాలుగా అంతంత మాత్రం ఫామ్ తో తంటాలు పడుతున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ..లీగ్ దశలోని రెండుమ్యాచ్ ల ద్వారా గాడిలో పడినట్లే కనిపిస్తోంది.పాకిస్థాన్ పై 35 పరుగులు, హాంకాంగ్ పై అజేయ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా విరాట్ దూకుడుమీద కనిపిస్తున్నాడు.

ఇప్పటికే రోహిత్ శర్మ పేరుతో ఉన్న 31 హాఫ్ సెంచరీల రికార్డును సమం చేసిన విరాట్..మరో 3సిక్సర్లు బాదగలిగితే టీ-20 క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన రెండో భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరే అవకాశం ఉంది.

హాంకాంగ్ తో లీగ్ మ్యాచ్ వరకూ 97 సిక్సర్లు బాదిన విరాట్ ..ప్రస్తుత సూపర్ -4 మ్యాచ్ లో పాక్ ప్రత్యర్థిగా మరో మూడుసిక్సర్లు బాదితే...క్రికెట్ చరిత్రలోనే శతసిక్సర్లు బాదిన 10వ బ్యాటర్ గా రికార్డుల్లో నిలువనున్నాడు.

ఇప్పటికే అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో 100కు పైగా సిక్సర్లు సాధించిన విఖ్యాత ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, వోయిన్ మోర్గాన్ ఉన్నారు.

రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ఆడిన 134 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 165 సిక్సర్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 121 మ్యాచ్ ల్లోనే 172 సిక్సర్లతో టాపర్ గా నిలిచాడు.

పాక్ కు సూర్య టెన్షన్....

హార్థిక్ పాండ్యా దెబ్బతో ఇప్పటికే కంగు తిన్న పాకిస్థాన్ కు సరికొత్తగా సూర్యకుమార్ యాదవ్ టెన్షన్ పట్టుకొంది. 360 డిగ్రీల పరిథిలో షాట్లు కొట్టడంలో మొనగాడిగా పేరుపొందిన సూర్యకుమార్ బ్యాటింగ్ ప్రతాపం చూసి పాక్ మేనేజ్ మెంట్..ఎలా అదుపు చేయాలో అర్థంకాక సతమతమవుతోంది. హాంకాంగ్ పై సుడిగాలి హాఫ్ సెంచరీ సాదించిన సూర్య ఈసారి పాక్ పనిపట్టే అవకాశాలు లేకపోలేదు.

భారత్ దే పైచేయి...

ఇక...రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే...ఆసియాకప్ లో ఇప్పటి వరకూ భారత్ ఏడుసార్లు విజేతగా నిలిస్తే...పాకిస్థాన్ జట్టు రెండుసార్లు మాత్రమే విన్నర్ ట్రోఫీ సాధించగలిగింది.అయితే పాక్ ప్రత్యర్థిగా భారత్ దే పైచేయిగా ఉంది.

ఆసియాకప్ లో భాగంగా ఈ రెండుజట్లు ప్రస్తుత టోర్నీ గ్రూప్ లీగ్ తొలిమ్యాచ్ వరకూ 10 సార్లు తలపడితే..భారత్ 7 విజయాలు, పాక్ 2 విజయాలు సాధించాయి. మొత్తం మీద ఈ రెండుజట్లూ వివిధ టోర్నీలలో భాగంగా 15సార్లు తలపడితే భారత్ 9, పాకిస్థాన్ 5 విజయాల రికార్డుతో నిలిచాయి.

విరాట్ కొహ్లీ దే అగ్రస్థానం...

టీ-20 ఫార్మాట్లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లలో విరాట్ కొహ్లీదే అగ్రస్థానం. విరాట్ 78 పరుగులు అత్యధిక స్కోరుతో మొత్తం 7 ఇన్నింగ్స్ లో 346 పరుగులు సాధించాడు. 3 అర్థశతకాలతో 118.25 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. పాకిస్థాన్ తరపున భారత్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ నిలిచారు.

సరికొత్త రికార్డు ఖాయం...

ఆసియా కప్‌ గ్రూపు-ఏ లీగ్ లో భాగంగా గతవారం భారత్- పాక్ జట్ల మధ్య ముగిసిన సమరం వీక్షకులకు అసలుసిసలు క్రికెట్‌ మజాను అందించింది. అంతేకాదు.. వ్యూయర్షిప్‌ పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో (డిస్నీ హాట్‌ స్టార్‌) ఈ మ్యాచ్‌ను కోటి మందికి పైగా (13 మిలియన్లు) వీక్షించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

బ్రాడ్ కాస్టర్ గా డిస్నీ హాట్ స్టార్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యూయర్షిప్‌ సాధించిన మ్యాచ్‌గా రికార్డుల్లో చేరింది. ఈ మ్యాచ్‌ డిజిటల్ ప్లాట్‌ఫాంలో అత్యధికంగా వీక్షించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌గా కూడా నిలిచింది.

ఓటీటీలో ఇప్పటివరకు అత్యధిక వ్యూయర్షిప్‌ సాధించిన మ్యాచ్‌ రికార్డు ఐపీఎల్‌ మ్యాచ్‌ ద్వారా నమోదయ్యింది. 2019 ఐపీఎల్‌ టోర్నీ ఫైనల్లో ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో కోటీ 80 లక్షలు మంది వీక్షించారు. ఓటీటీ చరిత్రలో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానం కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ పేరిటే ఉండింది. అదే సీజన్‌లో ఆర్సీబీ-ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌కు 12 మిలియన్ల వ్యూయర్షిప్ లభించింది.

గతవారం జరిగిన మ్యాచ్ ను కోటీ 30 లక్షల మంది వీక్షిస్తే..మరి ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ ను మరింత మంది వీక్షించడం ద్వారా సరికొత్త రికార్డు నమోదైనా ఆశ్చర్యం లేదు.

Next Story