Telugu Global
Sports

మాస్టర్ కొడుకు కదా!.. ఆపాటి హంగామా తప్పదు!

ఐపీఎల్ -16లో ప్రస్తుతం చోటా టెండుల్కర్ హవా కొనసాగుతోంది. అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ లో తొలి వికెట్ పడగొట్టడంతో జరిగిన హంగామా పై మిశ్రమస్పందన వ్యక్తమవుతోంది.

Arjun Tendulkar Takes First-Ever IPL Wicket
X

మాస్టర్ కొడుకు కదా!.. ఆపాటి హంగామా తప్పదు!

క్రికెట్లో..ప్రధానంగా ఓ బౌలర్ తొలి వికెట్ పడగొడితే.. ఆ సంతోషం, ఆనందం కేవలం ఆ బౌలర్ కు మాత్రమే పరిమితం. వంద వికెట్ల మైలురాయిని చేరిన సమయంలోనో..లేదా పదికి పది వికెట్లు పడగొట్టిన సమయంలోనో సంబరాలు జరుపుకోవ‌డం, మీడియా ఆకాశానికి ఎత్తడం సహజం. అయితే మాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు 23 సంవత్సరాల అర్జున్ టెండుల్కర్ తన కెరియర్ రెండో ఐపీఎల్ మ్యాచ్ లోనే తొలివికెట్ సాధించడంతో క్రికెట్ ప్రముఖులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. మరికొందరు మాత్రం ఇప్పుడే ఇంత హంగామా ఎందుకన్నట్లుగా వ్యాఖ్యానించారు.


రెండోమ్యాచ్ లోనే తొలివికెట్..

ఐపీఎల్ లో ముంబై జట్టులో సభ్యుడిగా గత రెండేళ్లుగా ఉన్న అర్జున్ టెండుల్కర్.. వాంఖడే స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో కొద్దిరోజుల క్రితం జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా తన తొలిమ్యాచ్ క్యాప్ అందుకొన్నాడు. పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్ కతా పైన ఓపెనింగ్ బౌలర్ గా అర్జున్ తన ఐపీఎల్ కెరియర్ మెదలు పెట్టాడు.


2021 సీజన్ నుంచి ముంబై బెంచ్ కే పరిమితమైన అర్జున్ గత సీజన్ దేశవాళీ క్రికెట్ టోర్నీలలో బౌలింగ్ ఆల్ రౌండర్ గా సత్తా చాటుకొన్నాడు. రంజీట్రోఫీలో గోవాజట్టుకు ఆడుతున్న అర్జున్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ గా, దూకుడుగా ఆడే బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

కోల్ కతాతో మ్యాచ్ లో ముంబై బౌలింగ్ ను ప్రారంభించిన అర్జున్ తన మొదటి రెండు ఓవర్లలో 17 పరుగులిచ్చి పర్వాలేదని పించాడు. అరంగేట్రం మ్యాచ్ లో కేవలం రెండు ఓవర్లకే పరిమితమయ్యాడు. ఇక..హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో సైతం అర్జున్ కు అవకాశం దొరికింది. కొత్త బంతితో కుదురుగా బౌల్ చేసిన అర్జున్ కు మ్యాచ్ ఆఖరి ( డెత్ ) ఓవర్లో బౌలింగ్ చేసే అరుదైన అవకాశం దక్కింది.

మ్యాచ్ నెగ్గాలంటే సన్ రైజర్స్ ఆఖరి ఆరు బంతుల్లో 20 పరుగులు చేయాలి. క్రీజులో టెయిల్ ఎండర్లు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే మాత్రమే ఉన్నారు. అలాంటి సమయంలో కెప్టెన్ రోహిత్ బంతిని ఏమాత్రం డెత్ ఓవర్ల బౌలింగ్ అనుభవం లేని అర్జున్ చేతికి ఇచ్చాడు.


భువి వికెట్ తో అరుదైన ఘనత...

అర్జున్ తమజట్టు వ్యూహానికి అనుగుణంగా, ఎంతో పరిణతితో బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి..2 పరుగులు చేసిన భువనేశ్వర్ కుమార్ ను అవుట్ చేయడం ద్వారా మ్యాచ్ ను ముగించాడు. ముంబైకి 14 పరుగుల విజయం ఖాయం చేశాడు. దీంతో ముంబైజట్టు సభ్యులంతా అర్జున్ ను చుట్టుముట్టి మరి అభినందించారు. అర్జున్ 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.

2009 రంజీట్రోఫీ మ్యాచ్ లో మాస్టర్ సచిన్ ను భువనేశ్వర్ కుమార్ డకౌట్ గా పడగొట్టాడు. అదే భువనేశ్వర్ కుమార్ ను సచిన్ కొడుకు అర్జున్ పడగొట్టడం ఓ అరుదైన ఘట్టంగా మిగిలిపోతుంది.

అర్జున్ తొలి వికెట్ పడగొట్టడంతోనే బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ, భారత మాజీ ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి, దిగ్గజ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపిస్తూ అభినందన సందేశాలు పంపారు. మొహాలీ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింతా సైతం ట్విట్టర్ ద్వారా అభినందించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎందరు తమ మాటలతో ఆటపట్టించినా అర్జున్ సత్తా చాటుకొన్నాడంటూ ప్రీతి జింతా తన సందేశంలో పేర్కొంది.

ఆట ఆఖరి ఓవర్ ను అర్జున్ ఎంతో గొప్పగా బౌల్ చేశాడని, ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఉండటం తన తండ్రి సచిన్ నుంచి వారసత్వంగా వచ్చిందంటూ సునీల్ గవాస్కర్ కొనియాడారు.

అయితే..సన్ రైజర్స్ మాజీ శిక్షకుడు టామ్ మూడీ మాత్రం..ఇప్పుడే అర్జున్ టెండుల్కర్ కు డెత్ బౌలర్ అంటూ బిరుదులు తగిలించడంలో అర్థంలేదని, అర్జున్ ప్రస్తుతం ఓనమాల దశలో ఉన్నాడని, స్పెషలిస్ట్ బౌలర్ అంటూ ముద్రవేయలేమని తేల్చి చెప్పాడు. అర్జున్ ప్రారంభ, ముగింపు ఓవర్ల కంటే మిడిల్ ఓవర్లకు బౌలర్ గా పనికి వస్తాడని..అతను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గుర్తు చేశారు.


నాన్న చెప్పిందే చేశా..అర్జున్..

ఐపీఎల్ లో తొలి వికెట్ పడగొట్టడం, తనజట్టు విజయంలో తనవంతు పాత్ర నిర్వర్తించడం పట్ల చోటా టెండుల్కర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. నెట్ ప్రాక్టీసులో ఎలాంటి బౌలింగ్ చేస్తావో..మ్యాచ్ లోనూ అదే చేయమని తమజట్టు మెంటార్ ( సచిన్ టెండుల్కర్ ), టీమ్ మేనేజ్ మెంట్ తనను కోరారని, వారు చెప్పినట్లే తాను చేశానని అన్నాడు. మ్యాచ్ ఏదశలో బౌలింగ్ చేయమన్నా తాను సిద్ధమని అర్జున్ ప్రకటించాడు.

25 లక్షల రూపాయల మ్యాచ్ ఫీజుతో ప్రస్తుతం ముంబై ఫ్రాంచైజీలో అర్జున్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ లో అర్జున్ ప్రత్యేక శిక్షణ పొందటం ద్వారా తన ఆటకు మెరుగులు దిద్దుకొన్నాడు.

ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో గోవాజట్టుకు ఆడుతున్న అర్జున్ కు ముంబై రంజీ జట్టులో చోటు దక్కకపోడం విశేషం. దూకుడుగా ఆడే బ్యాటర్ గా, ఎడమచేతి వాటం మీడియం పేసర్ గా అర్జున్ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

Next Story