Telugu Global
Sports

ప్రపంచ విలువిద్యలో 'విజయ' బాణం!

ప్రపంచ విలువిద్య పోటీలలో విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ తన బంగారు వేటను కొనసాగిస్తోంది. 2024 సీజన్ పోటీలలో సైతం గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

ప్రపంచ విలువిద్యలో  విజయ  బాణం!
X

ప్రపంచ విలువిద్య పోటీలలో విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ తన బంగారు వేటను కొనసాగిస్తోంది. 2024 సీజన్ పోటీలలో సైతం గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

చైనా నగరం షాంఘై వేదికగా జరుగుతున్న 2024- ప్రపంచ విలువిద్య పోటీల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత్ బంగారు పంట పండించుకొంది. భారతజట్టులో సభ్యురాలిగా ఉన్న విజయవాడ ఆర్చర్, ప్రపంచ మూడవ ర్యాంకర్ జ్యోతి సురేఖ వెన్నం టీమ్ పోటీల మూడు అంశాలలోనూ బంగారు పతకాలు సాధించడం ద్వారా మరోసారి గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

2024లోనూ అదేజోరు.....

గతేడాది జరిగిన ఆసియా క్రీడల విలువిద్య వ్యక్తిగత, మహిళల టీమ్, మిక్సిడ్ టీమ్ అంశాలలో బంగారు పతకాలు సాధించిన ఏకైక ఆర్చర్ గా రికార్డు నెలకొల్పిన జ్యోతి..

ప్రస్తుత 2024 సీజన్లోనూ అదేజోరు కొనసాగిస్తోంది.

2024-షాంఘై ప్రపంచ మీట్ స్టేజ్ -1 పోటీలలో సైతం జ్యోతి సురేఖ 146కు 146 పాయింట్లు సాధించడం ద్వారా మూడు బంగారు పతకాలు సొంతం చేసుకోంది.

మహిళల వ్యక్తిగత విభాగం గోల్డ్ మెడల్ పోరులో మెక్సికోకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ యాండ్రియా బాసెరాతో జరిగిన షూట్-ఆఫ్ రౌండ్లో 146 కు 146 పాయింట్లు సాధించడం ద్వారా బంగారు పతకం అందుకొంది.

మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం..

మహిళల టీమ్ విభాగం గోల్డ్ మెడల్ పోరులో జ్యోతీ, అదితీ గోస్వామి, ప్రణీత్ కౌర్ లతో కూడిన భారతజట్టు 236- 225 పాయింట్ల తేడాతో ఇటలీని చిత్తు చేయడం ద్వారా విజేతగా నిలిచింది.

మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్ బంగారు పతకం సాధించడంలో జ్యోతి సురేఖ్ ప్రధానపాత్ర వహించింది. ఎస్తోనియాపై భారత్ 158- 157 పాయింట్లతో నెగ్గడం ద్వారా స్వర్ణపతకం సంపాదించింది.

పురుషుల విభాగంలో సైతం భారత్ ఆధిపత్యమే కొనసాగింది. అభిషేక్ వర్మ, ప్రియాంశు,ప్రథమేశ్ ఫ్యూజీ లతో కూడిన భారతజట్టు 238- 231 పాయింట్లతో నెదర్లాండ్స్ ను అధిగమించింది.

విజయవాడ నుంచి ప్రపంచస్థాయికి....

మొత్తం మూడు విభాగాలలోనూ బంగారు పతకాలు సాధించడం జ్యోతి సురేఖకు ఇదే మొదటిసారికాదు. గత ఆసియా క్రీడలతో పాటు..ప్రస్తుత ప్రపంచ విలువిద్య పోటీలలో సైతం ఈ విజయవాడ ఆర్చర్ గోల్డెన్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

11 సంవత్సరాల వయసులో విజయవాడ వేదికగా విలువిద్య క్రీడలో సాధన మొదలు పెట్టిన సురేఖ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. కాంపౌండ్ విభాగంలో మేటి మహిళా ఆర్చర్ గా గుర్తింపు తెచ్చుకొన్న సురేఖ గత 13 సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మొత్తం 40కి పైగా అంతర్జాతీయ విలువిద్య పోటీలలో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది.

ఇందులో ఆరు ప్రపంచ టోర్నీలు, రెండు ఆసియా క్రీడలు, 19 ప్రపంచకప్ పోటీలు, 5 ఆసియా విలువిద్య పోటీలు, 3 ఆసియాకప్ టోర్నీలు, రెండు ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు, రెండు జూనియర్ ప్రపంచకప్ టోర్నీలు, దక్షిణాసియా క్రీడలు సైతం ఉన్నాయి.

24సార్లు జాతీయ విలువిద్య పోటీలలో పాల్గొన్న సురేఖ ఏకంగా 58 పతకాలు సాధించింది. ఇందులో 36 స్వర్ణ, 13 రజత, 9 కాంస్యాలు ఉన్నాయి.

2017లో అర్జున పురస్కారం....

ఇప్పటి వరకూ ఆరు వేర్వేరు ప్రపంచ విలువిద్య పోటీలలో పాల్గొన్న సురేఖ మొత్తం 9 పతకాలు సాధించింది. ఇందులో ఆరు స్వర్ణ, నాలుగు రజత, రెండు కాంస్యాలు ఉన్నాయి.

2017 ప్రపంచ విలువిద్య టోర్నీలో టీమ్‌ రజతం, 2019లో టీమ్, వ్యక్తిగత కాంస్యాలు, 2021లో వ్యక్తిగత, టీమ్, మిక్సిడ్ విభాగాలలో మూడు రజత పతకాలు గెలుచుకొంది.

ప్రపంచ విలువిద్య కాంపౌండ్ విభాగంలో భారత్ ఇప్పటి వరకూ సాధించిన మొత్తం 15 పతకాలలో సురేఖ నెగ్గినవే తొమ్మిదికి పైనే ఉన్నాయి.

జాతీయ, అంతర్జాతీయ పోటీలలో నిలకడగా రాణిస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచిన జ్యోతి సురేఖకు 2017లో భారత ప్రభుత్వం అర్జున పురస్కారం తో గౌరవించింది.

రికర్వ్ విభాగంలో భారత్ జోరు..

ఒలింపిక్స్ లో పతకం అంశంగా ఉన్న రికర్వ్ విభాగం పురుషుల టీమ్ ఫైనల్లో ఒలింపిక్ విజేత దక్షిణ కొరియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల రికర్వ్ సెమీఫైనల్లో కొరియా ప్రత్యర్థితోనే భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి ఢీ కోనుంది.

First Published:  27 April 2024 11:31 AM GMT
Next Story