Telugu Global
Sports

అభిమానుల కోసం ధోనీ మరో ఏడాది!

తన రిటైర్మెంట్ పై ఊహాగానాలకు మహేంద్రసింగ్ ధోనీ తెరదించాడు.

అభిమానుల కోసం ధోనీ మరో ఏడాది!
X

తన రిటైర్మెంట్ పై ఊహాగానాలకు మహేంద్రసింగ్ ధోనీ తెరదించాడు. అభిమానుల కోసం మరో సీజన్ పాటు తన కెరియర్ ను కొనసాగిస్తానని పరోక్షంగా తెలిపాడు..

ఐపీఎల్ 16 సీజన్ల చరిత్రలో ఐదుసార్లు టైటిల్ నెగ్గిన రెండోజట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కమ్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ..తన రిటైర్మెంట్ పై

పలు విధాలుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. తన మనసులో మాటను బయట పెట్టాడు.

ఐదో టైటిల్..అయినా నో రిటైర్మెంట్!

వయసు మీద పడుతున్నా..తన అపారఅనుభవం, నాయకత్వ పటిమతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదోసారి ఐపీఎల్ విజేతగా నిలిపిన 42 ఏళ్ల మహేంద్రసింగ్ ధోనీ..తన రిటైర్మెంట్ పై కొనసాగుతున్న ఊహాగానాలను కొట్టిపడేశాడు.

ఐపీఎల్ -16 టైటిల్ ను అందించిన వెంటనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ భావించారు. మీడియా సైతం అదే పనిగా ఊదరగొట్టింది. అయితే..ధోనీ మాత్రం తనజట్టును ఐదోసారి విజేతగా నిలిపినా కూల్ కూల్ గానే తన భావికార్యక్రమాన్ని ప్రకటించాడు.

అభిమానుల కోసం కష్టం తప్పదు....

ఐపీఎల్ -16 సీజన్ లీగ్,న నాకౌట్ మ్యాచ్ ల కోసం తాను దేశంలోని ఏస్టేడియానికి వెళ్లినా అభిమానులు కేవలం తనకోసమే భారీసంఖ్యలో తరలి వచ్చారని, వారు చూపిన అభిమానానికి చకితుడనయ్యానని ధోనీ ప్రకటించాడు.

ఐపీఎల్ నుంచి తాను రిటైర్ కావటానికి..ఫైనల్లో విజయాన్ని మించిన మంచి తరుణం మరొకటి లేదని..అయితే..తన తుది నిర్ణయం ప్రకటించడానికి మరో ఆరేడుమాసాల సమయం ఉందని వివరించాడు.

ఓ సీజన్ ఐపీఎల్ ఆడాలంటే..మ్యాచ్ ఫిట్ నెస్ కోసం 9మాసాలు కష్టపడక తప్పదని, 42 సంవత్సరాల వయసులో తనకు చాలా కష్టంగానే అనిపిస్తోందని..అయితే..తన పట్ల అభిమానులు చూపుతున్న ప్రేమకు దాసుడనైపోయానని..వారి కోసం కష్టపడతానని..మరో ఏడాదిపాటు కొనసాగటానికి నిర్ణయించుకొన్నానని స్పష్టం చేశాడు.

2008 ప్రారంభ సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతూ వస్తున్న ధోనీ పేరుతో ఐదుటైటిల్స్ నెగ్గిన రెండో కెప్టెన్, 250 మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడి రికార్డులు ఉన్నాయి.

తన ఐపీఎల్ కెరియర్ చివరి భాగాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

ఐపీఎల్ లో 14 సీజన్లపాటు పోటీకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 10సార్లు ఫైనల్స్ చేరి ఐదోసారి విజేతగా నిలిచింది. ముంబై తర్వాత ఐదు టైటిల్స్ నెగ్గిన రెండోజట్టుగా

చెన్నై సూపర్ కింగ్స్ రికార్డుల్లో చేరింది.

2020 లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొన్న ధోనీ..ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతూ వస్తున్నాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రెండుమాసాల క్రితం ప్రస్తుత సీజన్ తొలిమ్యాచ్ ను టైటాన్స్ తో ఆడి ఓటమి పొందామని..చివరిమ్యాచ్ ను సైతం అదే స్టేడియం వేదికగా..అదే ప్రత్యర్థిజట్టుతో ఆడి విజయం సాధించడం తనకు ఎనలేని సంతృప్తినిచ్చిందని ధోనీ ప్రకటించాడు. ఐపీఎల్ ఐదో టైటిల్ ను తన జట్టు సభ్యులు తనకోసం ఇచ్చిన అరుదైన బహుమతిగా భావిస్తున్నట్లు తెలిపాడు.

First Published:  30 May 2023 5:15 AM GMT
Next Story