Telugu Global
Sports

టీమిండియా అమ్ములపొదిలో మరో ఆల్ రౌండర్..!

నిన్న రాత్రి భారత్ -వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓటమి ఖాయమనుకున్న దశలో అక్షర్ పటేల్ విజృంభించాడు. తన ధనా ధన్ బ్యాటింగ్ తో భారత్ కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు.

టీమిండియా అమ్ములపొదిలో మరో ఆల్ రౌండర్..!
X

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ జ‌ట్టు దశాబ్దాల కిందటి నాటి నుంచే సత్తా చాటుతోంది. జట్టు తరపున ఆడి ఎంతో మంది అద్భుతమైన బ్యాటర్లు, బౌలర్లు వెలుగులోకి వచ్చారు. ప్రపంచ క్రికెట్లో టీమిండియా దశాబ్దాల నుంచి సత్తా చాటుతున్నప్పటికీ టీమిండియాకు నికార్సయిన ఆల్ రౌండర్ల సమస్య మాత్రం మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది.

1980, 1990లలో కపిల్ దేవ్ పేస్ ఆల్ రౌండర్ గా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఆయన రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా భారత్ కు ఆల్ రౌండర్ల కొరత అలాగే ఉండిపోయింది. మధ్యలో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ లాంటివారు ఆశలు రేకెత్తించినప్పటికీ వాళ్లు జట్టులో ఆల్ రౌండర్లుగా ఎదగలేకపోయారు. దీంతో భారత జట్టు నికార్సయిన ఆల్ రౌండర్ కోసం వెతుకులాట చేపడుతూ వచ్చింది.

ఈ క్రమంలో జడేజా, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్లుగా జట్టులోకి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరితో పాటు భారత జట్టుకు మరో ఆల్ రౌండర్ దొరికాడు. స్పిన్న‌ర్‌ అక్షర్ పటేల్ ఐపీఎల్ తోపాటు దేశవాళీ క్రికెట్లోనూ ఆల్ రౌండర్ గా ప్రతిభ చూపాడు. అయితే అతడు జాతీయ జట్టులోకి వచ్చిన ప్రతిసారి నిరాశ పరుస్తున్నాడు.

కొన్నేళ్ల కిందటే భారత వన్డే, టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్ ఇంతవరకూ తన స్థాయిలో ఆడలేదు. నిన్న రాత్రి భారత్ -వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓటమి ఖాయమనుకున్న దశలో అక్షర్ పటేల్ విజృంభించాడు. తన ధనా ధన్ బ్యాటింగ్ తో భారత్ కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. 212 పరుగులకే టీమిండియా 5 వికెట్లు కోల్పోయిన వేళ, కేవలం 10 ఓవర్లలో వంద పరుగులు చేయాల్సిన తరుణంలో అక్షర్ పటేల్ చెలరేగిపోయాడు.

టెయిలెండర్ల సహాయంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 35 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ లో కూడా ఒక వికెట్ తీసి `మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`గా నిలిచాడు. త్వరలో టీ-20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు టీమిండియా అమ్ములపొదిలోకి మరో ఆల్ రౌండర్ గా అక్షర పటేల్ చేరాడు.

ఇది నిజంగా జట్టు కూర్పుకు ఎంతో సహాయపడేదే. ప్రస్తుతం భారత క్రికెట్ లో హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఫిట్ గా ఉంటాడో ఎప్పుడు అన్ ఫిట్ గా ఉంటాడో తెలియని పరిస్థితి. ఇక మిగిలి ఉన్న జడేజా గాయపడితే ఆల్ రౌండర్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగాల్సి వస్తోంది. ఇప్పుడు అక్షర్ పటేల్ రానున్న ఆసియా కప్, టీ -20 వరల్డ్ కప్ కు టీమిండియాకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.

First Published:  25 July 2022 5:38 AM GMT
Next Story