Telugu Global
Sports

భారత టెస్టుజట్టులో ఆంధ్ర వికెట్ కీపర్ భరత్ కు చోటు!

దక్షిణాఫ్రికాతో జరిగే రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో ఆంధ్రప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ కు అనూహ్యంగా చోటు దక్కింది.

భారత టెస్టుజట్టులో ఆంధ్ర వికెట్ కీపర్ భరత్ కు చోటు!
X

దక్షిణాఫ్రికాతో జరిగే రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో ఆంధ్రప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ కు అనూహ్యంగా చోటు దక్కింది...

2023-2025 ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 26న ప్రారంభంకానున్న రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో ఆంధ్రపదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ కు అనుకోని విధంగా చోటు దక్కింది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకొన్న ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ కు దూరం కావడంతో బ్యాకప్ వికెట్ కీపర్ గా భరత్ కు అవకాశం కల్పించారు.

గాయాలతో షమీ, రుతురాజ్ దూరం....

సఫారీగడ్డపై మొట్టమొదటి టెస్టు సిరీస్ నెగ్గాలన్న టాప్ ర్యాంకర్ భారత్ బరిలోకి దిగకముందే వేర్వేరు కారణాలతో ముగురు ఆటగాళ్లు దూరమయ్యారు. భారత బౌలింగ్ తురుపుముక్క , ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీతో పాటు..ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ సైతం ఫిట్ నెస్ సమస్యలతో జట్టునుంచి తప్పుకొన్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంపికైన ఇషాన్ కిషన్ సైతం వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి ఉపసంహరించుకోడంతో..స్టాప్ గ్యాప్ వికెట్ కీపర్ గా కెఎస్ భరత్ కు ఆఖరినిముషంలో జట్టులో చోటు కల్పించారు.

కీపింగ్ లో టాప్...బ్యాటింగ్ లో ప్లాప్....

ఆంధ్ర ఆటగాడు కెఎస్ భరత్ కు దేశంలోనే అత్యుత్తమ టెస్టు ఫార్మాట్ వికెట్ కీపర్ గా పేరుంది. అయితే ..బ్యాటింగ్ లో మాత్రం భరత్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడం అవకాశాలను దెబ్బతీస్తోంది.

గతేడాది ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఐదుకు ఐదుమ్యాచ్ లూ ఆడే అవకాశం దక్కించుకొన్న భరత్ ..బ్యాటింగ్ లో మాత్రం తీవ్రనిరాశ పరిచాడు. దాంతో..భరత్ ను పక్కనపెట్టి యువవికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వైపు సెలెక్షన్ కమిటీ మొగ్గుచూపుతూ వస్తోంది.

అయితే..ఇషాన్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం కావడంతో ఆ స్థానంలో భరత్ కు టీమ్ మేనేజ్ మెంట్ చోటు కల్పించింది. ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ సైతం పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోడంతో...యువ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కు తొలిసారిగా జట్టులో చోటు కల్పించారు.

ప్రధాన వికెట్ కీపర్ గా కెఎల్ రాహుల్..

ఇప్పటి వరకూ భారత వన్డే జట్టుకు మాత్రమే కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలు అందిస్తూ వచ్చిన కెఎల్ రాహుల్..సఫారీలతో రెండుమ్యాచ్ ల కీలక టెస్టు సిరీస్ లో సైతం ప్రధాన వికెట్ కీపర్ గా వ్యవహరించనున్నాడు. జట్టులో రెండో వికెట్ కీపర్ గా భరత్ అందుబాటులో ఉంటాడు.

రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టును డిసెంబర్ 26 నుంచి జోహెన్స్ బర్గ్ సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా నిర్వహించనున్నారు. రెండవ టెస్టు మ్యాచ్ కు కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియం జనవరి 3 నుంచి 7 వరకూ ఆతిథ్యమివ్వనుంది.

భారత ఓపెనర్లుగా రోహిత్- యశస్వి...

బాక్సింగ్ డే టెస్టుగా జరిగే తొలిపోరులో యువఆటగాడు యశస్వ జైశ్వాల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రారంభించనున్నాడు. గత జులైనలో డోమనికా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ 171 పరుగులతో అదరగొట్టాడు. సఫారీ సిరీస్ లోనూ అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో 21 సంవత్సరాల యశస్వి ఉన్నాడు.

గతంలో చతేశ్వర్ పూజారా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన కీలక వన్ డౌన్ స్థానంలో యువఆటగాడు శుభ్ మన్ గిల్, రెండో డౌన్లో విరాట్ కొహ్లీ, మూడో డౌన్లో శ్రేయస్ అయ్యర్, 4వ డౌన్లో కెఎల్ రాహుల్, 7వ నంబర్ స్థానంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, 8వ డౌన్లో పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

శ్రేయస్ అయ్యర్ 2023 మార్చిలో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా తన చివరి టెస్టుమ్యాచ్ ఆడిన అనంతరం తిరిగి జట్టులో చోటు సంపాదించగలిగాడు.

గతంలో భారతజట్టుకు ఓపెనర్ గా వ్యవహరించిన రాహుల్..సఫారీ సిరీస్ లో మాత్రం మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగనున్నాడు.

సఫారీగడ్డపై టెస్టు సిరీస్ గెలుపులేని భారత్...

దక్షిణాఫ్రికా పేస్, బౌన్సీ పిచ్ లపైన భారత్ ఇప్పటి వరకూ కనీసం టెస్టుల్లో ఒక్క సిరీస్ విజయమూ సాధించలేకపోయింది. అడపాదడపా టెస్టుమ్యాచ్ లు నెగ్గుతూ వస్తున్నా..సిరీస్ లు నెగ్గడంలో సఫలం కాలేకపోతోంది.

ప్రపంచ నంబర్ వన్ టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కు తొలిటెస్టు తుదిజట్టులో చోటు దక్కడం అనుమానమే. సెంచూరియన్ పార్క్ వికెట్ ఫాస్ట్ బౌలర్లకు అనువుగా ఉండడం, స్పిన్ బౌలింగ్ కు ఏమాత్రం అనుకూలం కాకపోడంతో..స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ ను పక్కన పెట్టి పేస్ ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ వైపు టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గుచూపడం ఖాయంగా కనిపిస్తోంది.

భారతజట్టు తొలిటెస్టులో నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ తో బరిలోకి దిగాలని భావిస్తోంది. మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా, శార్థూల్ ఠాకూర్ లతో పాటు..

ముకేశ్ కుమార్ లేదా ప్రసిద్ధ కృష్ణలలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కనుంది. జట్టులో ఏకైక స్పిన్నర్ గా రవీంద్ర జడేజా వ్యవహరిస్తాడు.

First Published:  23 Dec 2023 2:30 AM GMT
Next Story