Telugu Global
Sports

ప్రపంచ అథ్లెటిక్స్ మీట్ కు భారతజట్టులో ఆంధ్రా రన్నర్!

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టులో ఆంధ్రస్టార్ రన్నర్ జ్యోతి ఎర్రాజీకి చోటు దక్కింది. బుడాపెస్ట్ వేదికగా ఈ పోటీలు జరుగనున్నాయి.

ప్రపంచ అథ్లెటిక్స్ మీట్ కు భారతజట్టులో ఆంధ్రా రన్నర్!
X

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టులో ఆంధ్రస్టార్ రన్నర్ జ్యోతి ఎర్రాజీకి చోటు దక్కింది. బుడాపెస్ట్ వేదికగా ఈ పోటీలు జరుగనున్నాయి....

ఆసియాక్రీడలకు ముందే హంగెరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగనున్న 2023 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టుకు సూపర్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా నాయకత్వం వహిస్తాడు.

మొత్తం 28 సభ్యుల బృందంలో ఐదుగురు మహిళా అథ్లెట్లకు మాత్రమే చోటు దక్కింది. భారత ప్రధాన అథ్లెట్లలో కొందరు ప్రపంచ మీట్ కు దూరంగా ఉంటూ ఆసియాక్రీడల్లో పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు.

షాట్ పుట్ లో ఆసియా రికార్డు హోల్డర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్, హైజంపర్ తేజస్విన్ శంకర్, 800 మీటర్ల రన్నర్ కెఎమ్ చంద్, 20 కిలోమీటర్ల నడక స్పెషలిస్ట్ ప్రియాంకా గోస్వామి ప్రపంచ పోటీలకు దూరమయ్యారు.

ఆగస్టు 19 నుంచి 27 వరకూ జరిగే ఈ మెగా టోర్నీలో వివిధ దేశాలకు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్లు తమ సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నారు. ఆంధ్ర రన్నర్ కు తొలి ప్రపంచ మీట్...

ఇప్పటికే ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్, ప్రపంచ యూనివర్శిటీ గేమ్స్ లో పతకాలు సాధించిన భారత్ కమ్ విశాఖ రన్నర్ జ్యోతి ఎర్రాజీ తొలిసారిగా ప్రపంచ అథ్లెటిక్స్ మీట్ లో పాల్గొనటానికి ఎంపికయ్యింది.

ఐదుగురు భారత మహిళా అథ్లెట్ల బృందంలో 23 ఏళ్ల జ్యోతికి సైతం చోటు దక్కింది. ఐదుగురు సభ్యుల భారత మహిళా అథ్లెట్ల బందంలోని ఇతరుల్లో 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ రన్నర్ పారుల్ చౌదరి, లాంగ్ జంపర్ షైలీ సింగ్, జావలిన్ త్రోయర్ అన్ను రాణి, 20 కిలోమీటర్ల రేస్ రన్నర్ భావనా జాట్ ఉన్నారు.

మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేస్ లో జ్యోతి ఎర్రాజీ పాల్గోనుంది.

గోల్డ్ మెడల్ వైపు నీరజ్ చూపు...

భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూపర్ స్టార్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. గత ప్రపంచ మీట్ లో రజత పతకంతో సరిపెట్టుకొన్న నీరజ్ ఆరునూరైనా ఈసారి ప్రపంచ టైటిల్ సాధించితీరాలన్న కసితో పోటీలకు సిద్ధమయ్యాడు.

భారత పురుషుల బృందంలోని ఇతర అథ్లెట్లలో కృష్ణకుమార్ ( 800 మీటర్ల పరుగు ), అజయ్ కుమార్ సరోజ్ ( 1500 మీటర్ల పరుగు ), సంతోశ్ కుమార్ ( 400 మీటర్ల హర్డిల్స్ ), అవినాశ్ ముకుంద్ సాబ్లే ( 3000 మీటర్ల స్టీపిల చేజ్ ), సర్వేశ్ అనిల్ కుషారే ( హైజంప్ ), జెశ్విన్ ఆల్డ్ర్రిన్ ( హైజంప్ ), శ్రీశంకర్ ( లాంగ్ జంప్ ), ప్రవీణ్ చిత్రవేల్ ( ట్రిపుల్ జంప్ ), అబ్దుల్లా అబూబాకర్,( ట్రిపుల్ జంప్ ), ఎల్దోసీ పాల్ ( ట్రిపుల్ జంప్ ), డీపీ మను ( జావలిన్ త్రో ), కిశో్ర్ కుమార్ జేనా ( జావలిన్ త్రో ), ఆకాశ్ దీప్ సింగ్ ( 20 కిలోమీటర్ల నడక ), వికాస్ సింగ్ ( 20 కిలోమీటర్ల నడక ), పరంజీత్ సింగ్ ( 20 కిమీ నడక ), రాంబాబు ( 35 కిమీ నడక ), అమోజ్ జాకోబ్, మహ్మద్ అజ్మల్, మహ్మద్ అనాస్, రాజేశ్ రమేశ్, అనీల్ రాజలింగం, మిజో చాకో కురియన్ ( 1600 మీటర్ల రిలే ) అంశాలలో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

మొత్తం 28 మంది బృందంలో దేశానికి బంగారు పతకం సాధించే సత్తా కలిగిన ఏకైక అథ్లెట్ జావలిన్ త్రో మొనగాడు నీరజ్ చోప్రా మాత్రమే.

అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించాల్సిన జట్టును తొలిసారిగా కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ విడుదల చేసింది.

ఈపోటీల తర్వాత చైనాలోని హాంగ్జు వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ జరిగే 2022 ఆసియాక్రీడల్లో భారత అథ్లెట్లు పాల్గోనున్నారు.

First Published:  11 Aug 2023 10:30 AM GMT
Next Story