Telugu Global
Sports

రెజ్లర్ల దీక్షపై హోంమంత్రి నీళ్లు చల్లారా?

గత ఆరువారాలుగా నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్ల జోరుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పగ్గాలు వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

రెజ్లర్ల దీక్షపై హోంమంత్రి నీళ్లు చల్లారా?
X

రెజ్లర్ల దీక్షపై హోంమంత్రి నీళ్లు చల్లారా?

గత ఆరువారాలుగా నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్ల జోరుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పగ్గాలు వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

బీజెపీ ఎంపీ, జాతీయకుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలంటూ గత ఆరువారాలుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన భారత వస్తాదుల ఆవేశంపైన కేంద్రహోంమంత్రి అమిత్ షా నీళ్లు చల్లారన్న వార్తలు ఆనోట, ఈ నోట వినిపిస్తున్నాయి.

ఏడుగురు మహిళా రెజ్లర్లపై కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు కావడం, ఢిల్లీ పోలీసులు విచారణను జోరుగా సాగించడం జరిగిపోతున్నాయి.

అయితే..బ్రిజ్ భూషణ్ పై బలహీనమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి..ఆరోపణలు వీగిపోయేలా చేయటానికి ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడుతున్న రెజ్లర్లు..తాము సాధించిన పతకాలను సైతం హరిద్వార్ లోని గంగానదిలో నిమజ్జనం చేస్తామంటూ ప్రదర్శన నిర్వహించారు. అయితే..కిసాన్ నాయకుల జోక్యంతో తమ ప్రయత్నాన్ని విరమించుకొన్నారు.

హోంమంత్రి మంత్రం వేశారా?

తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష వీడేది లేదంటూ ఆవేశంతో ఊగిపోయిన రెజ్లర్లలో ముగ్గురు ( సాక్షి మాలిక్, భజరంగ పూనియా, వినేశ్ పోగట్ ) రైల్వే శాఖలోని తమతమ ఉద్యోగాలలో చేరిపోవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ముగ్గురు రెజ్లర్లు..కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమైన తరువాత తమ ఉద్యోగాలలో చేరిపోవాలని నిర్ణయించినట్లు వార్తలు బయటకు వచ్చాయి.

చట్టం తనపని తాను చేసుకుపోతుందని, ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారమే శిక్షలు ఉంటాయని హోంమంత్రి..తనతో సమావేశమైన రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. రెజ్లర్లు చెప్పిన మాటలను, వారి బాధలను హోంమంత్రి ఓపికగా విన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.

ఒలింపిక్స్, ఆసియాక్రీడలు, ప్రపంచ పోటీలలో భారత్ కు పలుమార్లు పతకాలు సాధించిపెట్టిన భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ పోగట్..ఇండియన్ రైల్వేస్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

హోంమంత్రి తో సమావేశం తర్వాత తమ విధులలో చేరాలని నిర్ణయించినట్లుగా మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి.

దీక్ష వీడలేదు, మీడియాపై రెజ్లర్ల గరంగరం..

రైల్వే శాఖ‌కు చెందిన ఓఎస్డీ పోస్టుల్లో సాక్షీ మాలిక్‌, భజరంగ్ పూనియా తిరిగి చేరారు. అయితే తాము ఆందోళ‌న విర‌మించినట్లుగా వ‌చ్చిన వార్త‌ల‌ను సాక్షీ మాలిక్ ఖండించారు. త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేస్తున్న మీడియాపై ఆమె మండిపడ్డారు. తాము దీక్ష విరమించినట్లుగా మీడియా అదేపనిగా ప్రసారం చేయటాన్ని తప్పు పట్టారు.

తమకు పూర్తిన్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం ఆపేది లేదని, రైల్వే ఉద్యోగిగా బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించక తప్పదని ట్విట్టర్ ద్వారా వివరించింది.

తమ ఉద్యోగాలకు ముప్పు వచ్చినట్లుగా వచ్చిన వార్తలను సైతం రెజ్లర్లు కొట్టిపడేశారు.

తాము దీక్షను వీడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని భజరంగ్ పూనియా కోరాడు. మరో రెజ్లర్ వినేశ్ పోగట్ మాత్రం..

గూండాలు, రౌడీల ముందు మీడియా మోకరిల్లుతుందేమో కానీ..దేశానికి పతాకాలు సాధించి పెట్టే తమలాంటి రెజ్లర్లు మాత్రం కాదని స్పష్టం చేసింది.

జీవితం ముందు ఉద్యోగం ఎంత?

తమను లైంగికంగా వేధించి, తాము సాధించిన పతకాలకు 15 రూపాయల వెలకట్టిన కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, తాము న్యాయం జరిగే వరకూ పోరాడతామని, తమ ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడుతున్నామని..తమ ప్రాణాల ముందు ఉద్యోగాలు ఎంతని వినేశ్ పోగట్ నిలదీసింది. తాము ఉద్యోగాలు పోతాయన్న భయంతో దీక్ష విరమించినట్లుగా ఎందుకు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ నిలదీసింది.

First Published:  6 Jun 2023 7:03 AM GMT
Next Story