Telugu Global
Sports

ప్లీజ్.. కేరళలో కుక్కలను చంపడం ఆపండి.. క్రికెటర్ ధావన్ రిక్వెస్ట్

కేరళ రాష్ట్రంలో కొద్ది రోజులుగా వరుసబెట్టి కుక్కలను చంపేస్తుండటంపై క్రికెటర్ ధావన్ ఆందోళన వ్యక్తం చేశాడు. దయచేసి కుక్కల సంహారాన్ని ఆపాలని ఆయన ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.

ప్లీజ్.. కేరళలో కుక్కలను చంపడం ఆపండి.. క్రికెటర్ ధావన్ రిక్వెస్ట్
X

కేరళ రాష్ట్రంలో కొద్ది రోజులుగా వరుసబెట్టి కుక్కలను చంపేస్తుండటంపై క్రికెటర్ ధావన్ ఆందోళన వ్యక్తం చేశాడు. దయచేసి కుక్కల సంహారాన్ని ఆపాలని ఆయన ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. కేరళ రాష్ట్రంలో కుక్కల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఇటీవల అవి చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిపై పడి కరుస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రి పాలవుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకు అధికమవుతోంది.



కుక్కలను చంపడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఇదిలా ఉండగా ఆ రాష్ట్రంలోని చాలా గ్రామాల ప్రజలు తమ ఊర్లలో ఉన్న కుక్కలను చంపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేరళలో కుక్కల సంహారం పై జాతీయ మీడియాలో సైతం కథనాలు ప్రచురితమయ్యాయి. దీని గురించి తెలుసుకున్న క్రికెటర్ ధావన్ కేరళ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశాడు. దయచేసి కుక్కల సంహారాన్ని ఆపాలని కోరాడు.

' కేరళ లో పెద్ద సంఖ్యలో కుక్కలను చంపుతున్నారు. ఇది చాలా భయంకరంగా ఉంది. ప్రజలు ఈ విషయమై పునరాలోచన చేసి కుక్కల సంహారాన్ని ఆపివేయాలని కోరుతున్నా' అని ధావన్ ట్వీట్ చేశాడు. కేరళ లో కుక్కల సంహారం పై ధావన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ధావన్ చేసిన ట్వీట్ కి మిశ్రమ స్పందన వస్తోంది.

కొందరు ధావన్ కు మద్దతుగా నిలుస్తూ కుక్కలను చంపడం దారుణమని కామెంట్స్ చేస్తుండగా..మరికొందరు కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కుక్కల సంహారం సరైన నిర్ణయమే అని అంటున్నారు.

First Published:  17 Sep 2022 5:45 AM GMT
Next Story