Telugu Global
Sports

అమెరికా అవుట్, ప్రపంచకప్ క్వార్టర్స్ లో నెదర్లాండ్స్!

2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ చేరిన తొలిజట్టు ఘనతను నెదర్లాండ్స్ దక్కించుకొంది. నాకౌట్ రౌండ్ తొలిమ్యాచ్ లో అమెరికాను 3-1 గోల్స్ తో డచ్ జట్టు చిత్తు చేసింది.

అమెరికా అవుట్, ప్రపంచకప్ క్వార్టర్స్ లో నెదర్లాండ్స్!
X

2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ చేరిన తొలిజట్టు ఘనతను నెదర్లాండ్స్ దక్కించుకొంది. నాకౌట్ రౌండ్ తొలిమ్యాచ్ లో అమెరికాను 3-1 గోల్స్ తో డచ్ జట్టు చిత్తు చేసింది.

ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ కు నెదర్లాండ్స్ అలవోకగా చేరుకొంది. దోహాలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ తొలి నాకౌట్ సమరంలో..అమెరికాజట్టే బంతిని ఎక్కువసేపు తన అదుపులో ఉంచుకొన్నా..అవకాశాలు సృష్టించుకొని..వాటిని గోల్స్ గా మలచుకోడం ద్వారా నెదర్లాండ్స్ తిరుగులేని విజేతగా నిలిచింది.

ఆట మొదటి భాగంలో అమెరికా దూకుడు ప్రదర్శించినా గోల్ చేయటానికి వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మెంఫిస్ డీపే..డచ్ జట్టుకు తొలిగోలు అందించాడు. మొదటి భాగం మరికొద్ది క్షణాలలో ముగుస్తుందనగా డాలీ బ్లైండ్ నెదర్లాండ్స్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

డచ్ జట్టు కళాత్మక పాసింగ్ కు వేగాన్ని జోడించి అమెరికా డిఫెన్స్ ను కకావికలు చేస్తూ వచ్చింది. ఆట రెండో భాగం ప్రారంభంలోనే అమెరికా ఆటగాడు హజీ రైట్ తనజట్టు తరపున గోల్ సాధించడం ద్వారా నెదర్లాండ్స్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగాడు.

అమెరికా తన తొలిగోల్ సాధించిన 10 నిముషాల వ్యవధిలోనే డచ్ జట్టు ఎదురుదాడికి దిగింది. మొత్తం 20 పాస్ లతో సాగిన దాడితో డెంజిల్ డుమ్ ఫ్రైస్ చేసిన సూపర్ గోల్ తో నెదర్లాండ్స్ 3వ గోల్ నమోదు చేయగలిగింది.

ఆ తర్వాత అమెరికా ఎంతగా పోరాడినా ఫలితం లేకపోయింది. చివరకు నెదర్లాండ్స్ 3-1 గోల్స్ తో విజేతగా క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగింది.

అర్జెంటీనా- ఆస్ట్ర్రేలియాజట్ల ప్రీ-క్వార్టర్ ఫైనల్లో నెగ్గినజట్టుతో..సెమీస్ లో చోటు కోసం జరిగే పోరులో నెదర్లాండ్స్ పోటీపడనుంది.

First Published:  4 Dec 2022 5:30 AM GMT
Next Story