Telugu Global
Sports

మూడుమ్యాచ్ ల ముచ్చటగా రాయుడి సీపీఎల్ షో!

కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో అంబటి రాయుడి షో మూడుమ్యాచ్ ల ముచ్చటగా ముగిసింది. వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించాడు.

మూడుమ్యాచ్ ల ముచ్చటగా రాయుడి సీపీఎల్ షో!
X

కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో అంబటి రాయుడి షో మూడుమ్యాచ్ ల ముచ్చటగా ముగిసింది. వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించాడు.

తెలుగుతేజం అంబటి రాయుడు..భారత క్రికెట్ అభిమానులకు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల‌ క్రికెట్ అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరంలేని పేరు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో కీలక బ్యాటర్ గా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచిన 37 సంవత్సరాల రాయుడు 2023 సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.

రిటైర్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార పార్టీ తరపున చురుకుగా పాల్గొనాలని నిర్ణయించాడు.ఇందులో భాగంగా అమరావతి, పొన్నూరు ప్రాంతాలలో చురుకుగా పర్యటించాడు. అంతలోనే..విదేశీ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనాలని నిర్ణయించాడు.

కరీబియన్ ప్రీమియర్ లీగ్ బరిలో...

అమెరికా మేజర్ లీగ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు రాయుడు ఆడనున్నట్లుగా ప్రచారం జోరుగా సాగింది. అయితే ..రాయుడు మాత్రం ఎమ్మెల్సీని కాదని ..వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్వహించే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ )లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు ఆడాలని నిర్ణయించాడు.

2023 సీపీఎల్ టోర్నీ ద్వారా కరీబియన్ ప్రీమియర్ లీగ్ బరిలోకి దిగిన రాయుడు తన తొలి ఇన్నింగ్స్ లోనే డకౌట్ గా వెనుదిరిగాడు. రెండోమ్యాచ్ లో 32, మూడో మ్యాచ్ లో 15 పరుగుల స్కోర్లు మాత్రమే సాధించగలిగాడు.

117.50 స్ట్ర్రయిక్ రేట్ మాత్రమే సాధించిన రాయుడు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. మొత్తం మీద మూడుమ్యాచ్ ల్లో 47 పరుగులే సాధించి విఫలమయ్యాడు.

స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయిన రాయుడు పేట్రియాట్స్ జట్టు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. తాను వ్యక్తిగత కారణాలతో ఉపసంహరించుకొంటున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో రాయుడి అరంగేట్రం కేవలం మూడుమ్యాచ్ ల ముచ్చటగా ముగిసినట్లయ్యింది.

కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న భారత తొలి క్రికెటర్ ప్రవీణ్ తంబే కాగా..రెండో క్రికెటర్ అంబటి రాయుడు మాత్రమే కావడం విశేషం.

పేట్రియాట్స్ తరపున ఆడిన జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీ సైతం వ్యక్తిగత కారణాలతోనే జట్టు నుంచి ఉపసంహరించుకోడం చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి..పేట్రియాట్స్ కు దక్షిణాఫ్రికా యువబ్యాటర్ ట్రిస్టాన్ స్టబ్స్ ఆడాల్సి ఉంది. స్టబ్స్ తమతో కాంట్రాక్టు రద్దు చేసుకోడంతో ఆ స్థానాన్ని అంబటి రాయుడితో భర్తీ చేసినా ప్రయోజనం లేకపోయింది.

రాయుడు కేవలం మూడు ఇన్నింగ్స్ మాత్రమే ఆడి జట్టు నుంచి తప్పుకోడంతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ టీమ్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో తలమనుకలై ఉంది.

38 ఏళ్ల తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. 2010 నుంచి 2023 సీజన్ల వరకూ ఐపీఎల్‌ లో ముంబై, చెన్నైజట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 14 సీజన్లలో 204 మ్యాచ్‌లాడి 5 ట్రోఫీలు చేజిక్కించుకున్నాడు. రికార్డుస్థాయిలో 11 ప్లే ఆఫ్స్, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలతో అత్యంత విజయవంతమైన ఐపీఎల్ బ్యాటర్ గా నిలిచాడు.

భారతజట్టు తరఫున 55 వన్డేలు మాత్రమే ఆడిన రాయుడు మొత్తం 1694 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 10 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.

First Published:  1 Sep 2023 2:25 AM GMT
Next Story