Telugu Global
Sports

ఆ ముగ్గురు మినహా అందరూ ఆడితీరాల్సిందే..బీసీసీఐ హుకుం!

ఐపీఎల్ మోజులో పడి దేశవాళీ క్రికెట్ ను పట్టించుకోని స్టార్ క్రికెటర్లపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. ముగ్గురు దిగ్గజాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

ఆ ముగ్గురు మినహా అందరూ ఆడితీరాల్సిందే..బీసీసీఐ హుకుం!
X

ఐపీఎల్ మోజులో పడి దేశవాళీ క్రికెట్ ను పట్టించుకోని స్టార్ క్రికెటర్లపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. ముగ్గురు దిగ్గజాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

ఐపీఎల్ లో కేవలం కొద్దివారాలలో మాత్రమే ఆడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ దేశవాళీ క్రికెట్ ను చిన్నచూపు చూస్తున్న స్టార్ క్రికెటర్లకు బీసీసీఐ కార్యదర్శి జే షా హుకుం జారీ చేశారు. కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు తేల్చి చెప్పారు.

భారత క్రికెట్ జట్టు సరికొత్త కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నుంచి పగ్గాలు అందుకొన్న గౌతం గంభీర్ వచ్చీరావడంతోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకొంటూ క్రికెటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ప్రతిభావంతులైన ఆటగాళ్లంతా కేవలం ఒక్క ఫార్మాట్ కే పరిమితం కాకుండా..మూడు ఫార్మాట్లలోనూ ఆడితీరాల్సిందేనంటూ గంభీర్ ఇప్పటికే బాంబు పేల్చారు. అదీ చాలదన్నట్లుగా అరకొర ఫిట్ నెస్ తో ఉన్న హార్థిక్ పాండ్యాను పక్కన పెట్టి భారత టీ-20 జట్టుకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను నియమించడం ద్వారా మరో బాంబు పేల్చారు.

టెస్టుజట్టులో చోటు దక్కాలంటే?

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా త్వరలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో జరిగే సిరీస్ ల్లో పాల్గొనాలంటే భారత స్టార్ క్రికెటర్లంతా విధిగా దేశవాళీ క్రికెట్ ( దులీప్ ట్రోఫీ) టోర్నీలలో పాల్గొని తీరాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి ద్వారా చీఫ్ కోచ్ గంభీర్ హుకుం జారీ చేయించారు.

అయితే..కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు మినహా మిగిలిన ప్రధాన ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లు ఆడితీరక తప్పదని, దేశవాళీ మ్యాచ్ లు ఆడిన వారిని మాత్రమే టెస్టు సిరీస్ జట్ల ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకొంటారని జే షా స్పష్టం చేశారు. భారత టెస్టుజట్టులో చోటు కావాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడితీరక తప్పదని తెలిపారు.

అందుకే ఆ ముగ్గురికి మినహాయింపు...

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ విజయంతో టీ-20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, విరాట్ లతో పాటు ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు త్వరలో జరిగే 2025 ఐసీసీ మినీ ప్రపంచకప్, 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలు కీలకం కావడంతో దేశవాళీ క్రికెట్ టోర్నీలలో పాల్గొనకుండా మినహాయింపు ఇచ్చినట్లు బీసీసీఐ వివరించింది.

విరామం దొరికితే..విరాట్, రోహిత్, బుమ్రా కావాలనుకొంటే దేశవాళీ క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నా తమకు అభ్యంతరం లేదని బోర్డు కార్యదర్శి తెలిపారు.

మిగిలిన టెస్టు క్రికెట్ స్పెషలిస్టు స్టార్లంతా దులీప్ ట్రోఫీ టోర్నీలో పాల్గొనటం తప్పనిసరని వివరించారు.

టెస్టు క్రికెటర్లకు భారీగా ప్రోత్సాహకాలు...

ఏటా రెండుమాసాలపాటు సాగే ఐపీఎల్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న క్రికెటర్లకు సాంప్రదాయ టెస్టుమ్యాచ్ ల్లో పాల్గొనడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది.

క్రికెట్లో మూడు విభాగాలు ( టెస్టు, వన్డే, టీ-20 ) ఉన్నా...సాంప్రదాయ టెస్టు క్రికెట్ ను మాత్రమే అసలుసిసలు క్రికెట్ గా పరిగణిస్తారు. రోజుకు 90 ఓవర్ల చొప్పున ఐదురోజులపాటు సాగే టెస్టుమ్యాచ్ ల్లో రాణించాలంటే నేర్పు, ఓర్పుతో పాటు అంకితభావం, అంతులేని శారీరక శ్రమను ఓర్చుకొనే సత్తా ఉండి తీరాలి. అయితే..ఐపీఎల్ పుణ్యమా అంటూ అధికభాగం క్రికెటర్లు నాలుగు ఓవర్ల బౌలింగ్, 20 ఓవర్ల మ్యాచ్ ల్లో పాల్గొనటానికే ప్రాధాన్యమిస్తున్నారు. టెస్టు క్రికెట్లో పాల్గొనటానికి ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించడంలేదు.

కేవలం 8 వారాల క్రికెట్లోనే కోట్ల రూపాయలు సంపాదించే ఉపాయంగా టీ-20 లీగ్ లను నేటితరం క్రికెటర్లు పరిగణించే స్థితి దాపురించింది. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రపంచంలోనే భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు నడుం బిగించింది. టెస్టు క్రికెట్ ఆడే క్రికెటర్లకు భారీగా ప్రోత్సాహం అందించడానికి..2022-23 సీజన్ నుంచి' టెస్టు క్రికెట్ ప్రోత్సాహక పథకాన్ని' ప్రవేశ పెట్టింది.

టెస్టుమ్యాచ్ కు 60 లక్షలు.....

ధూమ్ ధామ్ టీ-20 తుపానులో సాంప్రదాయ టెస్టు క్రికెట్ కొట్టుకుపోకుండా బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టింది. టెస్టుమ్యాచ్ లు ఆడే ఆటగాళ్ల కోసం ' టెస్టు క్రికెట్ ప్రోత్సాహక పథకాన్ని' పెట్టినట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.

టెస్టుమ్యాచ్ లు ఆడటానికి ఆసక్తి చూపడంతో పాటు... ప్రాధాన్యమిచ్చే ఆటగాళ్లకు 2022-23 సీజన్ నుంచి ఆడిన ఒక్కో టెస్టుకు 45 లక్షల రూపాయల వంతున అదనంగా చెల్లించనున్నట్లు బోర్డు ప్రకటించింది.

ఇప్పటి వరకూ ఆడిన ఒక్కో టెస్టుమ్యాచ్ కు 15 లక్షల రూపాయలు మాత్రమే మ్యాచ్ ఫీజుగా బీసీసీఐ అందచేస్తూ వచ్చింది.

ఏడాదికి 4 కోట్ల 50 లక్షల రూపాయలు....

భారతజట్టు ఓ సీజన్లో ఆడే మొత్తం 10 టెస్టుమ్యాచ్ ల్లో 75 శాతం మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు ఏడాదికి 4 కోట్ల 50 లక్షల రూపాయలు చొప్పున చెల్లిస్తారు. మ్యాచ్ కు 15 లక్షల మ్యాచ్ ఫీజుతో పాటు ప్రోత్సాహకంగా 45 లక్షల రూపాయలు అదనంగా అందచేయనున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జడేజా, బుమ్రా, అశ్విన్, పూజారా, ఉమేశ్ యాదవ్ లాంటి ఆటగాళ్లు 2022-23 సీజన్ నుంచి 4 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున అందుకోనున్నారు.

భారత్ ఆడే మొత్తం టెస్టుమ్యాచ్ ల్లో పాల్గొనే ప్లేయర్లకు మ్యాచ్ ఫీజు కోటీ 50 లక్షలరూపాయలతో పాటు 4 కోట్ల 50 లక్షల రూపాయలు వంతున ప్రోత్సాహకంగా అందచేస్తారు.

సీజన్ కు 45 కోట్ల బడ్జెట్....

టెస్టు క్రికెటర్ల ప్రోత్సాహక పథకం కోసం బీసీసీఐ సీజన్ కు 45 కోట్ల రూపాయలు అదనంగా నిధులు కేటాయించింది. 2023-24 సీజన్ కు సైతం ఈ పథకాన్ని వర్తింప చేస్తారు.

భారత అగ్రశ్రేణి క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జడేజా, బుమ్రా వార్షిక కాంట్రాక్టు కింద ప్రస్తుతం ఏడాదికి 7 కోట్ల రూపాయలు చొప్పున గ్యారెంటీమనీగా అందచేస్తూ వస్తోంది. దీనికి అదనంగా టెస్టు క్రికెటర్ల ప్రోత్సాహక పథకం కింద మ్యాచ్ ఫీజుతో కలుపుకొని మరో 6 కోట్ల రూపాయలు చొప్పున చెల్లిస్తారు. అంటే..ఐపీఎల్ కాంట్రాక్టుల ప్రమేయం లేకుండా సీజన్ కు 13 కోట్ల రూపాయలు అగ్రశ్రేణి ఆటగాళ్లకు దక్కనున్నాయి.

2023-24 సీజన్లో భారత్ ఆడిన మొత్తం 10 టెస్టుల్లో పాల్గొన్న రోహిత్ శర్మ 13 కోట్ల రూపాయలు అందుకోనున్నాడు. కేవలం టెస్టు క్రికెట్ ఆడటం ద్వారానే 6 కోట్ల రూపాయలు అందుకొనేలా బీసీసీఐ చర్యలు చేపట్టింది.

సీజన్ కు 5 నుంచి 6 టెస్టు మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు కోటీ 80 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం కేవలం భారత పురుషుల టెస్టు జట్టుకు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక క్రికెట్ బోర్డు బీసీసీఐ మాత్రమే. మొత్తంమీద టెస్టు క్రికెటర్ల రొట్టె విరిగి నేతిలో పడిందనే చెప్పాలి.

దేశవాళీ క్రికెట్లో రోజుకు 50 వేలు.....

దేశవాళీ ( రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ తో సహా ) క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొనే క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను సైతం బీసీసీఐ భారీగా పెంచింది. క్రికెట్ నే వృత్తిగా చేసుకొని జీవించే ఆటగాళ్లు గౌరవంగా బతకటానికి ఏడాదికి 25 లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజుగా సంపాదించుకొనే అవకాశం కల్పించింది.

దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఏదైనా ఆడిన ఆటగాడికి రోజుకు 50వేల రూపాయల చొప్పున చెల్లించనున్నారు.

First Published:  18 July 2024 4:00 AM GMT
Next Story