Telugu Global
Sports

అక్షర్, సూర్య పోరాటం వృథా, భారత్ ఓటమి!

భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. పూణేవేదిక జరిగిన డూ ఆర్ డై పోరులో ఆసియా చాంపియన్ శ్రీలంక 16 పరుగులతో భారత్ వరుస విజయాలకు బ్రేక్ వేసింది

అక్షర్, సూర్య పోరాటం వృథా, భారత్ ఓటమి!
X

భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. పూణేవేదిక జరిగిన డూ ఆర్ డై పోరులో ఆసియా చాంపియన్ శ్రీలంక 16 పరుగులతో భారత్ వరుస విజయాలకు బ్రేక్ వేసింది....

కొత్త సంవత్సరంలో హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని భారతజట్టు టీ-20ల్లో తొలి ఓటమి చవిచూసింది. ఆసియా చాంపియన్ శ్రీలంకతో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి రెండుజట్లూ 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి.

ముంబై వేదికగా ముగిసిన తొలిపోరులో ఆతిథ్య భారత్ 2 పరుగుల తేడాతో నెగ్గితే..పూణే వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.

తేలిపోయిన భారత బౌలర్లు...

బ్యాటర్ల స్వర్గధామం మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన హైస్కోరింగ్ పోరులో...టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం ద్వారా భారత్ భారీమూల్యమే చెల్లించింది.

బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్లు కుశల్ మెండిస్- నిస్సంకా మొదటి వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

నిస్సంకా 33, కుశల్ మెండిస్ 52, అసలంక 37 పరుగులు చేయగా..మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ దసున్ షనక 22 బంతుల్లో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 2 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 56 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. భారత యువఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ వరుసగా మూడు నోబాల్స్ తో చెత్త రికార్డు మూటగట్టుకొన్నాడు. రెండు ఓవర్లలో 37 పరుగులిచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2, చాహల్ 1 వికెట్ పడగొట్టారు. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు తేలిపోడంతో శ్రీలంక 206 పరుగుల భారీస్కోరుతో సవాలు విసిరింది.

భారత్ టాపార్డర్ టపటపా...!

207 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ 57 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 2, శుభ్ మన్ గిల్ 5, అరంగేట్రం ఆటగాడు రాహుల్ త్రిపాఠీ 5, కెప్టెన్ పాండ్యా 12, ఆల్ రౌండర్ దీపక్ హుడా 9 పరుగులకు అవుట్ కావడంతో భారత్ మరో కోలుకోలేకపోయింది. భారీ ఓటమి తప్పదనుకొన్న తరుణంలో..వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 6వ వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యంతో గెలుపు ఆశల్ని చిగురింప చేశారు.

సూర్య 36 బాల్స్ లో 51, అక్షర్ పటేల్ 31 బాల్స్ లో 65 పరుగులతో లంకబౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. 3 బౌండ్రీలు, 3 సిక్సర్లతో సూర్యకుమార్ ఆట 16వ ఓవర్లో అవుటయ్యాడు.

ఆ తర్వాత భారత గెలుపు బాధ్యతని అక్షర్- శివమ్ మావీ తీసుకొన్నారు. శివమ్ 15 బంతుల్లో 26 పరుగులతో అండగా నిలిచాడు. మరోవైపు..అక్షర్ పటేల్ 3 బౌండ్రీలు, 6 సిక్సర్లతో శివమెత్తిపోయాడు. 14వ ఓవర్లో వనిందు హసరంగ బౌలింగ్ లో అక్షర్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం ద్వారా స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఆట ఆఖరి ఓవర్లో మ్యాచ్ నెగ్గాలంటే 21 పరుగులు చేయాల్సిన భారత్ 3వ బంతికే అక్షర్ వికెట్ కోల్పోడంతో 16 పరుగుల పరాజయం తప్పలేదు.

శ్రీలంక బౌలర్లలో మధుశంక, రజత. షనక తలో 2 వికెట్లు పడగొట్టారు.

13 మ్యాచ్ ల్లో శ్రీలంక తొలిగెలుపు...

భారతగడ్డపై శ్రీలంకజట్టుకు ఆడిన గత 13 టీ-20 మ్యాచ్ ల్లో ఇదే తొలిగెలుపు కావడం విశేషం. 2016లో పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియంలో చివరిసారిగా నెగ్గిన శ్రీలంక ఆ తరువాత వరుసగా 12 మ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూసింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలలో అద్భుతంగా రాణించిన శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని నిర్ణయాత్మక ఆఖరి టీ-20 రాజ్ కోట్..సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం వేదికగా జనవరి 7న జరుగనుంది.

First Published:  6 Jan 2023 6:05 AM GMT
Next Story