Telugu Global
Sports

భారత క్రికెట్ 'ట్రబుల్ షూటర్' అజింక్యా రహానే!

భారత టెస్టుజట్టు కష్టాలలో ఉన్న ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆదుకొనే మొనగాడు అజింక్యా రహానే 5వేల పరుగుల క్లబ్ లో చేరాడు. ఓవల్ టెస్టులో భారత్ ను ఫాలోఆన్ ఉచ్చు నుంచి తప్పించాడు.

భారత క్రికెట్  ట్రబుల్ షూటర్ అజింక్యా రహానే!
X

భారత క్రికెట్ 'ట్రబుల్ షూటర్' అజింక్యా రహానే!

భారత టెస్టుజట్టు కష్టాలలో ఉన్న ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆదుకొనే మొనగాడు అజింక్యా రహానే 5వేల పరుగుల క్లబ్ లో చేరాడు. ఓవల్ టెస్టులో భారత్ ను ఫాలోఆన్ ఉచ్చు నుంచి తప్పించాడు......

2023 ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్లో భారత సూపర్ స్టార్లంతా చేతులెత్తేస్తే...పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన తనజట్టును మాజీ కెప్టెన్, ట్రబుల్ షూటర్ అజింక్యా రహానే..తన ఫైటింగ్ బ్యాటింగ్ తో ఆదుకొన్నాడు. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తో కలసి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయటం ద్వారా భారత్ ను ఫాలోఆన్ ఉచ్చు నుంచి విజయవంతంగా తప్పించగలిగాడు.

18 మాసాల తర్వాత తొలిటెస్టు...

కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి పలువురు కీలక మిడిలార్డర్ బ్యాటర్లు గాయాలతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో..వెటరన్ రహానేకు టెస్టు లీగ్ ఫైనల్లో పాల్గొనే భారతజట్టులో చోటు కల్పించారు.

యువబ్యాటర్ల వైపు మొగ్గు చూపుతూ ..రహానేను పక్కన పెట్టిన టీమ్ మేనేజ్ మెంట్..గతిలేని పరిస్థితిలోనే రహానేను తిరిగి జట్టులో చేర్చుకోవాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తనపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఓవల్ టెస్టులో రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు పరువు దక్కించాడు.

ఓపెనర్లు రోహిత్ శర్మ 15, శుభ్ మన్ గిల్ 13, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా14, పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ 14 పరుగుల స్కోర్లకే వెనుదిరగడంతో..మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగిన రహానే..జట్టు బాధ్యతను తనపైనే వేసుకొన్నాడు. 152 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన తనజట్టుకు ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తో కలసి 7వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా ఫాలోఆన్ ప్రమాదం తప్పించాడు.

నిప్పులుచెరిగే బౌలింగ్ తో చెలరేగిపోతున్న కంగారూ ఫాస్ట్ బౌలర్లకు తన అనుభవానికి పోరాటపటిమను జోడించడం ద్వారా నిలువరించాడు. శార్దూల్ తో జంటగా కీలక సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్లు సంధించిన షార్ట్ పిచ్ బంతులకు తన చేతివేళ్లకు గాయమైనా మొండిగానే తన పోరాటం కొనసాగించాడు. మొత్తం 129 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఓ భారీసిక్సర్ తో 89 పరుగులు చేసి..సెంచరీకి 11 పరుగుల దూరంలో అవుటయ్యాడు.

కేవలం రహానే- శార్దూల్ ఠాకూర్ పోరాటం కారణంగానే భారత్ తొలిఇన్నింగ్స్ లో 269 పరుగుల ఫాలోఆన్ లక్ష్యం చేరటమే కాదు..296 పరుగుల స్కోరు సైతం సాధించగలిగింది.

ఇదే మొదటిసారి కాదు......

తనజట్టు కష్టాలలో ఉన్న ప్రతిసారీ ట్రబుల్ షూటర్ గా బాధ్యతలు నిర్వర్తించడం రహానేకి ఇదే మొదటిసారి కాదు. తన కెరియర్ లో సాధించిన 12 సెంచరీలలో అధికభాగం..భారతజట్టు కష్టాలలో కూరుకుపోయిన తరుణంలో సాధించినవేకావడం విశేషం.

2013 డర్బన్ టెస్టు, 2014 వెలింగ్టన్ టెస్టు, 2014 లార్డ్స్ టెస్టు, 2017 బెంగళూరు టెస్టు, 2018 జోహెన్స్ బర్గ్ టెస్టు వేదికలుగా జరిగిన మ్యాచ్ ల్లో భారతజట్టును కష్టాల నుంచి పడవేసిన ఘనత, రికార్డు రహానేకు మాత్రమే ఉంది.

స్వదేశీ సిరీస్ ల కంటే విదేశీ సిరీస్ ల్లోనే అత్యుత్తమంగా రాణించిన ఘనత రహానేకు మాత్రమే సొంతం. విదేశీ సిరీస్ ల్లో రహనే సగటు 41.17గా ఉంటే..స్వదేశీ గడ్డపై ఆడిన టెస్టుల్లో మాత్రం 35.73గా ఉంది.

గత రెండేళ్లుగా వైఫల్యాలు...

గత రెండేళ్ల కాలంలో రహానే భారత 5వ డౌన్ లో బ్యాటింగ్ కు దిగి 13 టెస్టుల్లో 22.60 సగటు సాధించడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక రహానే కెరియర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. అయితే దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లతో పాటు ఐపీఎల్-16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సైతం నిలకడగా రాణించడం ద్వారా..తిరిగి భారతజట్టులో చోటు సంపాదించడమే కాదు..మిడిలార్డర్లో తిరిగి తన చోటును నిలుపుకోగలిగాడు.

ఫామ్ ఈజ్ టెంపరరీ..క్లాస్ ఈజ్ పెర్మనెంట్ అన్నమాట 36 సంవత్సరాల అజింకా రహానేకి అతికినట్లు సరిపోతుంది.

First Published:  10 Jun 2023 7:00 AM GMT
Next Story