Telugu Global
Sports

కొడుకు క్రికెట్లో....తండ్రి సినీఫీల్డ్ లో....!

తండ్రితనయులు వేర్వేరు రంగాలలోఅత్యుత్తమంగా రాణించగలరని విదు వినోద్ చోప్రా, అగ్ని చోప్రా నిరూపించారు.

కొడుకు క్రికెట్లో....తండ్రి సినీఫీల్డ్ లో....!
X

తండ్రితనయులు వేర్వేరు రంగాలలోఅత్యుత్తమంగా రాణించగలరని విదు వినోద్ చోప్రా, అగ్ని చోప్రా నిరూపించారు.

విదు వినోద్ చోప్రా...ప్రపంచ సినీఅభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేనిపేరు. ఇటీవలే బాలీవుడ్ లో విడుదలై రికార్డుల మోత మోగిస్తున్న సంచలన సినిమా ' '12th Fail' దర్శకుడి కుమారుడు అగ్ని చోప్రా క్రికెట్ ఫీల్డ్ లో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు.

తండ్రి సినీరంగంలో....

మనసును తాకే సినిమాలు రూపొందించడంలో విదు వినోద్ చోప్రా ఇప్పటికే తనకు తానే సాటిగా నిలిచారు. తక్కువ బడ్జెట్ తో చిన్నసినిమాలను పెద్దహిట్ గా నిలిపే సృజనాత్మక దర్శకుడిగా పేరు సంపాదించారు.

విదు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన '12th Fail' సినిమా 2023 సంవత్సరానికే సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలకు అందని రీతిలో తన సినిమా హిట్ కావడంతో ప్రస్తుతం విదు వినోద్ చోప్రా విజయోత్సాహంతో సంబరాలు జరుపుకొంటున్నారు.

తండ్రికి తగ్గ తనయుడిగా....

మరోవైపు...2023-24 సీజన్ రంజీట్రోఫీలో మిజోరం జట్టు సభ్యుడిగా అరంగేట్రం చేసిన విదు వినోద్ చోప్రా కుమారుడు అగ్నిచోప్రా తన తొలిమ్యాచ్ లోనే 258 పరుగులు సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.

రంజీట్రోఫీ ప్లేటు గ్రూప్ లీగ్ లో భాగంగా జనవరి 5 నుంచి 8 వరకూ నడియాడ్ వేదికగా సిక్కింతో జరిగిన తొలిపోటీ ద్వారా అగ్నిచోప్రా తన రంజీ కెరియర్ మొదలు పెట్టాడు.

25 సంవత్సరాల అగ్ని చోప్రా 179 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 166 పరుగులతో సూపర్ సెంచరీ సాధించాడు. భారత దేశవాళీ క్రికెట్లో తన తొలిశతకాన్ని మిజోరం తరపున నమోదు చేయగలిగాడు.

మిజోరం జట్టులోని మరో ఆరుగురు బ్యాటర్లు డకౌట్లు కాగా..ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగలిగారు. అగ్ని చోప్రా మాత్రమే ఒంటరిపోరాటం చేసి కళ్లు చెదిరే సెంచరీ సాధించగలిగాడు. ఫాలోఆన్ ఆడిన తమజట్టు రెండో ఇన్నింగ్స్ లో సైతం అగ్ని 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అగ్నిచోప్రా తుదివరకూ పోరాడినా సిక్కిం చేతిలో మిజోరం జట్టుకు 4 వికెట్ల పరాజయం తప్పలేదు.

అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో జన్మించి భారత దేశవాళీ క్రికెట్లో మిజోరం జట్టుకు ఆడుతున్న అగ్నిచోప్రా లిస్ట్ - ఏ మ్యాచ్ ల్లో సైతం రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

జమ్ము-కాశ్మీర్ జట్టుతో జరిగిన టీ-20 మ్యాచ్ లో అగ్నిచోప్రా 76 పరుగుల స్కోరు సాధించడం ద్వారా సత్తా చాటుకొన్నాడు.

విదు వినోద్ 'డబుల్ హ్యాపీ'....

తాను దర్శకత్వం వహించిన '12th Fail' సినిమా సక్సెస్ తో పొంగిపోతున్న విదు వినోద్..క్రికెట్ ఫీల్డ్ లో తన తనయుడు అగ్ని సాధించిన విజయాలను చూసి మురిసిపోతున్నాడు. స్వతహాగా క్రికెట్ ను విపరీతంగా అభిమానించే విదు వినోద్ చోప్రా ప్రస్తుతం పుత్రోత్సాహంతో గాల్లో తేలిపోతున్నాడు.

సినీరంగంలో తండ్రి, క్రికెట్ ఫీల్డ్ లో కొడుకు సూపర్ హిట్ గా నిలవడం అరుదైన విషయమే మరి.

First Published:  12 Jan 2024 5:10 AM GMT
Next Story