Telugu Global
Sports

11ఏళ్ల నిరీక్షణతో సూర్యాకు భారతజట్టులో చోటు!

ముంబై స్కూల్ ఆఫ్ క్రికెట్ నుంచి జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన 31 సంవత్సరాల సూర్యకుమార్ యాదవ్ కు రాత్రికి రాత్రే భారతజట్టులో చోటు దక్కలేదు. సూర్య వెనుక గాడ్ ఫాదర్లు అసలే లేరు.

Suryakumar Yadav
X

సూర్యకుమార్ యాదవ్

అదృష్టం అందరికీ ఒకేతీరుగా ఉండదనటానికి టీ-20 సంచలనం సూర్యకుమార్ యాదవే నిదర్శనం. అపారప్రతిభ ఉన్నా, ఏళ్ల తరబడి నిలకడగా రాణించినా భారతజట్టులో చోటు కోసం దశాబ్దకాలంపాటు నిరీక్షించాల్సి వచ్చింది....

సూర్యకుమార్ యాదవ్...ప్రస్తుతం ప్రపంచ టీ-20 క్రికెట్లో మార్మోగిపోతున్న పేరు. మిస్టర్ టీ-20, స్కై.. మిస్టర్ 360, స్కూప్ స్టార్ లాంటి ముద్దుపేర్లతో సూర్యాను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తుంటే...క్రికెట్ విమర్శకులు, దిగ్గజాలు, వ్యాఖ్యాతలు మాత్రం గృహాంతరవాసి అంటూ, సూర్య కొట్టే షాట్లు మనుషులు ఆడే షాట్లు కావంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు..కేవలం 25 బాల్స్ లోనే సుడిగాలి హాఫ్ సెంచరీలతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేస్తున్న సూర్యాను ఎలాపడగొట్టాలో అర్ధంకాక ప్రత్యర్థిజట్ల కెప్టెన్లు, కోచ్ లు తలలు పట్టుకొంటున్నారు.

ఆలస్యంగా తలుపు తట్టిన అదృష్టం..

ముంబై స్కూల్ ఆఫ్ క్రికెట్ నుంచి జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన 31 సంవత్సరాల సూర్యకుమార్ యాదవ్ కు రాత్రికి రాత్రే భారతజట్టులో చోటు దక్కలేదు. సూర్య వెనుక గాడ్ ఫాదర్లు అసలే లేరు. కేవలం ప్రతిభనే నమ్ముకొని, నిరంతర సాధనతో నిలకడగా రాణించడం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్నాడు.

అత్యున్నత ప్రమాణాలకు మరో పేరైన ముంబై క్రికెట్ నుంచి వచ్చిన సూర్యకుమార్ 20 సంవత్సరాల వయసులో తన కెరియర్ ను మొదలుపెట్టాడు. జాతీయస్థాయి పోటీలలో ముంబైజట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ 2011 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.

2011 ఐపీఎల్ సీజన్లో కనీస ధర 10 లక్షల రూపాయల కాంట్రాక్టుపై ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. తుదిజట్టులో తగిన అవకాశాలు దక్కకపోడంతో 2014 సీజన్లో కోల్ కతా ఫ్రాంచైజీలో చేరాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆ తర్వాతి మూడుసీజన్లలో 54 మ్యాచ్ ల్లో.. పలు కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాటు మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత 2018 సీజన్ వేలం ద్వారా 8 కోట్ల రూపాయల ధరకు ముంబై ఫ్రాంచైజీ తిరిగి సూర్యుకమార్ ను దక్కించుకొంది.

ముంబై తురుపుముక్క సూర్యకుమార్...

2018 సీజన్ నుంచి ముంబైజట్టు కీలక ఆటగాడిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర వహించాడు.

2018 ఐపీఎల్ సీజన్లో 512 పరుగులు, 2019లో 424 పరుగులు, 2020లో 480 పరుగులు సాధించినా సూర్యకుమార్ ను భారత సెలెక్టర్లు ఏమాత్రం కరుణించలేదు.

అయితే..2022 టీ-20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని భారత టీమ్ మేనేజ్ మెంట్ పలువురు యువఆటగాళ్లకు, ప్రతిభావంతులైనవారికి జట్టులో చోటు కల్పించింది.

భారతజట్టులో చోటు కోసం 11 సంవత్సరాలపాటు నిరీక్షించిన సూర్యకుమార్ కు 31 సంవత్సరాల వయసులో అవకాశం దక్కింది.

భారత్- ఏ జట్టు తరపున పలు మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ 2021 సీజన్లో భారత సీనియర్ జట్టులో చేరాడు. ఆ తరువాత నుంచి సూర్య మరివెనుదిరిగి చూసింది లేదు.

భారతజట్టు తరపున తన అరంగేట్రం మ్యాచ్ నుంచి ప్రస్తుత ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ వరకూ ఆడిన 38 మ్యాచ్ ల్లో సూర్యకుమార్ 1209 పరుగులు సాధించడంతో పాటు 177 స్ట్ర్రయిక్ రేట్ తో వారేవ్వా అనిపించుకొన్నాడు.

భారత టీ-20 జట్టులో రెండోడౌన్ స్థానాన్ని సొంతం చేసుకోడంతో పాటు పదిలపరచుకొన్న సూర్య ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ మొదటి ఐదుమ్యాచ్ ల్లోనే మూడు మెరుపు హాఫ్ సెంచరీలతోపాటు 225 పరుగులు సాధించాడు.

పెర్త్ ఫాస్ట్ , బౌన్సీ పిచ్ పై దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ -12 రౌండ్ పోరులో భారత టాపార్డర్ లోని దిగ్గజాలంతా పిల్లిమొగ్గలు వేస్తే..సూర్య మాత్రం తన అసాధారణ బ్యాటింగ్ తో 68 పరుగుల స్కోరు సాధించాడు. టీ-20 క్రికెట్ చరిత్రలోనే సూర్య ఇన్నింగ్స్ ఓ అసాధారణ ఇన్నింగ్స్ గా మిగిలిపోతుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

భారత క్రికెట్లోని కొందరు నవతరం ఆటగాళ్లకు ఏమాత్రం ఎదురుచూడకుండానే భారతజట్టులో చోటు దక్కుతుంటే...సూర్యకుమార్ యాదవ్ లాంటి అసాధారణ, అపురూప బ్యాటర్ 11 సంవత్సరాలపాటు ఎనలేని ఓర్పుతో ఎదురుచూడాల్సి రావడం ఆశ్చర్యమే మరి.

First Published:  10 Nov 2022 6:21 AM GMT
Next Story