Telugu Global
Sports

అదానీ, అంబానీల టీ-20 వ్యాపారం!

జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇప్పటికే పలు రకాల వ్యాపారాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న‌ అదానీ, అంబానీలు చివరకు పెద్దమనుషుల క్రీడ క్రికెట్‌కు సైతం గురిపెట్టారు. టీ-20 లీగ్‌ల ద్వారా క్రికెట్ వ్యాపారానికి నడుం బిగించారు.

అదానీ, అంబానీల టీ-20 వ్యాపారం!
X

దేశంలోని పలు రకాల వ్యాపారాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న‌ బడాబాబులు, కేంద్ర ప్రభుత్వానికి ప్రియమిత్రులు అదానీ, అంబానీల కన్ను చివరకు క్రికెట్‌పైనా పడింది. ఐపీఎల్ ద్వారా మాత్రమే కాదు..దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లీగ్‌లతో పాటు లెజెండ్రీ లీగ్‌లోనూ ఘరానా వ్యాపారానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వ్యాపారానికి కాదేదీ అనర్హమన్న మాటను దేశంలోని బడాబాబులు, ఘరానా వ్యాపారవేత్తలు అంబానీ, అదానీ మాత్రమే కాదు...చివరకు జీఎమ్మార్ గ్రూప్‌లు సైతం నిజం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇప్పటికే పలు రకాల వ్యాపారాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న‌ అదానీ, అంబానీలు చివరకు పెద్దమనుషుల క్రీడ క్రికెట్‌కు సైతం గురిపెట్టారు. టీ-20 లీగ్‌ల ద్వారా క్రికెట్ వ్యాపారానికి నడుం బిగించారు. క్రీడలకు తమవంతుగా అండగా ఉంటామంటూ ఘరానా ప్రకటనలు చేస్తూ వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో టీ-20 లీగ్‌ల ద్వారా క్రికెట్ వ్యాపారం చేస్తూ ప్రచారానికి ప్ర‌చారం, లాభాలకు లాభాలు సంపాదిస్తున్నారు.

ఐపీఎల్‌తో షురూ...

దేశంలో హాకీలాంటి ఎన్నో రకాల క్రీడలున్నా..వేల కోట్ల రూపాయల ఆదాయంతో అలరారుతున్న క్రికెట్ కు తమ వంతుగా సాయం అందిస్తామంటూ ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, జీఎమ్మార్ గ్రూపులు ముందుకొచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్‌గా ముకేశ్ అంబానీ గ్రూపు ఉంటే..ఢిల్లీ క్యాపిటల్స్ కు జీఎమ్మార్ గ్రూపు కో-ఓనర్‌గా వ్యవహరిస్తోంది. అదీ చాలదన్నట్లు...యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ సంఘం నిర్వహించే ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించ తలపెట్టిన గ్లోబల్ టీ-20 లీగ్, రిటైరైన దిగ్గజ క్రికెటర్లతో నిర్వహించే లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో ప్రవేశించాయి.

ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఓనర్‌గా, అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా ఉన్న అంబానీ స్పోర్ట్స్ గ్రూపు..దక్షిణాప్రికా, ఎమిరేట్స్ క్రికెట్ లీగ్ ల్లో జట్లను సమకూర్చుకుంది. అదానీ గ్రూపు...దక్షిణాఫ్రికా లీగ్‌లో ఓ ఫ్రాంచైజీ హక్కులతో పాటు లెజెండ్స్ లీగ్‌లో రెండు జట్లను కొనుగోలు చేసింది. మరోవైపు..జీఎమ్మార్ గ్రూపు సైతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు...దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ లో కేప్ టౌన్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు సంపాదించింది.

లెజెండ్స్ లీగ్...

క్రికెటర్లుగా కోట్ల రూపాయలు సంపాదించి...హాయిగా రిటైర్మెంట్ జీవితం అనుభవిస్తున్న సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, విదేశాలకు చెందిన గ్లెన్ మెక్ గ్రాత్, టామ్ మూడీ, మార్క్ వా, స్టీవ్ వా పలువురు విఖ్యాత ఆటగాళ్లను సైతం లెజెండ్స్ లీగ్ పేరుతో టీ-20 రొంపిలోకి దించుతున్నారు. భారత స్వాతంత్య్ర‌ వజ్రోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 16 నుంచి దేశంలోని పలు నగరాలలో జరిగే లెజెండ్స్ లీగ్‌ను నిర్వహించనున్నారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ఇంటర్నేషనల్ లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, దక్షిణాఫ్రికా లీగ్‌లో కేప్ టౌన్ క్యాపిటల్స్ జట్లను దక్కించుకోడం తమకు గర్వకారణంగా ఉందని, క్యాపిటల్స్ జట్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని జీఎమ్మార్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గ్రంథి అంటున్నారు. లెజెండ్స్ లీగ్‌లోని ఓ జట్టుకు యాజమాన్య హక్కులు దక్కించుకోడం తమకు ఆనందంగా ఉందని అదానీ స్పోర్ట్స్ లైన్ సంస్థ డైరెక్టర్ ప్రణవ్ అదానీ ప్రకటించారు. లెజెండ్స్ లీగ్‌ను కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్, లక్నో, ఢిల్లీ, కటక్, జోధ్‌పూర్ వేదికలుగాను, టైటిల్ పోరును డెహ్రాడూన్ వేదికగాను నిర్వహించాలని లెజెండ్స్ లీగ్ నిర్వాహక సంఘం నిర్ణయించింది.

గత తరాల గొప్పగొప్ప క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లతో కూర్చిన జట్లతో తాము నిర్వహించే లెజెండ్స్ లీగ్ పట్ల కార్పొరేట్ సంస్థలు అదానీ, అంబానీ ఆసక్తి చూపడం తమకు గర్వకారణమని లీగ్ సీఈవో, కోఫౌండర్ రామన్ రహేజా చెబుతున్నారు. దేశ ఆర్థిక, వ్యాపార రంగాలనే తమ గుప్పిట్లో పెట్టుకున్న‌ ఈ బడాబాబులు...క్రికెట్ లీగ్‌లను ఏం చేస్తారో మరి.!

First Published:  26 Aug 2022 6:47 AM GMT
Next Story