Telugu Global
Sports

భారత క్రీడారంగంలో సరికొత్త మార్పు!

భారత క్రీడారంగంలో సరికొత్త మార్పు చోటు చేసుకొంది. గతంలో ఎన్నడూలేని విధంగా పలు రకాల క్రీడల్లో విశ్వవిజేతలుగా భారత క్రీడాకారులే ఉంటున్నారు.

భారత క్రీడారంగంలో సరికొత్త మార్పు!
X

భారత క్రీడారంగంలో సరికొత్త మార్పు!

భారత క్రీడారంగంలో సరికొత్త మార్పు చోటు చేసుకొంది. గతంలో ఎన్నడూలేని విధంగా పలు రకాల క్రీడల్లో విశ్వవిజేతలుగా భారత క్రీడాకారులే ఉంటున్నారు.

ప్రపంచంలోనే జనాభాపరంగా రెండు అతిపెద్ద దేశాలలో ఒకటైన భారత్ గత దశాబ్దకాలంలో క్రీడాపరంగా గత కొన్నిదశాబ్దాలుగా సాధించలేని ప్రగతిని, ఫలితాలను చవిచూసింది.

విశ్వవిజేతలు నాడు నేడు...!

దశాబ్దకాలానికి ముందు వరకూ భారత్ అత్యధికమంది ప్రపంచ చాంపియన్లను తయారు చేసిన క్రీడ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ మాత్రమే. ఆ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ పుణ్యమా అంటూ చదరంగ క్రీడ, అభినవ్ భింద్రా జోరుతో షూటింగ్ లోను, మేరీకోమ్ ప్రతిభతో మహిళల బాక్సింగ్ లోనూ భారత్ తరపున అతికొద్దిమంది మాత్రమే విశ్వవిజేతలు వెలుగులోకి రాగలిగారు. టీమ్ గేమ్స్ లో మాత్రం హాకీ, క్రికెట్, కబడ్డి లాంటి క్రీడల్లో భారత్ ప్రపంచ చాంపియన్ గా నిలువగలిగింది.

మూడేళ్లలోనే తిరుగులేని విశ్వవిజేత నీరజ్ చోప్రా..

భారత క్రీడావిధానంలో సమూల మార్పులతో అథ్లెటిక్స్, విలువిద్య, కుస్తీ, షూటింగ్ క్రీడల్లో విశ్వవిజేతలను, చదరంగ క్రీడలో ప్రఙ్జానంద్ లాంటి రజత విజేతలను భారత్ తయారు చేయగలిగింది.

ట్రాక్ అండ్ ఫీల్డ్ వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్, ప్రపంచ బంగారు పతకాలు సాధించిన ఒకే ఒక్క భారత అథ్లెట్ నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతకంతో సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ కేవలం 25 సంవత్సరాల వయసుకే ప్రపంచ పోటీల స్వర్ణ, రజత, ఒలింపిక్స్ బంగారు, ఆసియాక్రీడలు, కామన్వెల్త్ గేమ్స్,డైమండ్ లీగ్ స్వర్ణ పతకాలతో భారత్ ఖ్యాతిని ఎవరెస్టు ఎత్తుకు చేర్చాడు.

హంగెరీ రాజధాని బుడాపెస్ట్ వేదికగా ఇటీవలే ముగిసిన 2023 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పురుషుల జావలిన్ త్రోలో హాట్ ఫేవరెట్ నీరజ్ చోప్రా అలవోకగా బంగారు పతకంతో విశ్వవిజేతగా నిలిచాడు.

క్వాలిఫైయింగ్ రౌండ్లో 88.77 మీటర్ల రికార్డుతో ఫైనల్స్ కు అర్హత సంపాదించిన నీరజ్..గోల్డ్ మెడల్ పోరులో 88.17 మీటర్ల రికార్డుతోనే స్వర్ణపతకం సాధించడం విశేషం.

మొత్తం 12మంది అత్యుత్తమ అథ్లెట్ల నడుమ జరిగిన ఈ మెడల్ రౌండ్ సమరంలో నీరజ్ తిరుగులేని విజేతగా అవతరించాడు.

భారత క్రీడాచరిత్రలో వ్యక్తిగత విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన రెండో అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డుల్లో చేరాడు.షూటర్ అభినవ్ భింద్రా తొలి అథ్లెట్ కాగా..నీరజ్ చోప్రా ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. అయితే...అథ్లెటిక్స్ లో ప్రపంచ బంగారు పతకం సాధించిన తొలి, ఏకైక క్రీడాకారుడు నీరజ్ చోప్రా మాత్రమే.

ప్రస్తుతం అంతర్జాతీయ పురుషుల జావలిన్ త్రో లో నీరజ్ చోప్రా ఎదురులేని మొనగాడు అన్నా అతిశయోక్తికాదు.


17 ఏళ్లకే విలువిద్య ప్రపంచ విజేత....

ఇతిహాస క్రీడ విలువిద్యలో విశ్వవిజేతగా నిలవాలంటే వయసు, అనుభవంతో ఏమాత్రం పనిలేదని 17 ఏళ్ల మరాఠీ ఆర్చర్ ఆదితీ చాటి చెప్పింది. బెర్లిన్ వేదికగా ముగిసిన 2023 ప్రపంచ విలువిద్య పోటీల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది....

విలువిద్య మహిళల విభాగంలో భారత పతాకాన్ని రెపరెపలాడిస్తూ వచ్చిన దిగ్గజాలు డోలా బెనర్జీ, దీపికా కుమారి, బాంబ్యేలాదేవి, ముస్కాన్ కిరార్, లక్ష్మీరాణి మాజీ, రాజ్ కౌర్ సాధించలేని ఘనతను మరాఠీ మొలక ఆదితీ గోపీచంద్ స్వామి చిన్నవయసులోనే సాధించింది.

మహారాష్ట్ర్రకు చెందిన 17 సంవత్సరాల అదితీ..జర్మనీ రాజధాని బెర్లిన్ వేదికగా ముగిసిన 2023 ప్రపంచ విలువిద్య పోటీల టీమ్, వ్యక్తిగత విభాగాలలో జంట స్వర్ణాలు సాధించడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకొంది.

ప్రపంచ విలువిద్య మహిళల చరిత్రలోనే అత్యంత పిన్నవయసులో విశ్వవిజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

ఖేలో ఇండియా క్రీడలతో వెలుగులోకి.....

సతారా ఆర్చరీ అకాడమీలో శిక్షణతో రాటుదేలిన ఆదితి సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో మెరికలాంటి ఆర్చర్ గా గుర్తింపు తెచ్చుకొంది. నిరంతరం సాధన కు పట్టుదలను జోడించి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఖేలో ఇండియా క్రీడల్లో సైతం సత్తా చాటుకోడం ద్వారా అంతర్జాతీయస్థాయి శిక్షణకు ఎంపికయ్యింది.

భారత క్రీడాప్రాధికార సంస్థ ప్రోత్సాహంతో తిరుగులేని ఆర్చర్ గా రూపుదిద్దుకొంది.

ఐర్లాండ్ వేదికగా జరిగిన 2023 ప్రపంచ యువజన ( అండర్ -18 ) విలువిద్య పోటీలలో జంట స్వర్ణాలతో విశ్వవిజేతగా నిలిచింది. అంతటితోనే ఆగిపోకుండా..

జర్మనీ రాజధాని బెర్లిన్ వేదికగా జరిగిన ప్రపంచ పోటీలలో సైతం అత్యుత్తమంగా రాణించింది.

మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం కోసం జరిగిన పోరులో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెసీరాను 149- 147 పాయింట్ల తేడాతో అదితీ అధిగమించడం ద్వారా విశ్వవిజేతగా నిలిచింది. ఇంత చిన్నవయసులో భారత్ కు చెందిన ఓ ఆర్చర్ ప్రపంచ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి.

మహిళల టీమ్ విభాగంలో ప్రపంచ టైటిల్ కోసం జరిగిన పోరులో సైతం పర్నీత్ కౌర్, వెన్నెం జ్యోతీ, అదితీలతో కూడిన భారతజట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెసీరా, డాఫ్నీ క్వింటెరో, అనా సోఫియాలతో కూడిన జట్టును 235-229 పాయింట్లతో చిత్తు చేసి తొలిసారిగా ప్రపంచ టైటి్ల్ ను కైవసం చేసుకొంది.

పురుషుల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన మొనగాడిగా భారత్ కే చెందిన ఓజాస్ ప్రవీణ్ డియోటేల్ నిలిచాడు. స్వర్ణపతకం పోరులో పోలెండ్ కు చెందిన లూకాస్ ను ఒకే ఒక్కపాయింట్ తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచాడు.

ప్రపంచ విలువిద్య కాంపౌండ్ విభాగం పురుషుల, మహిళల విభాగాలలో భారత ఆర్చర్లు..మూడు బంగారు పతకాలు సాధించడం ఇదే మొదటిసారి.

బాక్సింగ్ లోనూ విశ్వవిజేతలు...

అంతర్జాతీయ బాక్సింగ్ పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సాధించలేని విజయాలను మహిళలు సాధిస్తూ దేశానికే వన్నె తెస్తున్నారు. న్యూఢిల్లీ వేదికగా ముగిసిన 2023 ప్రపంచ బాక్సింగ్ పోటీల నాలుగు విభాగాలలో భారత మహిళలు విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు....

భారత మహిళా బాక్సింగ్ అంటే గతేడాది వరకూ కేవలం మేరీకోమ్ పేరు మాత్రమే వినిపించేది. మేరీకోమ్ జోరు తగ్గిపోడంతో ఆమె వారసులుగా నలుగురు బాక్సర్లు తెరమీదకు వచ్చారు. నాలుగు విభాగాలలో విశ్వవిజేతలుగా నిలవడం ద్వారా వారేవ్వా! అనిపించుకొన్నారు.

న్యూఢిల్లీ వేదికగా ఇటీవలే ముగిసిన 2023 ప్రపంచ మహిళా బాక్సింగ్ టోర్నీలో మొత్తం 10 విభాగాలలో టైటిల్స్ కోసం పోటీ జరిగితే నాలుగు విభాగాలలో

భారత బాక్సర్లు ( నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గెయిన్, నీతూ గంగాస్, సవీటీ బూరా ) బంగారు పతకాలు గెలుచుకొని 19 సంవత్సరాల క్రితం నెలకొల్పిన రికార్డును సమం చేయగలిగారు.

మేరీకోమ్ బాటలో నిఖత్ జరీన్

తెలంగాణాలోని నిజామాబాద్ నుంచి ప్రపంచ బాక్సింగ్ లోకి దూసుకొచ్చిన నిఖత్ జరీన్ వరుసగా రెండోసారి ప్రపంచ టైటిల్ సాధించడం ద్వారా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ సరసన నిలిచింది. గతేడాది టర్కీ వేదికగా ముగిసిన ప్రపంచ బాక్సింగ్ 52 కిలోల విభాగంలో తొలిసారిగా బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ ప్రస్తుత ప్రపంచ టోర్నీ 48-50 కిలోల విభాగంలో సైతం విశ్వవిజేతగా నిలువగలిగింది. వియత్నాం బాక్సర్ తీ టామ్ తో జరిగిన టైటిల్ పోరులో నిఖత్ తిరుగులేని విజయం సాధించింది.

18 ఏళ్లకే ప్రపంచకప్ చెస్ రజతం....

అంతర్జాతీయ చదరంగ క్రీడలోకి భారత దిగ్గజ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వారసులుగా ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు మెరికల్లాంటి టీనేజ్ గ్రాండ్మాస్టర్లు తెరమీదకు వచ్చారు.

అజర్ బైజాన్ రాజధాని బకూ వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ చదరంగ టైటిల్ పోరులో భారత యువగ్రాండ్ మాస్టర్, 18 సంవత్సరాల ప్రఙ్జానంద్ ఫైనల్స్ చేరటమే కాదు..టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత , సూపర్ గ్రాండ్ మాస్టర్ మాగ్నుస్ కార్ల్ సన్ తో తుదివరకూ పోరాడి రజత పతకంతో నిలిచాడు.

ఆనంద్ వారసుడు ప్రఙ్జానంద్!

కేవలం 18 సంవత్సరాల చిరుప్రాయంలోనే ప్రపంచకప్ చెస్ ఫైనల్ చేరడం ద్వారా ప్రఙ్జానంద్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గతంలో భారత సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సాధించిన రికార్డును ఇప్పుడు ప్రఙ్జానంద్ సమం చేయగలిగాడు.

ప్రపంచకప్ రన్నరప్ గా నిలవడం ద్వారా 2024 ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీకి ప్రఙ్జానంద్ అర్హత సంపాదించాడు. 2024 ప్రపంచ చెస్ టైటిల్ కోసం..డిఫెండింగ్ చాంపియన్, గ్రాండ్ మాస్టర్ డి లిరెన్ తో తలపడటానికి అర్హతగా ..కెనడాలోని టొరాంటో వేదికగా 2024 ఏప్రిల్ 2 నుంచి 25 వరకూ క్యాండిడేట్స్ టోర్నీ నిర్వహిస్తారు.

మొత్తం ఎనిమిదిమంది ప్రపంచ మేటి గ్రాండ్ మాస్టర్లు ఈ టోర్నీలో పోటీపడతారు. ఈ ఎనిమిదిమందిలో ప్రఙ్జానంద్ సైతం ఉన్నాడు.

షూటింగ్ , బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లోనూ భారత క్రీడాకారులు కళ్లు చెదిరే విజయాలతో దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు.


First Published:  14 Sep 2023 6:30 AM GMT
Next Story